iDreamPost

టీవీ సినిమాల్లో ఠాగూర్ సింగ్ ముద్ర

టీవీ సినిమాల్లో ఠాగూర్ సింగ్ ముద్ర

బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా విలన్ గా పేరు పొందిన అనుపమ్ శ్యామ్ ఓజా మొన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల లైఫ్ లైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకోలేక దివికేగారు. ఈయన స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్. భారతేందు అకాడమీ అఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ విద్యార్ధిగా ఈయన నట ప్రస్థానం మొదలైంది. వయసు 63 సంవత్సరాలు. ఈయనని సజ్జన్ సింగ్ ఠాకూర్ అని కూడా పిలుస్తారు. దీనికి కారణం స్టార్ ప్లస్ ఛానల్ లో మన్ కె ఆవాజ్ ప్రతిగ్య కార్యక్రమంలో ఈ పేరుతోనే బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాతే అవకాశాలు పెరిగాయి

అనుపమ్ శ్యామ్ 1996లో సర్దారీ బేగంతో తెరంగేట్రం చేశారు. దస్తక్, జయ గంగ, తమన్నా, దుష్మన్ లాంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు చేశారు. 1998లో రాంగోపాల్ వర్మ తీసిన సత్యతో అనుపమ్ కు పెద్ద బ్రేక్ దక్కింది. అక్కడి నుంచి అవకాశాల వేగం పెరిగింది. మణిరత్నం దిల్ సేలోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. కచ్చే దాగే, సంఘర్ష్ లు కమర్షియల్ సక్సెస్ లు అందించాయి. 2000 సంవత్సరంలో వచ్చిన అమీర్ ఖాన్ లగాన్ పెద్ద బ్రేక్ గా చెప్పుకోవచ్చు. అంతఃపురం హిందీ రీమేక్ శక్తిలోనూ నటించారు. నాయక్, తక్షక్, గోల్ మాల్, ఢోకా, హల్లాబోల్, స్లమ్ డాగ్ మిలియనీర్, రక్తచరిత్రలు అనుపమ్ శ్యామ్ కు బాగా పేరు తీసుకొచ్చాయి.

గత ఐదారేళ్ళగా ఈయన సినిమాలు బాగా తగ్గించుకున్నారు. వయసుతో పాటు ఆరోగ్య కారణాల వల్ల చాలా తక్కువగా ఒప్పుకునేవారు. టీవీ రంగంలోనూ ఈయన సంచలనం. 1995లో అమరావతి కి కహానియాతో మొదలుపెట్టి అమ్మా అండ్ ఫామిలీ, జై హనుమాన్, రిస్తే, హమ్ నే లీ హై శపత్ ఇలా అన్ని షోలు సీరియల్స్ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగు ప్రేక్షకులకు ఈయన ఎక్కువ సుపరిచితుడు కాకపోయినా వర్మ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. తెల్లని గుబురు గడ్డంతో పక్కింటి తాతయ్యలా అనిపించే అనుపమ్ శ్యామ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

Also Read : అమ్మాయిలతో ‘పాగల్’ ప్యార్ కహాని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి