IND vs AUS: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం! గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఇవే

ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం! గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఇవే

  • Author Soma Sekhar Published - 08:52 AM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 08:52 AM, Sat - 23 September 23
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం! గెలుపునకు 5 ప్రధాన కారణాలు ఇవే

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ నెగ్గి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా అదే ఊపుతో ఆసీస్ ను మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మెుదట బౌలింగ్ లో సత్తా చాటిన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ లో సమష్టిగా రాణించడంతో జట్టు స్ఫూర్తిదాయక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా.. టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలున్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా విజయానికి 5 కారణాలు

1. టాస్ నెగ్గడం

క్రికెట్ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకమైన విషయం అన్న సంగతి అందరికి తెలిసిందే. చాలా మ్యాచ్ ల్లో టాస్ నెగ్గితే సగం మ్యాచ్ నెగ్గినట్లేనని క్రీడా పండితుల అభిప్రాయం. ఇక ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా టాస్ నెగ్గడం, బౌలింగ్ ఎంచుకోవడం విజయంలో కీలక పాత్రలు పోషించాయనే చెప్పాలి. అంతకుముందు పేస్ కు అనుకూలంగా పిచ్ కనిపించడంతో.. టాస్ గెలిచన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక కెప్టెన్ నమ్మకాన్ని టీమిండియా పేసర్లు నిలబెట్టారు. ఇక ఈ మ్యాచ్ లో పిచ్ లో వేగం ఉంటే షమీ ఎంత ప్రమాదకరంగా మారుతాడో ఈ మ్యాచ్ ద్వారా చూపించాడు. టీమిండియా విజయంలో టాస్ కీలకంగా మారిందని చెప్పవచ్చు.

2. మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్

ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో మహ్మద్ షమీ హీరో. అవును నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను వణికించాడు. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తన ప్రతాపం చూపాడు. 5 వికెట్లతో ఆసీస్ టీమ్ నడ్డివిరిచాడు షమీ. ఇక పిచ్ లో వేగం ఉంటే తనను ఎవరూ ఆపలేరని ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు. కొద్దిరోజులుగా తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు అని విమర్శలు ఎదుర్కొన్న షమీ.. ఆ విమర్శలన్నింటికి తన బౌలింగ్ తోనే సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో బుల్లెట్లలా దూసుకొచ్చే షమీ బంతులను ఎదుర్కొవడం ఆసీస్ బ్యాటర్ల వల్ల కాలేదు. ఇన్నింగ్స్ 4వ బంతికే తన వికెట్ల ఖాతా తెరిచి, భారత్ కు బ్రేక్ త్రూ అందించాడు. ఇక షమీ తన చివరి స్పెల్ లో 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి కంగారూలను చీల్చిచెండాడాడు.

3. KL రాహుల్ కెప్టెన్సీ, బౌలింగ్ మార్పులు

కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో.. తాత్కాలిక కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు కేఎల్ రాహుల్. అయితే కెప్టెన్ గా తనకు ఇదివరకే ఉన్న అనుభవాన్ని ఈ మ్యాచ్ లో ఉపయోగించాడు ఈ స్టార్ బ్యాటర్. టాస్ నెగ్గడం నుంచి బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించడం, బ్యాటింగ్ లో అర్దశతకం సాధించడం వరకు సారథిగా రాహుల్ విజయం సాధించాడు. ఉన్న ఐదుగురు బౌలర్లను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు రాహుల్. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంలోనే సగం విజయం సాధించాడు. ఆసీస్ బ్యాటర్లు విజృంభిస్తున్నారు అనుకునే లోపే బౌలింగ్ లో మార్పులు చేసి.. వారి అటాకింగ్ కు చెక్ పెట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా అన్ని సరైన నిర్ణయాలే తీసుకుని మరోసారి తనలో ఓ విజయవంతమైన కెప్టెన్ ఉన్నాడని రుజువుచేశాడు.

4. ఓపెనింగ్ జోడీ శుభారంభం

277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యువ ఓపెనర్లు శుబ్ మన్ గిల్-రుతురాజ్ గైక్వాడ్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన ఆసీస్ పేస్ దళాన్ని ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఏ మాత్రం భయంలేకుండా వారు ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. ఆసీస్ బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడ్డ ఈ పిచ్ పై ఈ యువ ఓపెనర్లు అలవోకగా పరుగులు సాధించారు. ఇద్దరు పోటీమరి షాట్లు కొట్టారు. దీంతో తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వీరిద్దరు తొలి వికెట్ కు 142 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభం అందించారు. గిల్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 రన్స్ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. వీరిద్దరు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంతో.. మిడిలార్డర్ పై ఒత్తిడి తగ్గి.. విజయానికి కారణం అయ్యారు.

5. KL రాహుల్ – సూర్యకుమార్ భాగస్వామ్యం

21 ఓవర్లలో 142/0 పరుగులతో ఉన్న టీమిండియా సునాయసంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ స్పిన్నర్ అడమ్ జంపా అనూహ్యంగా స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను పెవిలియన్ కు పంపాడు. దీంతో జట్టు స్కోర్ 151/3కు చేరింది. ఆదుకుంటాడనుకున్న శ్రేయస్ అయ్యర్(3) విఫలం కావడంతో.. టీమిండియాపై ఒత్తిడి పెరగడం ప్రారంభం అయ్యింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన తాత్కాలిక కెప్టెన్ రాహుల్(58*), ఇషాన్ కిషన్(18)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కమ్మిన్స్ ఇషాన్ ను అవుట్ చేయడంతో.. 185 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది టీమిండియా. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. రాహుల్-సూర్యలు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ టీమిండియాను విజయంవైపు తీసుకెళ్లారు. వన్డేలకు పనికి రాడు అన్న అపవాదును తొలగించుకుంటూ.. 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్ తో 50 పరుగులు చేసి.. విజయానికి మరో 12 పరుగులు అవసరం అన్న సమయంలో పెవిలియన్ చేరాడు. వీరిద్దరు ఐదో వికెట్ కు 80 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంతోనే టీమిండియా విజయం సాధించింది.

Show comments