1986 గోదావరి వరదల గురించి తెలుసా..?

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అప్పటికే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రజల మనసు కీడు శంకిస్తోంది. గోదారి గట్టు వెంట పలువురు కాపలా ఉన్నారు. గట్టు ఏ క్షణాని తెగిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గట్టు బలహీనంగా ఉన్న చోట ఇసుక, మట్టి తెచ్చి పోస్తున్నారు. ప్రజలు తమకు చేతనైనంత చేసి గట్టు తెగకుండా చూస్తున్నారు. ఇలా చేస్తూనే ఆగస్టు 15 రాత్రి కాపలా ఉన్నారు. అర్థరాత్రి ఒక్కసారిగా గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. గోదావరి గట్టు తెగిపోయింది. నది వెంబడి ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తింది. కోనసీమ వణికింది. భద్రాచలం పట్టణం ముగినిగిపోయింది.

ప్రాణాలకు కాపాడుకునేందుకు ప్రజలు ఎత్తేయిన ప్రదేశాలు, చెట్లు, మిద్దెలు, మేడలు ఎక్కారు. ప్రాణ నష్టం అయితే తప్పింది కానీ.. ఆపార ఆస్తినష్టం సంభవించింది. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. పూరిపాకలు నేలమట్టమయ్యాయి. మేడలు తప్పా.. అన్ని కొట్టుకుపోయాయి. ఇళ్లతోపాటు అందులోని వస్తువులను గోదారమ్మ తీసుకెళ్లింది. పొలాల్లో ఇసుక, ఒండ్రు మట్టి మేటలు వేసింది. గోదారమ్మ ప్రతాపానికి ఉభయ గోదావరి జిల్లాలు వణికిపోయాయి. ఈ ఘటన జరిగి ఆగస్టు 16వ తేదీకి 35 ఏళ్లు అవుతోంది. నాటి ఘటనలను గుర్తుచేసుకుంటున్న గోదావరి వాసులు.. ఆ కాళరాత్రి మిగిల్చిన కష్టాలను మననం చేసుకుంటున్నారు.

1986 ఆగస్టు 16 వరదలను గోదావరి నదీ చర్రితలోనే అతిపెద్ద వరదగా చెప్పుకుంటారు. అంతకు ముందు కూడా వరదలు వచ్చినా.. ఈ స్థాయిలో వరద రావడం అదే ప్రథమం. ఆగస్టు 16కు ముందు కొన్ని రోజుల నుంచే గోదావరికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటి, రెండు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 11.75 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేస్తారు. నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ సమయంలో బ్యారేజీకి 13 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది.

ఇక మూడో ప్రమాద హెచ్చరిక నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకున్న సమయంలో జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక సమయంలో 17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆగస్టు 15వ తేదీన మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆ రోజు గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవడంతో వరద అమాంతం పెరిగిపోయింది. ఆ రోజు రాత్రి 36 లక్షల క్యూసెక్కుల వరద కాటన్‌ బ్యారేజీని తాకింది. దీంతో గోదావరి గట్టు తెగిపోయి వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. వారం రోజుల వరకూ గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాలను అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ, ముఖ్యమంతి ఎన్టీ రామారావు పరిశీలించారు. ఈ వరదల తర్వాత గోదావరి గట్టుల ఎత్తును పెంచి పటిష్టం చేశారు.

1986 వరదల తర్వాతనే గోదావరి వరద నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. భద్రాచలం నుంచి మొదలుపెట్టి కుంట, కోయిలగూడెం, పోలవరం, రాజమండ్రి, కాటన్‌ బ్యారేజీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టాన్ని కొలుస్తూ వరదను అంచనా వేస్తున్నారు. తద్వారా వరదను ఎదుర్కొనేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 1986లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల వరదను ఆధారంగా చేసుకునే పోలవరం స్పిల్‌ వే సామర్థ్యాన్ని నిర్ణయించారు. ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేసేలా పోలవరం స్పిల్‌ వేను డిజైన్‌ చేశారు.

Show comments