English

సోలో బ్రతుకే సో బెటరూ రివ్యూ

By Ravindra Siraj Dec. 25, 2020, 02:58 pm IST
సోలో బ్రతుకే సో బెటరూ రివ్యూ
Rating : 2.5/5
Main Cast: : sai dharam tej, Nabha Natesh,
Director: : Subbu,
Music: : SS.Thaman,
Producer: : B.V.S.N Prasad,

తొమ్మిది నెలల సుదీర్ఘమైన లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో నిజమైన సందడి తీసుకొస్తున్న సినిమాగా సోలో బ్రతుకే సో బెటరూ ఈ రోజు నుంచి వెండితెరపై అలరించేందుకు వచ్చేసింది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో ప్రతిరోజు పండగేతో ఇయర్ ఎండింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి తేజ్ హీరోగా ఇది రూపొందటం కాకతాళీయం. సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా కరోనా పరిణామాల దృష్ట్యా హక్కులన్నీ జీ సంస్థ సొంతం చేసుకుని విడుదల చేసింది. మరి లక్షలాది మూవీ లవర్స్ ఆకాంక్షలను మోసుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

వైజాగ్ లో ఉండే విరాట్(సాయి తేజ్)పెళ్లంటే గిట్టని కుర్రాడు. అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో వివరిస్తూ యూత్ కోసం ఏకంగా పుస్తకమే రాస్తాడు. దీని వెనుక మావయ్య(రావు రమేష్)ప్రోద్బలం ఉంటుంది. ఉద్యోగం కోసం విరాట్ హైదరాబాద్ వచ్చాక అతని స్నేహితులు ఒక్కొక్కరు బ్రహ్మచారి జీవితానికి స్వస్తి చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. ఒకదశ దాటాక ఇతని మనసులోనూ మార్పు మొదలువుతుంది.

ఓ వేడుకలో జరిగిన అనూహ్య సంఘటన ద్వారా అమృత(నభ నటేష్)విరాట్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కాలేజీలో జూనియర్ గా తన గురించి అంతా తెలిసిన అమృత మీద విరాట్ మనసు పారేసుకుంటాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్టు మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, విరాట్ అమృతను ఒప్పించగలిగాడా లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

నటీనటులు

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా కాస్తో కూస్తో చిరంజీవి పోలికలు ఎక్కువ కనిపించే వాడిగా సాయి తేజ్ కు డెబ్యూ నుంచే ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. దానికి తోడు టైమింగ్ తో తన నటనను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ వచ్చిన సాయి తేజ్ ఇందులో కూడా అదే కొనసాగించాడు. డిఫరెంట్ ఎనర్జీ డిమాండ్ చేసిన విరాట్ పాత్రకు కావాల్సిన పెర్ఫార్మన్స్ ని బ్యాలన్స్ చేస్తూ ఇచ్చాడు. ఇలాంటి ఎంటర్ టైనర్స్ లో యాక్టింగ్ పరంగా మరీ అద్భుతం అనే ఉపమానాలు వాడలేం కానీ ఉన్నంతలో నిరాశపర్చకుండా చక్కగా చేసుకుంటూ పోయాడు. విభిన్న కథలు పడితే ఇంకా రాటు దేలుతాడు.

హీరోయిన్ నభ నటేష్ కు ఇస్మార్ట్ శంకర్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ దొరికింది. ఇంటర్వెల్ దాకా ఎంట్రీ లేకపోవడం లోటే అయినప్పటికీ హోమ్లీగా డీసెంట్ గా ఉండే లవర్ గా క్యూట్ లుక్స్ తో ప్లస్ నటనతో మెప్పించింది. రావు రమేష్ ఒక్క ఎమోషనల్ సీన్ తో తన సత్తా చాటారు. తన పాత్రతో ఓ బలంగా నిలిచారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ లవి రెగ్యులర్ క్యారెక్టర్లే. మరీ చెప్పుకునే ప్రత్యేకత ఏమి లేదు. వెన్నెల కిషోర్, సత్య తదితరులు కామెడీ ట్రాక్ ని నడిపించారు. చాలా కాలం తర్వాత అజయ్ కు మెయిన్ విలన్ రోల్ దక్కినా కనిపించేది రెండు సార్లే.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు సుబ్బు తీసుకున్న పాయింట్ లో మరీ కొత్తదనం లేదు. గతంలో మన్మథుడు, వివాహ భోజనంబు లాంటి సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్ ను తీసుకుని ఇప్పటి యూత్ కనెక్ట్ అయ్యేలా మోడరన్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కఠోర బ్రహ్మచారి జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించి అతన్ని పెళ్లి దాకా తీసుకెళ్తుందనే పాయింట్ ట్రైలర్ చూశాకే అర్థం చేసుకున్న ప్రేక్షకులు ఇందులో దాన్ని ఎంత ఎంటర్ టైనింగ్ గా చూపించారనే దాని మీదే దృష్టి పెడతారు. సుబ్బు కూడా అందుకే స్క్రీన్ ప్లేని వీలైనంత ఎంగేజింగ్ గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. బోర్ కొట్టకుండా నడిపించేందుకు తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది.

కానీ ఫస్ట్ హాఫ్ వరకే తన ప్రయత్నంలో ఓమాదిరిగా సక్సెస్ అయ్యాడు సుబ్బు. అసలు విరాట్ కు పెళ్లంటే అంత ద్వేషం కలగడానికి బలమైన కారణమేది కనిపించదు. పైపెచ్చు తండ్రితో ఆంటీఅంటనట్టు దూరంగా ఉండటం కూడా కృత్రిమంగా అనిపిస్తుంది. ఏదైనా కన్విన్సింగ్ రీజన్ తో విరాట్ పెళ్లి వద్దనడం చూపించి ఉంటే బాగుండేది. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా హిలేరియస్ అనిపించే ట్రాక్ లేకపోవడం ఈ సినిమాలో మరో ముఖ్యమైన మైనస్. హీరోయిన్ రాకను స్క్రీన్ ప్లే అనుగుణంగానే లేట్ చేసిన సుబ్బు ఇంటర్వల్ ట్విస్ట్ ని బాగానే సెట్ చేసుకున్నప్పటికీ అదే టెంపోని అదే ఫ్లోని కొనసాగించలేకపోయాడు. ఫలితంగా సెకండ్ హాఫ్ విసిగిస్తుంది.

సింపుల్ కామెడీకి జనం నవ్వే రోజులు కావివి. ఇందులో చాలాసేపు అలా టైం గడిచిపోయినట్టు అనిపిస్తుందే తప్ప భలే కామెడీ అని ఎక్కడా ఫీల్ కలగదు. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కాసిన్ని నవ్వులు పంచుతాడు. రెండో సగంలో హీరో హీరోయిన్లు కలిసుకున్నాక గంటదాకా కథను ఎలా నడపాలన్న సందిగ్ధంలో పడ్డాడు కాబోలు అవసరం లేకపోయినా ప్లాంట్ చేసిన సీన్లే కనిపిస్తాయి. దానికి తోడు కాలేజీ యువత సోలో బ్రతుకును ఏదో ఉద్యమం రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం ఆర్టిఫిషియల్ గా ఉంది. పైగా అక్కడి నుంచి సాయి తేజ్ పాత్ర పాసివ్ గా మారిపోతుంది. విరాట్ అమృతల మధ్య ఎమోషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం సెట్ చేసుకున్న ఎపిసోడ్స్ అంతగా పండలేదు. భావోద్వేగాలు డ్రాగ్ అయ్యాయి. కానీ టేకింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న సుబ్బు డైలాగ్ రైటర్ గానూ చాలా చోట్ల మెప్పించాడు. కానీ బలహీనత అసలు కథలోనే ఉంది.

తమన్ ఇచ్చిన స్కోర్ డీసెంట్ గా ఉంది. ఒకటి రెండు పాటలు పర్వాలేదు అనిపించినా అల వైకుంఠపురములో దెబ్బకు అంచనాలు పెరిగాక వాటిని ప్రతిసారి అందుకోవడం తమన్ కు సవాలే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే బాగా ఇచ్చాడు. వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం ప్రొడక్షన్ వాల్యూస్ ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. బడ్జెట్ పరంగా భారీగా లేకపోయినా ఉన్నంతలో రిచ్ నెస్ రావడంలో ఈయన కృషి చాలా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల నిడివికి పరిమితం అయ్యేలా చేసిన నవీన్ నూలి ఎడిటింగ్ పనితనాన్ని మెచ్చుకోవచ్చు. బివిఎస్ఎన్ ప్రసాద్ సబ్జెక్టు డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

సాయి తేజ్ నటన
నభ నటేష్ ఎనర్జీ
సంగీతం
ఛాయగ్రహణం

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
అంతగా పండని కామెడీ
ఎమోషనల్ సాగతీత
విలన్ ఎపిసోడ్

కంక్లూజన్

లాక్ డౌన్ గ్యాప్, థియేటర్ల తెరిచివేత కోణంలో సానుభూతితో చూడకుండా విశ్లేషిస్తే సోలో బ్రతుకే సో బెటరూ ఓ మాములు సగటు సినిమాగా మిగిలిపోయింది. టైటిల్, ట్రైలర్ ని చూసి ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్మెంట్ ఆశిస్తే మాత్రం సంతృప్తి స్థాయి తగ్గుతుంది. సింపుల్ లైన్, కామెడీతో రెండు గంటలకు పైగా దర్శకుడు సుబ్బు నడిపిన డ్రామా జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

సోబ్రసోబె - కొంచెం బెటరే ఉంది బెదరూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates