సుల్తాన్ రివ్యూ

By Ravindra Siraj Apr. 02, 2021, 07:51 pm IST
సుల్తాన్ రివ్యూ

నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీకి సూర్య తమ్ముడిగా కన్నా విడిగానే మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య వరస డిజాస్టర్లతో కొంత తగ్గినట్టు అనిపించినా మొన్నేడాది తిరిగి ఫామ్ లోకి వచ్చిన కార్తీ కొత్త సినిమా సుల్తాన్. లాక్ డౌన్ సమయంలో హాట్ స్టార్ లో రిలీజవుతుందని తెగ ప్రచారం జరిగినప్పటికీ థియేటర్లు తెరుచుకున్నాక  నిర్ణయం మార్చుకున్నారు. ట్రైలర్ వచ్చాక దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ రష్మిక మందన్న హీరోయిన్ కావడం ప్లస్ ఈ శుక్రవారం మాస్ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా ఇదే కనిపించడం హైప్ ని పెంచాయి. ఇంకెందుకు ఆలస్యం రివ్యూ చూసేద్దాం

కథ

వైజాగ్ లో రౌడీయిజం చేస్తూ వంద మందిని తన ఇంట్లోనే పెట్టుకుని పోషించే పెద్దమనిషి సేతుపతి(నెపోలియన్). అతనికి పుట్టిన కొడుకే విక్రమ్ అలియాస్ సుల్తాన్(కార్తీ). ముంబైలో చదువుకుని రోబోట్రిక్స్ కోసం జపాన్ వెళ్లే పనిలో ఉంటాడు. సిటీకి దగ్గరలో ఉండే వెలగపూడి గ్రామస్తులు తమ పొలాలను ఆక్రమించుకుంటున్న జయేంద్ర(రామచంద్రరాజు)నుంచి కాపాడమని సుల్తాన్ తండ్రి దగ్గరకు వస్తారు. అది జరిగే లోపే సేతుపతి చనిపోతాడు. ఆయన ఆఖరి కోరిక తీర్చడం వీళ్ళను మంచివాళ్ళుగా మార్చడం కోసం కార్తీ తన కౌరవ సైన్యంతో అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ

నటీనటులు

కార్తీ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. క్యాట్ వాక్ లాంటి సుల్తాన్ పాత్రను అలవోకగా చేసుకుంటూ పోయాడు. కామెడీ అవసరం ఉన్న చోట టైమింగ్ చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన ముద్ర వేశాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో సరేసరి. ఇది తనకెంత మాత్రం స్పెషలూ కాదు డిఫరెంటూ కాదు. రష్మిక మందన్న దాదాపు సినిమా మొత్తం మూతి ముడుచుకుని అలకలు పోతూ రెండు మూడు డాన్సులు చేయడం తప్ప చేసిందేమి లేదు. గీత గోవిందం నుంచి ఒకటే ఎక్స్ ప్రెషన్ ని రాబట్టుకుంటున్నారు దర్శకులు.  స్టార్ హీరోల పక్కన చేస్తోందన్న మాటే కానీ ఛాలెంజింగ్ అనిపించే క్యారెక్టర్లైతే దొరకడం లేదు.

మెయిన్ విలన్ గా నటించిన రామచంద్రరాజు బిల్డప్ ఇవ్వడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు. పాత్రను సరిగా డిజైన్ చేయకపోవడంతో ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో  అర్థం కాదు. హీరో చేతిలో చావు దెబ్బలు తినడం తప్ప చేసిందేమి లేదు. సెకండ్ విలన్ పాత్రధారి నవాబ్ షా గాగుల్స్ తో నడిపించేశాడు. ఇది కూడా ఎన్నోసార్లు స్క్రీన్ మీద అరిగిపోయిన బాపతు పాత్రే. తక్కువ నిడివి అయినా నెపోలియన్ బాగున్నారు. హీరో తర్వాత ఎక్కువగా గుర్తుండిపోయేది మాత్రం మామగా నటించిన లాల్. భారీకాయంతో తన ఉనికిని చాటుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చే ఈయన దీనికి ప్లస్ అయ్యారు. మిగిలినవన్నీ ఆరవ మొహాలే.

డైరెక్టర్ అండ్ టీమ్

ఇటీవలి కాలంలో వ్యవసాయాన్ని సినిమా కోసం కమర్షియల్ ఫార్ములాగా మార్చడం చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో సిద్దార్థ్ పొలం దున్నడంతో మొదలుకుని మహర్షి, శ్రీకారంలో హీరోలు నగరం వదిలి ఫార్మింగ్ అంటూ సందేశాలు ఇవ్వడం ఇప్పటికే బోర్ కొట్టేసింది. కానీ ఈ ఫార్ములా అరవ జనాలకు కొత్త కదా. అందుకే దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్(అసలు పేరు బక్కియరాజ్ కానీ టైటిల్స్ లో మాత్రం అలా వేయలేదు)ఈ సబ్జెక్టుని తీసుకుని దానికి ఫ్యాక్షన్, యాక్షన్, కామెడీ,లవ్, ఎమోషన్స్ ఇలా అన్నిరకాల మాసాలాలు కలిపి ఈ చిత్ర విచిత్ర సుల్తాన్ వంటకాన్ని వండి వడ్డించాడు.

సినిమా జరుగుతున్నంత సేపు మనకు గతంలో అంతా చూసినట్టే అనిపిస్తుంది. ఎక్కడా మచ్చుకు కూడా కొత్తదనం ఉండదు. వంద మంది మేనమామలు పెంచి పెద్ద చేసిన హీరో నాన్న మాట కోసం ఓ ఊరికి వెళ్లి విలన్ల భరతం పట్టడం అనే పాయింట్ వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ మీద కొచ్చేటప్పటికీ అతి మాములుగా మారిపోయింది. ప్రొడక్షన్ వేల్యూస్, ఆర్టిస్టుల ప్రెజెన్స్ వల్ల చాలా లోపాలు కవరయ్యాయి కానీ లేదంటే అవుట్ ఫుట్ ఇంకా వీక్ అయ్యేది. టేకాఫ్ బాగానే ఉన్నప్పటికీ ముందుకు వెళ్లే కొద్దీ పరమ రొటీన్ దారిలో వెళ్లిపోయారు భాగ్యరాజ్. పైగా మన తెలుగు సినిమాల ప్రభావం చాలానే కనిపిస్తుంది.

ఇలాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో లాజిక్స్ అవసరం లేనప్పటికీ కథను 2021లో జరుగుతున్నట్టు చూపించినప్పుడు మరీ అతిశయోక్తులకు చోటు ఇవ్వకూడదు. కానీ భాగ్యరాజ్ దీన్నసలు పట్టించుకోలేదు. ఊరంతా తగలబడుతూ జనాలను పెట్రోల్ పోసి చంపుతున్నా కూడా అటువైపు ఒక్క పోలీస్ కూడా రాడు. కేవలం అప్పుడప్పుడూ కమీషనర్ మాత్రమే కనిపిస్తాడు. ఇదంతా 80ల నాటి ఫార్ములా. కానీ ఇప్పటి జెనరేషన్ కు అనుగుణంగా ఏ మాత్రం కొత్తదనంతో ఆలోచించకపోవడం సుల్తాన్ ని మాములుగా మార్చేసింది. కార్తీ లాంటి ఎనర్జీ ఉన్న నటుడు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకున్నాడు కానీ ఓవర్ ఊర మాస్ కి తప్ప సుల్తాన్ సగటు ప్రేక్షకులకు నచ్చడం కష్టమే

వివేక్ మెర్విన్ పాటల్లో సౌండ్ ఎక్కువయ్యింది. వటి తాలూకు డబ్బింగ్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఏదీ మళ్ళీ వినాలనిపించదు సరికదా బయటికి వెళ్లే అవకాశం ఇస్తుంది. కానీ యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సుల్తాన్ కి బలమైన దన్నుగా నిలబడింది. మాస్ కి మంచి కిక్కిచ్చే ఎలివేషన్లు వచ్చేలా చాలా జాగ్రత్త పడ్డాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో ఉంది. రూబెన్ ఎడిటింగ్ మాత్రం అనవసరమైన నిడివికి స్కోప్ ఇచ్చింది. ఓ ఇరవై నిముషాలు కోత వేసినా క్రిస్పీగా సాగి అసంతృప్తి తగ్గేది. డ్రీం వాఁరియర్ నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. ఎంత కావాలో అంతా ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

కార్తీ యాక్టింగ్
యువన్ బిజిఎం
ప్రొడక్షన్ వేల్యూస్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

రొటీన్ స్టోరీ
సాగతీత నిడివి
హీరోయిన్
పాటలు

కంక్లూజన్

కార్తీ సినిమా కదా ఏదో కొత్తగా ఉంటుందని వెళ్తే మాత్రం విసిగించి పంపుతాడు సుల్తాన్. ఎంత రొటీన్ ఫార్ములా అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి దాన్ని ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్దినప్పుడే అవి సూపర్ హిట్లో బ్లాక్ బస్టర్లో అవుతాయి. సుల్తాన్ ఆరవ ఆడియన్స్ కి ఏదైనా కొంత డిఫరెంట్ గా అనిపించవచ్చేమో కానీ ఇలాంటివి ఎన్నో చూసి మొహం మొత్తేసిన మనకు మాత్రం ఎలాంటి వినూత్నత కనిపించదు. రెండు ముప్పావు గంటల పాటు తమిళ సాంబార్ వాసనలు భరించగలిగే ఓపిక ఉంటే సుల్తాన్ ని ట్రై చేసుకోవచ్చు. బాగుంటుందనే అంచనాలు పెట్టుకోకపోతేనే సుమా

ఒక్కమాటలో - అతి రొటీన్ సుల్తాన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates