పలాస 1978 రివ్యూ

By iDream Post Mar. 06, 2020, 12:03 am IST
పలాస 1978 రివ్యూ

పలాస:

ప్రాంతీయ నేపథ్యంతో వచ్చే సినిమాల జోరు తెలుగు తెర మీద ఈ మధ్య కనిపిస్తోంది. గోదావరి మాండలికంతో "రంగస్థలం", బన్సువాడ యాసలో "ఫిదా", విశాఖ నేపథ్యంలో "కేరాఫ్ కంచెరపాలెం"..ఇలా. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో "పలాస" వచ్చింది. వీటన్నిటిలోనూ కామన్ గా కనిపించే అంశం ఆయా ప్రాంతీయ యాసల్లోని తీయదనం. ఇక పీరియడ్ బ్యాక్ డ్రాప్ అయితే ఆ ఏంబియన్సే వేరు. కరుణ కుమార్ తీసిన "పలాస" మీద మొదట్నుంచీ ఒక వర్గంలో అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్లో ఒకటి రెండు డయలాగులు కూడా బానే పేలాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో "రంగస్థలం" మాదిరిగా రెండు కులవర్గాల నేపథ్యంలో సాగే కథలా అనిపించింది. ఇంతకీ ఇందులో ఏముంది, ఎలా ఉంది అనేవి చూద్దాం.

కథ:

1978 కాలంలో ఊర్లో పెద్ద షావుకారు (జన్ని). అతనికొక తమ్ముడు. పేరు గురుమూర్తి (రఘు కుంచె). వీళ్లు ఆ ఊరికి పెద్దలు. జంధ్యం వేసుకునే ఒకానొక కులానికి చెందిన వాళ్లు. వీళ్ల కనుసన్నల్లో ఊరు నడుస్తుంటుంది. ఆధిపత్యం వల్ల వచ్చిన పొగరు వీళ్ల సొంతం. అలాగే బడుగు కులాల వారిని హీనంగా చూడడం, పశువుల్ని బాదినట్టు బాదడం వీళ్ల జన్మహక్కులా భావిస్తూ జీవిస్తుంటారు. ఇంతకీ ఈ అన్నదమ్ములిద్దరికీ పడదు. వీళ్లు ఈ సినిమాలో విలన్లు.

అదలా ఉంటే కాళ్లకి గజ్జెకట్టి దేవుడి ముందు ఆడే కులానికి చెందిన ఒక బలవంతుడైన కుర్రాడు. పేరు మోహన రావు (రక్షిత్). అదే వాడలో అతనికి ఇష్టమైన ఒక అమ్మాయి (నక్షత్ర). ఈ మోహన రావుకి ఒక అన్న (తిరువీర్). ఈ అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వీళ్లు మన హీరోలు.

ఇక ఈ కథలో మరో ముఖ్య పాత్ర పోలీస్ ఎస్.ఐ సెబాస్టియన్ (రామరాజు).

పైన పేర్కొన్న విలన్ అన్నదమ్ములు ఈ హీరో అన్నదమ్ముల్ని ఎలా వాడుకుందామనుకుంటారు? చివరికి ఎవరు ఏమౌతారు? ఎవరెవరు ఎవరెవరి చేతుల్లో చస్తారు? అదంతా ఒక భారతమంత కథ.

ఎలా చేసారు:

మోహన్ రావుగా రక్షిత్ చక్కని నటన్నని కనబరిచాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్ రెడ్డిలో కనిపించిన తిరువీర్ కూడా పాత్రకు తగ్గ నటన చాలా సహజంగా చేసాడు.

నక్షత్ర తెర మీద అందంగా కనిపించింది. నటనాప్రతిభ చూపించేంత స్కోప్ లేదు. ఇక చెప్పుకోదగ్గ నటన పెద్దషావుకారుగా చేసిన జన్నీది. చాలా అనుభవమున్న నటుడిగా చేసాడు.

సాంకేతిక వర్గం:

ఇక సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గురుమూర్తి పాత్రలో జీవించాడు. 1978 నుంచి 2018 వరకు జరిగే ఈ కథలో రెండు మూడు రకాల గెటప్పులతో కనిపించాడు. విలన్ గా సీరియస్సుగా ఫోకస్ పెట్టొచ్చు.ఇక సెబాస్టియన్ పాత్రధారి కూడా మెప్పించాడు. అయితే అతని వాయిస్ లో ఇంకొంచెం బేస్ ఉంటే పాత్రకి నిండుదనం వచ్చేది.

కొన్ని ప్రాముఖ్యం లేని పాత్రలకి అక్కడ సెట్లో కనిపించిన వాళ్ల చేత చేయించినట్టున్నారు. ఉదాహరణకి పెద్ద షావుకారు కొడుకుతో మాట్లాడడానికి వచ్చిన డాక్టర్ పాత్ర చాలా పేలవంగా ఉంది. అలాగే స్టేషన్లో చివర్లో కనిపించే ఎస్.ఐ కూడా. కథలో ముఖ్యుడైన ముత్యాలు పాత్రధారి కూడా ఇంకొంచెం ఇంటెన్సిటీతో ఉంటే బాగుండేది. ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించి ఉంటే ఆ పాటి చిన్న మచ్చ కూడా ఉండేది కాదు.

రియలిస్టిక్ గా అనిపిస్తూనే ఫైట్లు, హీరోయిజం విషయంలో మళ్లీ కమెర్షియల్ పంథాని తొక్కింది ఈ సినిమా. అది కూడా అతికినట్టే ఉండడం వల్ల ఇబ్బంది పెట్టదు.

రఘు కుంచె సంగీతాన్ని కూడా మెచ్చుకుని తీరాలి. రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టగలిందంటే దర్శకుడి ప్రతిభతో పాటూ సంగీత దర్శకుడి పనితనం కూడా కలిసిరాబట్టే.

దర్శకుడు గురుంచి:

షార్ట్ ఫిలంస్ తీయడంలో జాతీయ స్థాయి అవార్డులు పొందిన ట్యాలెంటడ్ దర్శకుడు కరుణ కుమార్. దలితవాదం ఆత్మగా వచ్చే సినిమాలు తెలుగులో తక్కువ. అరవంలో అయితే మామూలే. ఈ మధ్యనే "దొరసాని" వచ్చినా దానిని ప్రేక్షకులు ఆదరించలేదు. పలాసలో ఆ వాదం ఉన్నా అందరినీ ఆకట్టుకునే తీరులో ఉంది. రంగస్థలం స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తున్నా ఇది పూర్తి స్వతంత్ర కథ. ఏ పాత్రా వృధా కాదు. ప్రతిదీ ఎంతోకొంత ఇంపార్టెన్స్ ఉన్నదే. కథ రాసుకోవడం నుంచి తీసి మెప్పించడం వరకు దర్శకుడు పడ్డ కృషి ఆద్యంతం కనిపిస్తుంది.

ప్లస్ గా అనిపించేవి:

కథనం
నటీనటులు
నేపథ్య సంగీతం

మైనస్ గా తోచేవి:

వీక్ లవ్ ట్రాక్
ఫ్యామిలీలు తరలి వచ్చి చూసేలా వినోదం లేకపోవడం

చివరి మాట:

బోరు కొట్టని కథనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమా చూడాలి. అదేంటి..ఎవరైనా అలాంటి సినిమానే కదా చూడాలనుకునేది అంటారా? అందరూ కొత్త మొహాలతో కథనం నడపడం కష్టమైన పని.
ఇంకా శ్రీకాకుళం యాసని ఎంజాయ్ చెయ్యాలన్నా ఈ సినిమా చూడొచ్చు.

రియలిస్టిక్ సినిమాలు పెద్దగా ఇష్టపడని వాళ్లు, పెద్ద హీరోల సినిమాలే చూడలనుకునే వాళ్లు, థ్రిల్ కంటే ఐదు నిమిషాలకొక వెక్కిలి నవ్వు తెప్పించే సీన్లు కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండొచ్చు.

సింపుల్ గా చెప్పాలంటే:

పలాస- చూసి మెచ్చుకోవాల్సిన సినిమా 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp