కాంగ్రెస్ : అయ్య‌య్యో.. “చేతి”లో డ‌బ్బులు లేవ‌య్యో..?

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి దేశాన్ని పాలించిన పార్టీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోందా? అధికార‌ప‌రంగానే కాదు.. ఆర్థికంగానూ ఇబ్బందులును ఎదుర్కొంటుందా? అంటే అవున‌ని స్వ‌యానా పార్టీయే చెబుతోంది. ఖ‌ర్చులు త‌గ్గించుకోండి.. నిధులు ఇవ్వండి.. ఇప్పించండి.. అంటూ ఎంపీల‌ను వేడుకుంటోంది. అంతేకాదు.. సిబ్బందికి జీతాలు కూడా కోత పెడుతోంది. వ‌రుస‌గా రెండో సారి కూడా అధికారానికి దూరం ఉన్న ఆ పార్టీకి నిధులు ఇచ్చేందుకు దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ముఖం చాటేస్తున్నార‌ట‌. ఫ‌లితంగా కాంగ్రెస్ ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

స్వాత్రంత్యానికి పూర్వ‌మే దేశంలో కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకుంది. మ‌హామ‌హుల ఆధ్వ‌ర్యంలో బ్రిటీష్ వారిపై సైతం పోరాడింది. స్వాత్రంత్యం వ‌చ్చిన త‌ర్వాత అతి ఎక్కువ కాలం పాలించింది ఆ పార్టీయే. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అధికారం సంగతి అటుంచితే.. ఆర్థిక ఇబ్బందులు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతగా అంటే.. నిధులు లేకపోవ‌డంతో వ‌చ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల‌లోనూ అభ్యర్థులను నిల‌బెట్ట‌గ‌ల‌మా అని సందేహ‌ప‌డేటంత‌. బీజేపీ దెబ్బ‌కు ఇటు కేంద్రంలో, క్రమంగా రాష్ట్రాల్లో ఆ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనికి తోడు మోదీ తీసుకొచ్చిన ‘నోట్ల రద్దు’ ఆ పార్టీ నోట్లో మట్టికొట్టిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ హవా వేరుగా ఉండేది. దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ఆ పార్టీ అధిష్ఠానం కరుణాకటాక్షాల కోసం తపించిపోయేవారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల తరువాత పరిస్థితి మారింది. ఏటా పార్టీకి విరాళాలు ఇచ్చే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో ఒక్కరు కూడా ఏఐసీసీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదట. దీంతో ఆ పార్టీకి ఇప్పుడు నిధులు కరువయ్యాయి. కనీసం పార్టీ కార్యకలాపాలకు, సిబ్బంది జీతభత్యాలకు కూడా డబ్బులు సరిపోవడం లేదు.

వివిధ ఖర్చుల కోసం ఎదురవుతున్న ఇబ్బందులను ఏఐసీసీ కార్యాలయ అంతర్గత సిబ్బంది ఆ పార్టీ సీనియర్ నేతల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ప్ర‌స్తుతం మూడు రాష్ట్రాల‌లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్క‌డి నుంచి మాత్ర‌మే పార్టీకి నెలవారీ విరాళాలు అందుతున్న‌ట్లు స‌మాచారం. అవి ఏ మూలకూ సరిపోవడం లేదని అధిష్ఠానం భావిస్తున్న‌ట్లుగా తెలిసింది.

ఆర్థిక ఇబ్బందుల నేప‌థ‌ష్యంలో కాంగ్రెస్ పార్టీ ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డంపై దృష్టి సారించింది. త‌మ పార్టీ ఎంపీల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తాజాగా కొన్ని సూచ‌న‌లు జారీ చేసింది. పార్టీ నిధుల ద్వారా విమాన ప్రయాణం చేసే ఎంపీలు చార్జిలు తగ్గించేలా చేస్తూ అలా ఆదా చేస్తూ ఏడాదికి రూ. 50వేలు పార్టీకి అందజేసేలా చూడాలని కోరింది. విమాన ప్రయాణాలు పూర్తిగా మానుకుని రైళ్లల్లోనే ప్రయాణించి స్టేషనరీ, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలని కాంగ్రెస్‌ పొదుపు మంత్రాన్ని ప్రకటించింది. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి అలవెన్సుల్లో భారీ కోత విధించింది. నిధుల సేకరణపై హస్తం పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన ఒక్క రూపాయి ఆదా చేసేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తల కృషి చేయాలని, ఒక వేళల్లో రైళ్లల్లో ప్రయాణం చేయడం సాధ్యం కాకపోతే తక్కువ చార్జీలతో విమాన ప్రయాణాలు ఎంచుకోవాలన్నారు. పార్లమెంట్‌ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు విమానా ప్రయణానికి సొంత డబ్బులు ఉపయోగించుకోవాలని సూచించింది.

ఏఐసీసీ కార్యదర్శులు 1,400 కిలో మీటర్ల ప్రయాణం వరకు చార్జిలు పార్టీ అందజేస్తుందని, అంతకంటే ఎక్కువగా ఉంటే విమానంలో తక్కువ చార్జీలు ఎంచుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. విమాన చార్జిల కంటే రైలు చార్జిలు ఎక్కువగా ఉంటే మాత్రమే నెలకు రెండు సార్లు విమాన చార్జీలు ఇవ్వబడతాయని పేర్కొంద‌ట‌. అలాగే, క్యాంటిన్, విద్యుత్‌ బిల్లులు, వార్తా పత్రికలు, ఇంధనం, మొదలైనవాటిపై అయ్యే ఖర్చులను త‌గ్గించుకోవాల‌ని ఏఐసీసీ ఆఫీస్‌ బేరర్ల‌కు కూడా సూచించిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అలాగే, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శుల అలవెన్సులను త‌గ్గించే ఆలోచ‌న కూడా కాంగ్రెస్ చేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌జల ఆద‌ర‌ణ‌తో పాటు, ఆర్థికంగా కూడా బ‌లంగా ఉండాలి. ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. కానీ ఎంపీల‌కు, నేత‌ల‌కు కాంగ్రెస్ చేస్తున్న సూచ‌న‌ల‌ను గ‌మ‌నిస్తుంటే పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏటేటా కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే నిధులు త‌గ్గిపోతుండ‌డం అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న కాంగ్రెస్ నిధుల ఇబ్బందుల నేప‌థ్యంలో మొత్తం అన్ని స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌గ‌ల‌దా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి పార్టీ మున్ముందు ఎలా పుంజుకుంటుందో చూడాలి.

Show comments