మాస్టర్ రివ్యూ

By Ravindra Siraj Jan. 13, 2021, 12:49 pm IST
మాస్టర్ రివ్యూ

తమిళ స్టార్ హీరోగా రెండున్నర దశాబ్దాలకు పైగా ట్రాక్ రికార్డు ఉన్న విజయ్ కు తెలుగులో ఉన్న మార్కెట్ తక్కువే. కానీ మొదటిసారి ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇతని డబ్బింగ్ సినిమా విడుదల కావడం ఇదే మొదటి సారి. ఆరు వందలకు పైగా స్క్రీన్లతో తెల్లవారుఝాము నుంచే షోలు మొదలుపెట్టారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నట్టుండి మాస్టర్ కు ఇంత హైప్ రావడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇదేమి రోబో లాగా స్కై ఫై థ్రిల్లర్ కాదు. ట్రైలర్ కూడా అద్భుతం అనిపించలేదు. మరి ఇంత స్పెషల్ గా వచ్చిన ఈ మాస్టర్ పాఠాలు ప్రేక్షకులకు ఎక్కాయో లేదో రివ్యూలో చూద్దాం.

కథ

జెడి(విజయ్)ఓ తాగుబోతు లెక్చరర్. ఎంత వ్యసనపరుడైనప్పటికీ విద్యార్థులకు మంచి చెబుతూ వాళ్లలో గొప్ప ఫాలోయింగ్ మెయింటైన్ చేస్తుంటాడు. అదే కాలేజీలో పని చేసే చారులత(మాళవిక మోహనన్)తో ప్రేమ కథ నడిపిస్తుంటాడు. ఓ గొడవ వల్ల జెడి మూడు నెలల పాటు బాల నేరస్థులు ఉండే జువెనైల్ హోమ్ కు మాస్టర్ గా వెళ్లాల్సి వస్తుంది. దాన్ని లోకల్ గూండా భవాని(విజయ్ సేతుపతి)తన చెప్పు చేతల్లో పెట్టుకుని అక్కడి ఖైదీలతో నేరాలు చేయిస్తూ ఉంటాడు. ఇద్దరు విద్యార్థులు బలయ్యాక ఈ విషయాన్ని గుర్తించిన జెడి భవాని అంతు చూసేందుకు నిర్ణయించుకుంటాడు.అక్కడి నుంచి ఇద్దరి మధ్య నువ్వా నేనా యుద్ధం మొదలవుతుంది. ఫైనల్ గా గెలిచేది జెడినే అయినా అది ఎలా సాధించాడు, స్టూడెంట్స్ లో మార్పు ఎలా వచ్చిందో తెలియాలంటే తెరమీదే చూడాలి.

నటీనటులు

విజయ్ ది నటుడిగా కమల్ హాసన్ స్థాయి కాదు. అన్ని రకాల వేరియేషన్లు, పాత్రలు చేయలేదు చేయలేడు కూడా. కానీ కోట్లాది అభిమానుల అండ ఉంది. తన మసాలా కమర్షియల్ సినిమాలకు బ్రహ్మరథం పట్టే ఫాలోయింగ్ దన్నుగా నిలుస్తోంది. అందుకే ఎంత రొటీన్ కథలను ఎంచుకున్నా మంచినీళ్ల ప్రాయంలా రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాడు. గత విజిల్, అదిరింది ఫలితాలను చూస్తే ఇది ఎంత వరకు నిజమో అర్థమవుతుంది.

ఇక మాస్టర్ విషయానికి వస్తే ఇందులో హుషారుగా స్టూడెంట్ లా ప్రవర్తించే కాలేజీ లెక్చరర్ గా చాల సునాయాసంగా అందులో ఒదిగిపోయాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, యాక్టింగ్ తో మరోసారి ఫ్యాన్స్ కోరుకుంది ఇచ్చేశాడు. వయసు కనిపించకుండా ఎప్పుడూ ఒకేలా ఫిట్నెస్ మైంటైన్ చేయడం ఇతనికి ప్రతిసారి ఉపయోగపడుతోంది. క్లైమాక్స్ లో షర్టు లేకుండా ఫైట్ చేసి అభిమానులకు కిక్ ఇచ్చాడు.

సోలో హీరోగా తనకు ఎంత మార్కెట్ ఉన్నా సబ్జెక్టు నచ్చితే చాలు విలన్ గా నటించేందుకైనా సిద్దపడే విజయ్ సేతుపతి ఇందులో కూడా ప్రతినాయక పాత్రలో మరోసారి చెలరేగిపోయాడు. పేటతో పోలిస్తే ఇందులో ఎక్కువ స్కోప్ దొరికింది. చాలా సీన్స్ లో విజయ్ ని డామినేట్ చేసేలా తన టైమింగ్ చూపించాడు. క్యారెక్టర్ డిమాండ్ కు తగ్గట్టు అద్భుతంగా నటించాడు.

హీరోయిన్ మాళవిక మోహనన్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. లుక్స్ పరంగా అందంగా ఉంది. తనకిచ్చిన సీన్స్ లో ఆకట్టుకుంది. ఈమెకన్నా ఆండ్రియా జెరిమియా కొంత హైలైట్ అయ్యింది. జైల్లో అర్జున్ దాస్ విలనీ బాగుంది. శంతను భాగ్యరాజ్, నాజర్, దీనా, మహేంద్రన్ ఇలా క్యాస్టింగ్ చాలానే ఉంది కానీ దాదాపు అన్నీ ఆరవ ఫేసులే కావడంతో గుర్తుపట్టడం కష్టం

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు లోకేష్ కనగరాజ్ ది చాలా ప్రత్యేకమైన అభిరుచి. రెగ్యులర్ గా ఆలోచించడు. మొదటి సినిమా నగరంని తీర్చిదిద్దిన తీరు విమర్శకులను మెప్పించింది. రెండో మూవీ ఖైది గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కడా అభిమానులను తెచ్చిపెట్టింది. అందుకే మాస్టర్ మీద ఈ కోణంలో కూడా ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విజయ్ లాంటి స్టార్ హీరోతో చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని కొలతలు పాటించాలి. రాజీపడక తప్పదు. కమర్షియల్ సూత్రాలకు కట్టుబడాలి. ఇందులో లోకేష్ చేసింది అదే. తన స్టైల్ ని పక్కనబెట్టి విజయ్ ని ఎలా చూపించాలో ఒక అభిమానిగా అలోచించి మాస్టర్ కథను రాసుకున్నాడనిపిస్తుంది.

నిజానికి అప్పుడెప్పుడో 1997లో వచ్చిన చిరంజీవి మాస్టర్ కి దీనికి లైన్ పరంగా కొన్ని పోలికలు కనిపిస్తాయి. కాకపోతే ఇందులో హీరోకి తాగుబోతు అనే లక్షణం జోడించారు అంతే. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ముడిపడి ఉన్న విజయ్ సినిమా కాబట్టి లోకేష్ పెద్దగా రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ టెంప్లేట్ లోనే వెళ్లాలని చూడటం ఈ మాస్టర్ విషయంలో జరిగిన పెద్ద పొరపాటు. అందులోనూ క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకోవడంతో అవసరానికి మించిన సాగతీత సహనానికి పరీక్ష పెడుతుంది. తగ్గించొచ్చు కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా టెంపో ఉండదు. ఫ్లాట్ గా వెళ్లిపోవడం ప్రధానంగా దెబ్బ తీసింది.

హీరో విలన్ పాత్రలను అంత పవర్ ఫుల్ గా డిజైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు కలబడతారా అని మాస్ ప్రేక్షకులు ఎదురుచూడటం సహజం. దానికి భిన్నంగా అవసరం లేని సాగతీతతో క్లైమాక్స్ దాకా నెట్టుకుంటూ రావడం చాలా పెద్ద మైనస్. దానికి తోడు విజయ్ పాత్ర సగం సినిమాకు పైగా పాసివ్ గా ఉంటుంది. పచ్చి తాగుబోతుగా చూపించి ఇంటర్వల్ నుంచి బ్లాస్ట్ చేస్తే మాస్ కి పూనకాలు వచ్చి ఊగిపోతారనుకుని వేసిన లెక్క అడ్డంగా బోల్తా కొట్టింది. పై పెచ్చు జెడి కన్నా భవాని హైలైట్ అవ్వడం జీర్ణించుకోలేం. ఒకవేళ విజయ్ సేతుపతి బదులు ఇంకో నటుడు ఎవరు చేసినా సగంలోనే థియేటర్ నుంచి లేచి రావడం ఖాయం. లోకేష్ కనగరాజ్ తాను మాములు దర్శకుడిలా ఆలోచిస్తానని మాస్టర్ తో స్పష్టమైన సందేశం ఇచ్చాడు.

అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. పాటలు బాగున్నాయా లేదా అనేది జడ్జ్ చేయలేము. దారుణమైన డబ్బింగ్ స్టాండర్డ్ తో వాటి స్థాయిని బాగా తగ్గించేశారు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం లోకేష్ ఆలోచనలను యథాతథంగా తెరమీద చూపించింది. ఇద్దరు సమఉజ్జీలను డిఫరెంట్ ఫ్రేమ్స్ లో సెట్ చేసి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు బాగా వచ్చాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ మాత్రం విమర్శలకు గురయ్యేదే. లెన్త్ చాలా పెరిగిపోయింది. ఈ కథకు మూడు గంటలు చాలా ఎక్కువ. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించినట్టే రిచ్ గా ఉన్నాయి

ప్లస్ గా అనిపించేవి

విజయ్ సేతుపతి నటన
విజయ్ హీరోయిజం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ గా తోచేవి

ఎక్కువ నిడివి
విపరీతమైన సాగతీత
పాటల డబ్బింగ్
ఫార్ములా స్టోరీ

కంక్లూజన్

విడుదల ముందు రోజు వరకు తన మీద వచ్చిన విపరీతమైన అంచనాలను నిలబెట్టుకోవడంలో మాస్టర్ విఫలమయ్యాడు. హీరోయిజం ఉంటే చాలు కంటెంట్ ఎంత తేడాగా ఉన్నా వర్కవుట్ అవ్వడం తమిళనాట చెల్లుతుందేమో కానీ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఇక్కడ బలపడుతున్న విజయ్ సినిమాలకు కష్టమే. జువైనల్ హోమ్ అనే థీమ్ లో కొత్తదనం ఉన్నప్పటికీ మిగిలినదంతా రొటీన్ వ్యవహారం కావడంతో మాస్టర్ ఆకర్షణ కోల్పోయాడు. ఆ ఇద్దరు హీరోల మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్ప మాస్టర్ సగం స్థాయిలో మెప్పించడం కూడా కష్టమే.

ఒక్క మాటలో - సారీ మాస్టర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp