జాంబీ రెడ్డి రివ్యూ

By Ravindra Siraj Feb. 05, 2021, 02:25 pm IST
జాంబీ రెడ్డి రివ్యూ

గత ఏడాది లాక్ డౌన్ టైంలో ప్రకటించి ఎప్పుడు జరిగిందో ఎప్పుడు పూర్తయ్యిందో తెలియనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి ఇవాళ థియేటర్ల అడుగు పెట్టింది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా చల్లారిపోయి కొత్త ఎంటర్ టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన జాంబీ కాన్సెప్ట్ కి కామెడీ టచ్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏదో కొత్తగా ట్రై చేశాడనే కామెంట్స్ ట్రయిలర్ చూసినప్పుడే వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్లతో నటించిన తేజ్ సజ్జ ఫుల్ లెన్త్ హీరోగా నటించిన జాంబీ రెడ్డి ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

ఆటనే పేరుగా పెట్టుకున్న మారియో(తేజ సజ్జ) తన స్నేహితులతో కలిసి వీడియో గేమింగ్ లో ప్రయోగాలు చేస్తూ అందులోనే గొప్ప స్థాయికి చేరుకోవాలని కలలు కంటూ ఉంటాడు. దేశంలో కరోనా వ్యాక్సిన్ లు కనిపెడుతున్న సమయంలో ఓ స్నేహితుడి(ఆర్జె హేమంత్) పెళ్లి కోసం కర్నూలు జిల్లా రుద్రవరం వెళ్తారు మారియో ఫ్రెండ్స్. మధ్యలో జరిగిన ఓ యాక్సిడెంట్ వల్ల కళ్యాణ్(కిరీటి)కి అతనికి తెలియకుండా జాంబీ వైరస్ సోకుతుంది. గ్రామానికి చేరుకున్నాక వైరస్ ఒకొరొకరికి పాకిపోయి అందరూ జాంబీలుగా మారడం మొదలుపెడతారు. దీనికి తోడు అక్కడ రెండు గ్రామాల మధ్య శత్రుత్వం సమస్యను పెద్దది చేస్తుంది. దీంతో మారియో నందిని(ఆనందిని) సహాయంతో దీన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఇందులో అతను ఎలా విజయం సాధించాడు అనేది తెరమీదే చూడాలి.

నటీనటులు

బాలనటుడిగా చిరంజీవితో మొదలుపెట్టి మహేష్ బాబు దాకా ఎందరో స్టార్ల ముందు బెరుకు లేకుండా నటించిన తేజ సజ్జలో స్పార్క్ ఉంది. ఓ బేబీలోనే డెబ్యూ చేసినప్పటికీ అది సమంతా షో కావడంతో సోలో హీరోగా తనకు ఈ జాంబీ రెడ్డినే ఫస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా ఇంకా లేతదనం ఉన్న తేజ సజ్జ వయసు పెరిగే కొద్దీ కలిగే పరిణితితో పాటు నటన పరంగా కూడా మెరుగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉన్నంతలో నీట్ గా చేశాడు. ఇది హారర్ మూవీ కనక పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కువ చేయడానికి కూడా స్కోప్ లేకపోయింది.

దక్ష నగార్కర్ క్లాస్ గా కనిపించే మాసీ లుక్స్ తో బాగుంది. ఒకటి రెండు సీన్లల్లోనే కనిపిస్తుంది. మంచి అందం టాలెంట్ ఉన్నా టాలీవుడ్ లో అవకాశాలు కరువైన ఆనంది తనకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంది. క్యాస్టింగ్ పరంగా సీనియర్లనే దీనికి సెట్ చేసుకోవడం చాలా ప్లస్ అయ్యింది. పృథ్వి, రఘు బాబు, అదుర్స్ రఘు, మహేష్ విట్టా, విజయ్ రంగ రాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, హిమతేజ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు కామెడీతో పాటు సీరియస్ నెస్ కూడా బాగా పండించారు. గెటప్ శీను ఎక్కువ మార్కులు కొట్టేశాడు. అన్నపూర్ణమ్మ లాంటి అనుభవజ్ఞులను సెలెక్ట్ చేసుకోవడం తెలివైన ఆలోచన

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ప్రశాంత్ వర్మది విభిన్నమైన టేస్ట్. తన ఆలోచనలు రెగ్యులర్ దర్శకుల తరహాలో ఉండవు. అ!, కల్కిలోనే అది రుజువైనా వాటిని మించిన రిస్క్ ని జాంబీ రెడ్డితో తీసుకున్నాడు. నిజానికి ఈ జానర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనిది. హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు తప్ప ఈ జాంబీ ప్రపంచం గురించి ఎవరికీ అంత అవగాహన లేదు. అయితే అవన్నీ దాదాపుగా చాలా సీరియస్ గా సాగుతూ భయపెట్టే డ్రామాలు. అలా చేస్తే కొత్తదనం ఏముంటుందనే ఆలోచనతో పాటు కామెడీని మిక్స్ చేస్తే మాస్ కు దగ్గరవుతుందన్న ప్రశాంత్ ప్లాన్ మెచ్చుకోదగినదే.

ఇలాంటి వాటితో సౌత్ ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. ఫస్ట్ హాఫ్ లో సెటప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్న ప్రశాంత్ వర్మ అక్కడ స్క్రీన్ ప్లే ఇంకొంచెం వేగంగా పరిగెత్తేలా రాసుకుని ఉంటే అవుట్ ఫుట్ ఇంకో స్థాయిలో ఉండేది. మరీ గొప్పగా అనిపించే సన్నివేశాలేవీ మొదటి సగంలో కనిపించవు. సీన్లు అలా వచ్చి వెళ్తూ ఉంటాయే తప్ప అబ్బ ఈ ట్విస్ట్ భలే ఉందే అని ఎక్కడా అనిపించదు. ఇంటర్వెల్ దాకా ఇంతే. పైగా ప్రమోషన్ లోనే స్టోరీ మొత్తం చెప్పేశారు కాబట్టి సస్పెన్స్ ఏమి లేదు. కథనంలో చాలా వైవిధ్యం ఉంటే తప్ప అంత ఈజీగా ఆడియన్స్ ఇలాంటి వాటికి కనెక్ట్ కారు.

ఆ లోపం సెకండ్ హాఫ్ లో చాలా మటుకు కవర్ చేసే ప్రయత్నం జరిగింది. ఊరంతా జాంబీలయ్యాక తేజ బ్యాచ్ వాళ్ళనుంచి తప్పించుకునే ఎపిసోడ్లు లాజిక్ కి దూరంగా సాగినా ఎంగేజింగ్ గా చూపడంలో ప్రశాంత్ సక్సెస్ అయ్యాడు. ఒకదశలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఇవి కొంత సాగదీసినట్టు అనిపించినా ఇవి ఎంజాయ్ చేయడానికే వచ్చిన వాళ్లకు టైం పాస్ చేయిస్తాయి. అయితే వైరస్ రావడానికి సైన్టిఫిక్ గా మంచి రీజన్ చూపించిన ప్రశాంత్ దాని అంతమొంతించేందుకు ఎంచుకున్న గుడి మార్గం కొంత కృత్రిమంగా, సింపుల్ గా అనిపిస్తుంది. తీవ్రమైన సమస్యను ఇంత సింపుల్ గా తేల్చారేమిటా అనే ఫీలింగ్ తెస్తుంది.

ఇది రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కోసం తీసింది కాదు కాబట్టి ఒకరకంగా చెప్పలంటే ప్రశాంత్ వర్మ తాను అనుకున్న టార్గెట్ ని పాస్ మార్కులతోనే రీచ్ అయ్యాడు. హిలేరియస్ గా అనిపించే కామెడీ లేకపోయినా మరీ బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ ని నడిపించిన విధానం జాంబీ రెడ్డిని చావకుండా బ్రతికించింది. లాజిక్స్ మీద ఇంకొంచెం సీరియస్ గా వర్క్ చేసి ఉంటే ఎక్కువ కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇంకే మార్గం దొరక్కపోవడంతో హడావిడి ముగింపు చివరిలో కొంత నిరాశ కలిగించినా ఫైనల్ గా ప్రశాంత్ వర్మ నుంచి కల్కి కంటే బెటర్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పొచ్చు

సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ కి ఇందులో పాటల పరంగా మరీ ఎక్కువగా చేయడానికి ఏమి లేదు కాబట్టి తన పనితనమంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద చూపించాడు. అక్కడక్కడా సౌండ్ బాగా ఎక్కువైనప్పటికీ ఓవరాల్ గా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. అనిత్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లోనూ ఇంత క్వాలిటీని చూపించడంలో ఇతని పాత్ర చాలా ఉంది. సాయి బాబు ఎడిటింగ్ నిడివి ఎక్కువ రాకుండా ట్రై చేసింది. ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోవచ్చు. సయ్యిద్ తాజుద్దీన్ సంభాషణలు పర్వాలేదు. ఆపిల్ ట్రీ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ గా అనిపించేవి

స్టోరీ లైన్
క్యాస్టింగ్
సెకండ్ హాఫ్
కామెడీ

మైనస్ గా తోచేవి

సౌండ్ ఎక్కువైన పాటలు
మొదటి సగం సాగతీత
మిస్సైన చిన్న లాజిక్స్
హడావిడి క్లైమాక్స్

కంక్లూజన్

జాంబీ లాంటి మనకు అలవాటు లేని కల్చర్ లో తెలుగు సినిమా తీయడం సాహసమే. దాన్ని సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా కామెడీని మిక్స్ చేసి ఏదో కొత్తగా చెప్పాలన్న ప్రశాంత్ వర్మ ప్రయత్నం మెచ్చదగినదే. అయితే థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ కి తీసినవాళ్లు ఎంత రిస్క్ చేశారనేది అనవసరం. తనను ఎంత బాగా మెప్పించారన్నదే చూసుకుంటారు. ఆ కొలతల్లో తేడానే ఏ సినిమానైనా హిట్టా ఫ్లాపా అనేది డిసైడ్ చేస్తాయి. జాంబీరెడ్డి ఈ రెండింటి మధ్య నిలబడిపోయి మరీ తీవ్రంగా నిరాశపరిచే బ్యాచ్ లో పడకుండా కొంతవరకు మాత్రమే సేఫ్ అయ్యింది.

జాంబీ రెడ్డి - యావరేజ్ బైట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp