ఆక్సిజ‌న్‌ రివ్యూ

By iDreamPost.com Dec. 01, 2017, 03:58 am IST
ఆక్సిజ‌న్‌ రివ్యూ

మాస్‌, యాక్ష‌న్ సినిమాలకు పెర్‌ఫెక్ట్ గా స‌రిపోయే క‌థానాయ‌కుడిగా హీరో గోపీచంద్‌కు టాలీవుడ్‌లో ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఓ టైమ్‌లో వ‌రుస విజ‌యాల‌తో గోపీచంద్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కొంత‌కాలంగా స్థాయికి త‌గ్గ స‌క్సెస్‌లు రాలేద‌నే చెప్పాలి. మూడేళ్ల క్రితం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘లౌక్యం’ త‌రువాత గోపీకి స‌రైన హిట్ మూవీ లేదు. ఈ ఏడాది ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ‘గౌతమ్‌నంద’ జ‌నాన్ని ఆక‌ట్టుకున్నా..అనుకున్న స్థాయి విజ‌యాన్నైతే ఇవ్వ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి త‌న‌కు క‌లిసొచ్చిన మాస్ ఎలిమెంట్స్‌నే న‌మ్ముకుని, దానికి సందేశాత్మ‌క అంశాల్ని జోడించి గోపీచంద్ తాజాగా చేసిన సినిమా ‘ఆక్సిజ‌న్‌’.

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో గోపీచంద్ చేసిన ఈ మూవీ అత‌డి కెరీర్‌ను తిరిగి స‌క్సెస్ ట్రాక్‌లోకి తెచ్చిందా..? చాలా రోజుల తర్వాత మెగాఫోన్‌ పట్టిన జ్యోతికృష్ణ ద‌ర్శకుడిగా త‌న స‌త్తా చాట‌గ‌లిగాడా..? విశ్లేష‌ణ లోకి వెళ్ళి చూద్దాం..!

కథాంశం ఏమిటి-
కృష్ణ ప్ర‌సాద్ ( గోపీచంద్‌) పెళ్లి చూపుల కోసం అమెరికా నుంచి రాజ‌మండ్రికి వ‌స్తాడు. రఘుపతి(జగపతి బాబు) ఆ ఊరిపెద్ద. ఆయ‌న కూతురు శ్రుతి (రాశీఖ‌న్నా)ను చూసి తొలి చూపులోనే ఇష్ట‌ప‌డి ఆమెతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. అయితే ఆ ఊరు వ‌దిలి అమెరికాకు వెళ్ల‌డం ఇష్టం లేని శ్రుతి ఎలాగైనా ఆ సంబంధం చెడ‌గొట్టాల‌ని భావిస్తూ.. కృష్ణ‌ప్ర‌సాద్‌లో లోపాలు వెతకాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. అయితే కృష్ణ‌ప్ర‌సాద్ మాత్రం త‌న మంచిత‌నంతో ఆ కుటుంబ స‌భ్యుంద‌రికీ ఆత్మీయుడిగా మార‌తాడు. ఇదిలా ఉండ‌గా ర‌ఘుప‌తికి ఊళ్లో ఇద్ద‌రు ప్ర‌ధాన శత్రువులుంటారు. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల ర‌ఘుప‌తి అన్న, అన్న‌కొడుకు, అల్లుడు చ‌నిపోయార‌ని భావిస్తారు. వారి నుంచి తన కుటుంబానికి ప్ర‌మాద‌ముంద‌నే భ‌యంతో తన అన్నదమ్ములు, కూతురి విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు ర‌ఘుప‌తి. ఈ నేప‌థ్యంలో శ్రుతికి కృష్ణప్రసాద్‌కి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. ఈలోగా శత్రువుల నుంచి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పు నుంచి కృష్ణప్రసాద్‌ వారిని ఎలా రక్షించాడు.., శ్రుతిని ఎలా ద‌క్కించుకున్నాడ‌న్న‌దే ఈ ‘ఆక్సిజన్‌’ సినిమా కథ.

విశ్లేష‌ణ -
ముందే చెప్పుకున్న‌ట్టు ఇది పూర్తి కమర్షియల్‌ సినిమా. అయితే కుటుంబ క‌థా నేప‌థ్యంతో పాటు, సందేశాత్మ‌క అంశాల్ని జోడించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ కూడా మెచ్చ‌ద‌గిందే..! మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అనే అంశంతో త‌యారైన క‌థ ఇది. విచ్చ‌ల‌విడిగా స‌మాజంలోకి ప్ర‌వేశిస్తున్న కొన్ని అనామ‌క‌మైన సిగ‌రెట్ బ్రాండ్లు యువ‌త‌ను ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయి? వారి ఆరోగ్యాన్ని జీవితాల‌ను ఎలా నాశ‌నం చేస్తున్నాయ‌న్న మంచి కాన్సెప్ట్ తీసుకుని క‌థ అల్లుకోవ‌డం బాగుంది. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టే ఈ సినిమా కథకి ప్రధాన బలం. దాంతో రఘుపతి కుటుంబానికి అసలైన శత్రువెవరో తెలుస్తుంది. అప్పటివరకూ రొటీన్‌గా సాగుతున్న కథ.. ఈ ట్విస్ట్‌తో ఆస‌క్తిక‌ర‌మైన‌ మలుపు తిరుగుతుంది. ట్విస్ట్‌ కొత్తగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఒక బలమైన సామాజిక అంశం మీద కథ నడిపించాడు దర్శకుడు. అయితే ఇలాంటి అంశాన్ని బ‌ల‌మైన స‌న్నివేశాల ద్వారా ఎలివేట్ చేయ‌గ‌లిగితేనే జ‌నాన్ని ఆక‌ట్టుకోగ‌లిగేది. ఈ విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడు మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉండాల్సింద‌నిపిస్తుంది. యువ‌త‌కు ప‌నికొచ్చే మంచి సందేశాత్మ‌క సినిమా అందించాల‌న్న ప్ర‌య‌త్నంలో సక్సెస్ అయినా అది గ‌తంలో చాలాసార్లు చూసిన రొటీన్ ఫార్ములాతో వెళ్ల‌డం కాకుండా, మ‌రిన్ని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న‌, కాస్త వినోదం పాళ్లు మేళ‌వించి ఉంటే సినిమా మ‌రో స్థాయికి వెళ్లి ఉండేద‌నిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దారు. అవన్నీ మాస్ ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆకట్టుకుంటాయి.

న‌టీన‌టులు, సాంకేతిక బృందం ప‌నితీరు-
మాంచి హైట్‌, ప‌ర్స‌నాలిటీతో హీ మ్యాన్ అనిపించే గోపీచంద్ ఈ చిత్రంలో రెండు విభిన్నకోణాలున్న‌ పాత్రను పోషించి మెప్పించాడు. తొలి సగంలో బుద్ధిమంతుడిగా కనిపించిన గోపీచంద్‌.. ద్వితీయార్ధంలో తన యాక్షన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు నడుచుకున్నాడు. అయితే తొలి అర్ధ‌భాగంతో పోలిస్తే ద్వితీయార్థంలోనే గోపీచంద్‌ నటనకు ఆస్కార‌మున్న స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక క‌థానాయిక‌ల్లో రాశీఖన్నా ఎప్పటిలాగే చాలా అందంగా ఆకట్టుకునేలా కనిపించింది. అను ఇమ్మాన్యుయేల్ పాత్ర‌కు సినిమాలో పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ఇక మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ జగపతిబాబుది. ఈ పాత్రలోనూ రెండు షేడ్స్ క‌నిపించ‌డం విశేషం.త‌న‌దైన శైలి న‌ట‌న‌తో ఈ సీనియ‌ర్ న‌టుడు మెప్పించాడు. అలీ కామెడీతో సంద‌డి చేశాడు. ‘కిక్‌’ శ్యాం, అభిమన్యు సింగ్‌ ఓకే అనిపిస్తారు. ఇక ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థాంశం బాగుంది. అయితే స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉండాల్సింది. యువన్‌ శంకర్‌ రాజా పాటలకన్నా నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలకి యువన్‌ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. తెలుగు భాషను వివరిస్తూ వచ్చే పాట బాగుంది. ఐటెం పాట ఉన్నా, అదేమంత ఆక‌ట్టుకునే స్థాయిలో లేదు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివ‌రిగా
సందేశాత్మ‌క అంశంతో కూడిన రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates