సోము నోట.. చాన్నాళ్లకు ఆ మాట..!

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు ఏవో సులువుగా గుర్తించవచ్చు. కానీ మితృత్వ పార్టీలు, పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏవి అనే విషయం గుర్తించడం కొన్ని సందర్భాల్లో కష్టం. ఆ విషయం పొత్తురాజకీయాలు చేస్తున్న ఆయా పార్టీల్లో ఏవరైనా నేతలు చెబితే కానీ ఆ పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లు తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీల పరిస్థితి దాదాపు ఇదే. 2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ. జనసేన పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తుపెట్టుకున్నాయి. జనసేన, బీజేపీ కలసి రాజకీయాలు చేస్తాయని, 2024లో జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యలు చేపట్టిన కొత్తలో సోము వీర్రాజు తరచూ ప్రకటనలు చేసేవారు. అయితే జనసేన నుంచి మాత్రం ఈ తరహా ప్రకటనలు అప్పుడు రాలేదు, ఇప్పుడు రావడం లేదు.

అధ్యక్షుడైన కొత్తలో సోము నోట వినిపించే జనసేన మాట.. ఇటీవల కాలంలో వినిపించడం లేదు. ముఖ్యంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల తర్వాత సోము వీర్రాజు సహా బీజేపీ నేతలు తమ మాటల్లో జనసేన పదం పలకలేదు. మునుపటిలాగా జనసేనతో కలసి రాజకీయాలు చేస్తాం.. ఏపీలో అధికారంలోకి వస్తాం.. అనే మాటలు అస్సలు మాట్లాడలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎంతో ఆశతో పోటీ చేసిన బీజేపీ.. రెండో స్థానంలో నిలవాలని ఆశించింది. జనసేన బలం తమకు తోడవుతుందని భావించింది. ఆ పార్టీ అభ్యర్థి రత్నపభ కూడా.. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తనను గెలిపిస్తాడని మాట్లాడారు. కానీ పరిస్థితి తల్లకిదులైంది. కనీసం చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. జనసేన ఓట్లు ఏ మాత్రం తమకు పడలేదని బీజేపీ నేతలు గ్రహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు నెలలుగా బీజేపీ, జనసేన పార్టీలు కలసి రాజకీయాలు చేసింది లేదు, ఆ పార్టీల నేతలు భేటీ అయిన సందర్భం లేదు.

అయితే ఇన్నాళ్లు జనసేన పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పంద్రాగస్టు రోజున మళ్లీ మునుపటి ప్రకటనను చేశారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ, జనసేన పార్టీలు కలసి పనిచేస్తాయని సోము వీర్రాజు ప్రకటన చేశారు. సోము వీర్రాజు చాన్నాళ్ల తర్వాత ఇలాంటి ప్రకనట చేయడం విశేషం. దీనికి గల కారణాలను ఏమిటనే చర్చ ప్రారంభమైంది. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. విశాఖ ఉక్కు విక్రయం, పోలవరం నిధులు సహా పలు అంశాలపై రాష్ట్ర బీజేపీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. అంతిమంగా ఈ అంశాలు బీజేపీ ఎదుగుదలకు ఆటంకాలుగా మారాయి. బీజేపీ పయనం ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి చందంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేనతో కలసి వెళితేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చిన కమలం నేతలు.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత మళ్లీ జనసేన మాట తమ నోట పలుకుతున్నారు.

Also Read : నేతల కోసం ఏపీ బీజేపీ ప్రత్యేక వేట

Show comments