English

Most Eligible Bachelor Movie Review : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ

By Ravindra Siraj Oct. 15, 2021, 01:33 pm IST
Most Eligible Bachelor Movie Review :  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ

కెరీర్ మొదలుపెట్టిన అయిదేళ్లలో చేసిన మూడు సినిమాలతో సక్సెస్ ఇప్పటికీ అందని ద్రాక్షగా మార్చుకున్న అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పేరుకి లవ్ స్టోరీ అయినప్పటికీ నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరగడం ఎన్నోసార్లు అభిమానులను అసహనానికి గురి చేసింది. దానికి తోడు అంతగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడంతో అంచనాలు అటుఇటు ఊగుతూ వచ్చాయి. అయితే ట్రైలర్ వచ్చిన క్షణం నుంచి సీన్ మారిపోయింది. ఏదో కంటెంట్ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. పాటలూ హిట్ అయ్యాయి. మరి ఈ బ్రహ్మచారి మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

యుఎస్ లో ఉద్యోగం చేసే హర్ష(అఖిల్) కేవలం ఇరవై రోజులు గడువు పెట్టుకుని ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం కోసం ఇండియా వస్తాడు. ఏ అమ్మాయితోనూ సెట్ కాదు. వాళ్ళలో స్టాండప్ కామెడీ షోలు చేసే విభ(పూజా హెగ్డే)ఉంటుంది. కానీ హర్షకు నచ్చిన విభ ఇంట్లోవాళ్ళకు ఇష్టం ఉండదు. ఆమెకూ పర్సనల్ గా పెళ్లంటే ఆసక్తి లేదని తెలుస్తుంది. దానికి కారణాలు తెలుసుకున్న హర్ష ఎలాగైనా సరే విభ మనసును గెలుచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక అక్కడి నుంచి అతను చేసే ప్రయత్నాలు వగైరా వీళ్ళ ప్రేమకథను ఎక్కడికి తీసుకెళ్లాయి అనేది తెలియాలంటే అది స్క్రీన్ మీదే చూస్తేనే అందం

నటీనటులు

మంచి అందగాడైన అఖిల్ మొదటి మూడు సినిమాల్లో అత్యుత్తమ నటన చూపించాడని చెప్పలేం కానీ కాలక్రమంలో తన యాక్టింగ్ లో మెచ్యూరిటీ వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ఇందులో చూసేందుకు మాత్రమే కాదు చెప్పుకునేందుకూ మంచి యాక్టింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఎక్కువ లోపాలు ఎంచే ఛాన్స్ ఇవ్వలేదు. సరైన కథ దర్శకుడు పడాలే కానీ తనలో స్టార్ మెటీరియల్ ఉన్న మాట వాస్తవం. పూజా హెగ్డేకు పెర్ఫార్మన్స్ పరంగా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అఖిల్ కన్నా తన డామినేషనే ఎక్కువ కనిపిస్తుంది. స్వంతంగా డబ్బింగ్ చెప్పకపోవడం ప్లస్ అయ్యింది.

సిసింద్రీలో మాస్టర్ అఖిల్ కి తల్లిగా నటించిన ఆమని ఇందులోనూ అదే పాత్ర చేయడం విశేషం. మురళి శర్మది రొటీన్ క్యారెక్టరే కానీ ఉన్నంతతో కాస్త గుర్తుండిపోయేలా టైమింగ్ చూపించాడు. ప్రగతి, అజయ్, జయప్రకాష్, అమిత్ తివారి, పోసాని, గెటప్ శీను, అభయ్, సుడిగాలి సుధీర్, చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, మణిచందన తదితరులవి లెన్త్ తో సంబంధం లేకుండా అందరివీ రొటీన్ రోల్సే. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోకపోవడంతో మిస్ ఫైర్ అయ్యాడు. ఫరియా అబ్దుల్లా, ఈషా రెబ్బా మరో ఇద్దరు క్యామియోలు పెళ్లి చూపుల సీన్లకు ఉపయోగపడ్డారు.

డైరెక్టర్ అండ్ టీమ్

మనకు పెళ్లి, భార్య భర్తల సంబంధాలు, ప్రేమ, రొమాన్స్ లాంటి టాపిక్కుల మీద గంటల తరబడి మాట్లాడేందుకు చాగంటి గారితో మొదలుపెట్టి స్పెషలిస్ట్ డాక్టర్ల దాకా యుట్యూబ్ లో, టీవీ ఛానల్స్ లో వందలు వేలలో ఉన్నారు. అదంతా స్మాల్ స్క్రీన్ మెటీరియల్. అలాంటి వాటిని తీసుకొచ్చి నేరుగా వెండితెర మీద అఖిల్ లాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోతో, పూజా హెగ్డే లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ తో చెప్పిస్తే ఏమవుతుంది. అచ్చం ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లా ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ కు ప్రేమ ప్లస్ పెళ్లి రెండు కాన్సెప్ట్స్ మీద లోతైన పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉంది. అది ఆయనకు గొప్ప కావొచ్చేమో కానీ పబ్లిక్ కి కాదు.

ఎందుకంటే తన భావాలను అందరికీ పంచాలనుకుని దానికి ఎంటర్ టైన్మెంట్ అనే ట్యాగ్ ని తగిలించి ఇలా సినిమాగా చూపించినప్పుడే అసలు సమస్య వస్తుంది. ఇక్కడ జరిగింది అదే. మొదటి సగంలో పూజా హెగ్డే లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలో పేజీల కొద్దీ క్లాసులు తీసుకుంటుంది. సరే నా ఛాన్స్ వచ్చినప్పుడు నేనూ చూసుకుంటా అని అఖిల్ సెకండ్ హాఫ్ లో బుక్కుల కొద్దీ పర్సనాలిటీ డెవలప్ మెంట్ లెక్చర్లు ఇస్తాడు. అసలు భాస్కర్ చెప్పాలనుకున్నది వినోదాన్ని పంచడమా లేక ఇప్పటికిప్పుడు ఈ సినిమా ద్వారా యువతలో సమూలమైన మార్పు తీసుకు రావడమా అర్థం కాదు. అంతగా నస పెట్టాడు బ్యాచిలర్.

సినిమాని లైట్ కామెడీతో మొదలుపెట్టి అక్కడక్కడా నవ్విస్తూ రెండు చూడదగ్గ వినదగ్గ పాటతో ఎంటర్ టైన్ చేసిన భాస్కర్ కాసేపయ్యాక ఓ లాజిక్ లేని కోర్టు సీన్ తో స్టార్ట్ చేసి చివరిదాకా చాలా సార్లు లయ తప్పాడు. చాలా స్ట్రాంగ్ గా చూపించిన విభు క్యారెక్టరైజేషన్ హర్ష యుఎస్ నుంచి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చి రహస్యంగా ఆమెను ఫాలో చేస్తూ జ్ఞానోదయం కలిగించే కొద్దీ బేలగా మారిపోతుంది. ఆఖరికి వీధిలో ఓ పోకిరి టీజ్ చేస్తే హీరో వదిలిన బెలూన్ పట్టుకుని ఏడుస్తూ పడుకుంటూ నిద్రొచ్చే దాకా హర్షను ఫోన్ లో మాట్లాడుతూనే ఉండమని అడుగుతుంది. ఇంతలా మార్పు రావడానికి చూపించిన రీజన్ కన్విన్సింగ్ గా లేదు.

చాలా చిన్న వయసులో అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనేంత స్థాయికి చేరుకున్న యువకుడికి బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు గుడ్డిగా విభ అడిగిన ప్రశ్నలనే అక్కడి అమ్మాయిలను అడిగి అల్లరిపాలవుతాడు. ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పదే పదే చెప్పుకునే అతనికి బేసిక్ మోరల్ బిహేవియర్ అంటే ఏంటో తెలియకపోవడం విచిత్రంగా ఉంటుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ అయినా సరే హీరో హీరోయిన్ల చుట్టూ ఉన్న జంటలు ఒక్కరు కూడా ఆనందంగా లేరని, ఏదో ఒక లోపంతో అసంతృప్తితో ఉన్నారని భాస్కర్ బలవంతంగా ఇరికించిన ట్రాక్స్ మరీ ఎన్టీఆర్ కాలం నాటి స్టైల్ లో ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి.

ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. భాస్కర్ ఇంకా బొమ్మరిల్లు క్లైమాక్స్ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. అందులో ప్రకాష్ రాజ్ కు సిద్దార్థ్ క్లాస్స్ పీకడం ఆ రేంజ్ లో పేలితే, ఇప్పుడు సగం సినిమా మొత్తం క్లాసులు తీసుకుంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుందనుకుని చాలా ఫోర్స్డ్ గా రాసుకున్న డైలాగులు సహనాన్ని పరీక్షిస్తాయి. ఫ్రెష్ గా అనిపించే టేకింగ్, రిచ్ ప్రొడక్షన్, క్వాలిటీ క్యాస్టింగ్, చక్కని మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉన్నా వీక్ రైటింగ్ వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. అసలైన లీడ్ పెయిర్ కి స్థిరత్వం లేకపోవడం బ్యాచిలర్ ని బాగా ఇబ్బంది పెట్టింది. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించడం ఆలోచించడం అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది.

గోపిసుందర్ రెండు పాటలు చాలా బాగున్నాయి. మిగిలినవి చిత్రీకరణ వల్ల పాస్ అయ్యాయి. నేపధ్య సంగీతంతో బలహీనంగా ఉన్న సన్నివేశాలను నిలబెట్టడటానికి చాలా ప్రయత్నించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రదీష్ వర్మ ఛాయాగ్రహణం బాగుంది. వంకలు పెట్టేందుకు లేదు. సీనియర్లు అనుభవజ్ఞులు ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సైతం నిస్సహాయులుగా మిగిలిపోయారు. చాలా చోట్ల అవసరం లేని ల్యాగ్ స్పష్టంగా కనిపించినా ఎందుకు వదిలేశారో. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ విలువలు స్క్రీన్ మీద కనిపించాయి. అక్కడక్కడా తేడా కొట్టినా ఫైనల్ గా లవ్ ఎంటర్ టైనర్ కి ఇంత ఖర్చు పెట్టడం విశేషమే

ప్లస్ గా అనిపించేవి

అఖిల్ నటన
పూజా పెర్ఫార్మన్స్
రెండు పాటలు
ఫస్ట్ హాఫ్ లో కొంత కామెడీ

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
పోటీపడుతూ క్లాసులు తీసుకోవడం
లీడ్ పెయిర్ మధ్య కన్ఫ్యూజింగ్ కాంఫ్లిక్ట్
స్క్రీన్ ప్లే ల్యాగ్

కంక్లూజన్

ట్రైలర్ ని చూసి ఊహించినట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా ఎంగేజ్ చేసే కంప్లీట్ ఎంటర్ టైనర్ కాదు. ఒకదశ వరకు కాస్త నవ్వించి ఆపై ఎటు పోతోందో అర్థం కాక పాత్రలకూ తెలియక చివరికి ఉపదేశాలతో ముగుస్తుంది. ఎమోషన్ లేకుండా ఎంత గొప్ప భావాలను మాటల రూపంలో పలికించినా అది జనానికి కనెక్ట్ కాదు. బ్యాచిలర్ లో జరిగింది ఇదే. కాకపోతే ఇప్పటికే మూడు లాంచులు చేసుకున్న అఖిల్ కు ఇది వాటికన్నా కొద్దిగా బెటర్ అనే ఊరట తప్ప గొప్పగా చెప్పుకోవడానికి భాస్కర్ ఛాన్స్ ఇవ్వలేదు. అభిమానులూ తర్వాత రాబోయే ఏజెంట్ కోసం ఎదురు చూడటం తప్ప చేయడం చేయగలిగింది ఏమి లేదు

ఒక్కమాటలో - భారమనిపించే లెక్చరర్

Also Read : Maha Samudram Movie Review: మహా సముద్రం రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates