కనులు కనులను దోచాయంటే రివ్యూ

By Ravindra Siraj Feb. 28, 2020, 08:49 pm IST
కనులు కనులను దోచాయంటే రివ్యూ

టాలీవుడ్ ను ఒకప్పుడు రాజ్యమేలైన డబ్బింగ్ సినిమాలకు చాలా కాలం నుంచి గడ్డు కాలం ఎదురవుతోంది. కనీస బజ్ లేక విక్రమ్, సూర్య లాంటి తలపండిన హీరోలు సైతం ఓపెనింగ్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. రజనీకాంత్ అంతటివాడికే మార్కెట్ లేనప్పుడు ఇంకెవరి గురించైనా చెప్పుకోవడం అంతగా నప్పదు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంచనాలు లేకుండా టాక్ వస్తే అదే ఆడుతుందిలే అనే ధీమా కనపరిచి ప్రమోషన్ పరంగా వీక్ గా వచ్చిన సినిమా కనులు కనులను దోచాయంటే. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ చాలా గ్యాప్ తర్వాత తెరమీద కనిపించడం దీంతోనే మొదలు. ఓకే బంగారం. మహానటితో మన ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఇవాళే విడుదలయ్యింది. మరి మణిరత్నం సూపర్ హిట్ సాంగ్ పల్లవిని టైటిల్ గా పెట్టుకుని వచ్చిన ఈ చిత్రం మెప్పించేలా సాగిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథ

జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా ఆన్ లైన్ మోసాలతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు యాప్ డెవలపర్ సిద్ధార్థ(దుల్కర్ సల్మాన్)అతని స్నేహితుడు యానిమేటర్ క్యాలిస్(రక్షన్). ఫ్రీ లాన్సర్ బ్యూటీషియన్ గా ఉన్న అనాథ మీరా(రీతూ వర్మ)ని సిద్దు ప్రేమిస్తాడు. క్యాలిస్ కూడా ఆమె ఫ్రెండ్ శ్రేయ(నిరంజని అహతియన్)ని ప్రేమిస్తాడు. కానీ సిద్దు, కలిస్ ప్రియురాళ్లకు తమ నేరాలు బయటపడకుండా జాగ్రత్త పడతారు.

పోలీసులు పసిగట్టకుండా ఉండేందుకు ఓ పెద్ద స్కామ్ చేసి బాగా డబ్బు పోగేస్తారు. తర్వాత ఈ రెండు జంటలు కలిసి గోవాకు వెళ్ళిపోయి సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అక్కడికి చేరుకున్నాక వీళ్ళను వెంటాడుతూ వస్తాడు పోలీస్ కమీషనర్ ప్రతాప సింహ(గౌతమ్ మీనన్). కథ మలుపులు తిరిగి ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. అసలు సిద్దు, క్యాలిస్ ల ప్రేమకథలు సుఖంతమయ్యాయా, వెంటపడుతున్న పోలీసోడి చేతికి వీళ్ళు చిక్కారా లేదా అనేదే అసలు కథ

ఎలా చేశారు

నటుడిగా దుల్కర్ సల్మాన్ మనవాళ్ళకు తెలిసింది తక్కువే కానీ మలయాళంలో ఇతగాడు ప్రూవ్డ్ యాక్టర్. తండ్రి బ్రాండ్ తోనే తెరకు పరిచయమైనా కథల ఎంపికలో వైవిధ్యం పాటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు . కాకపోతే ఇదీ మరీ చెప్పుకోదగ్గ చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర కాదు కాని ఉన్నంతలో సిద్దుగా తనదైన మార్క్ చూపించాడు. అయితే ఇలాంటి రోల్ కు ఉండాల్సిన ఒక ప్రత్యేకమైన స్పార్క్ సిద్ధూలో మిస్ అయ్యిందనిపిస్తుంది. కాని ఉన్నంతలో చక్కగానే చేశాడు. అందంగానూ ఉన్నాడు. ఏళ్లకేళ్ళు ఇండస్ట్రీలోనే ఉన్నా స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేకపోతున్న కొందరు సీనియర్ హీరోల కన్నా చాలా మెరుగ్గా స్పష్టమైన ఉచ్చారణతో దుల్కర్ స్వయంగా గొంతునివ్వడం మెచ్చుకునే తీరాలి.

ఇక రీతువర్మకు టైం కలిసి రాక అవకాశాలు రావడం లేదో లేక గ్లామర్ షో చేయదు కాబట్టి దర్శక నిర్మాతలు పలకరించడం లేదో తెలియదు కాని సరైన పాత్రలు ఇస్తే మంచి టైమింగ్ తో మెప్పించే టాలెంట్ తన సొంతం. పెళ్లి చూపులుతో పోల్చడం సరికాదు కాని ఒక డిఫరెంట్ రోల్ గా రెగ్యులర్ హీరొయిన్ ఫార్ములాకు దూరంగా సాగుతూ వెళ్ళిన మీరాగా చక్కగా ఒదిగిపోయింది రీతూ. కెరీర్ లో చేసిందే తక్కువ సినిమాలు కాబట్టి దీన్ని బెస్ట్ సెకండ్ గా చెప్పొచ్చు.

హీరో ఫ్రెండ్ గా నటించిన రక్షణ్ తనకిచ్చిన స్పేస్ తో ఆదుకున్నాడు. పంచులు, వన్ లైనర్స్ తో కామిక్ రిలీఫ్ ఇచ్చాడు. ప్రియురాలుగా నటించిన నిరంజనితో చేసిన సీన్స్ పండాయి. ఈ అమ్మాయి కూడా బాగానే కుదిరింది. విలన్ గా డెబ్యు చేసిన దర్శకుడు గౌతం మీనన్ తనకు అలవాటు లేని నటనను అలవోకగా చేశాడు. కాని ఎక్స్ ప్రెషన్స్ పరంగా కాస్త హెవీ ఇంటెన్సిటీ డిమాండ్ చేసే పాత్ర కావడంతో ఎవరైనా సీనియర్ నటులైతే బాగుండు అనిపిస్తుంది. ఏదో ఫ్రెష్ నెస్ కోసం గౌతంని తీసుకోవడం బ్యాడ్ రిజల్ట్ అయితే ఇవ్వలేదు. అనీష్ కురువిల్లా కూడా చెప్పుకోదగ్గ పాత్రే చేశాడు. మిగిలిన తారాగణంలో ఇంకెవరు మనకు కనిపించరు.

దర్శకుడి గురించి

డెబ్యు డైరెక్టర్ దేసింగ్ పెరియస్వామి తీసుకున్న పాయింట్ మరీ కొత్తది కాదు కాని ఖచ్చితంగా మంచి ప్రయత్నమనే చెప్పొచ్చు. గతంలో ఇలాంటి థీమ్ తో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే లవ్ ని క్రైమ్ ని సమపాళ్లలో మిక్స్ చేసిన మూవీస్ మాత్రం తక్కువే. కనులు కనులను దోచాయంటే ఇక్కడే అదనపు మార్కులు కొట్టేసింది. ఓ ప్రేమకథలా మొదలుపెట్టినా ఇదేదో రొటీన్ గా వెళ్తోందనుకున్న ఫీలింగ్ కలిగినప్పుడు అక్కడి నుంచి టెంపో పెంచి వేగమైన స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టిస్తాడు. హీరో అతని ఫ్రెండ్ ఇద్దరూ దొంగలనే మెయిన్ ట్విస్ట్ ని త్వరగానే రివీల్ చేసినా ఆ తర్వాత ఊహకందకుండా రాసుకున్న మలుపులు ప్రేక్షకుడిని పూర్తిగా ఎంగేజ్ చేస్తాయి.

నిజానికి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ సాధారణంగా బాలీవుడ్ లో చూస్తుంటాం. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో మాస్టర్ పీస్ గా నిలిచిపోయిన రేస్ సినిమా మోడల్ లో దీన్ని తీర్చిదిద్దాడు పెరియస్వామి. ఆ స్థాయి టేకింగ్, మేకింగ్ లేకపోయినా థ్రిల్స్ కు లోటు లేకుండా చూసుకోవడంతో చాలా చోట్ల చిన్న లాజిక్స్ మిస్ అయిన విషయాన్నీ పెద్దగా పట్టించుకోం. అంత బిల్డప్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్ర సెకండ్ హాఫ్ చాలా సేపు మాయం కావడం ఆ లోటు ఫీలయ్యేలా చేస్తుంది. రెండు జంటల మధ్యనే కథ నడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చిన పెరియస్వామి ఆ విషయంలో యూత్ కి కనెక్ట్ అవ్వడంలో సక్సెస్ అయ్యాడు కాని రెగ్యులర్ ఆడియన్స్ కి ఇదంతా ఒకరకమైన ప్రహసనంలా అనిపిస్తుంది. ఇంకెవరైనా కొత్తవాళ్ళు వస్తారేమో ఇంకేమైనా జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్న కొద్ది స్టొరీ వేరే వాళ్ళను తీసుకొచ్చేందుకు ఇష్టపడదు.

ఈ సినిమా టైటిల్ ని బట్టి ఇదో ప్రేమ కథ అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టే. కథలో ప్రేమ ఉంది కాని ఆది ప్రధాన వస్తువు కాదు. ఇలాంటి జానర్ మూవీస్ ఊహాతీతంగా జరిగినప్పుడే సక్సెస్ అవుతాయి. క్లైమాక్స్ సుఖాంతం అవుతుందని తెలిసినా కూడా బిగిసడలని కథనంతో సదరు పాత్రలు ఫలానా సిచువేషన్ నుంచి ఎలా తప్పించుకుంటాయా అని ఉత్కంట రేపడంలో పెరియస్వామి చేసిన హోం వర్క్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. అయితే హీరో మరీ సూపర్ బ్రెయిన్ తరహాలో నమ్మశక్యం కాని రీతిలో కోట్ల కొద్ది డబ్బు దోచుకోవడం పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఇదేంటి అనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడ్డాడు పెరియస్వామి. మొత్తానికి ఏదో ఊహించుకుని ధియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి పూర్తి అసంతృప్తి కలగకుండా పెరియస్వామి పాస్ అయ్యాడు

సాంకేతిక వర్గం

ఈ సినిమాకు మరో హీరో నేపధ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్. బిజిఎంతో అదరగొట్టాడు. చాలా సన్నివేశాలకు తన సిగ్నేచర్ కంపోజింగ్ తో ప్రాణం పోశాడు. అక్కడక్కడా కొంత రొద అనిపించినా ఓవరాల్ గా దర్శకుడి ఆలోచనలు గ్రిప్పింగ్ గా సాగడంలో ఇతని అవుట్ పుట్ చాలా హెల్ప్ చేసింది. అర్జున్ రెడ్డిలో బయట పడిన ఇతని టాలెంట్ మళ్ళి ఇందులోనే చూడొచ్చు.

పాటలు ఇచ్చిన మసాలా కేఫ్ మాత్రం సోసో ట్యూన్స్ ఇచ్చారు, వాటి డబ్బింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఏదీ గుర్తుండదు. మాటల అనువాదం బాగుంది. కెఎం భాస్కరన్ ఛాయాగ్రహణం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడా వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు. ప్రవీణ్ అంటోనీ ఎడిటింగ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ని తగ్గిస్తే ఇంకా క్రిస్పిగా ఉండేది. వయకాం, అంటో జోసెఫ్ నిర్మాణ విలువలూ బాగున్నాయి. కోరినంత ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

దుల్కర్, రక్షణ్ పెర్ఫార్మన్స్
రీతు వర్మ పాత్ర
ట్విస్టులు
నేపధ్య సంగీతం

మైనస్ గా తోచేవి

పాటలు
నమ్మశక్యం కాని కొన్ని మలుపులు
సింపుల్ క్లైమాక్స్
ఆరే పాత్రలు ఉండటం
కథకు సంబంధం లేని టైటిల్

చివరి మాట

సాధారణంగా విలన్ క్రైమ్ చేస్తే హీరో పట్టుకోవడం చూసే అలవాటున్న ప్రేక్షకులకు రివర్స్ లో హీరో హీరొయిన్లు ఇద్దరూ నేరాలు చేస్తూ విలన్ ని దోచుకోవడం అనే కొత్త పాయింట్ తో దర్శకుడు దేసింగ్ పెరియస్వామి చేసిన ప్రయత్నం నీరుగార్చే ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలాంటి జానర్ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులకు టికెట్ రేటుని గిట్టుబాటు కలిగించినా రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కు మాత్రం ఏదో చిన్న తెలియని వెలితి అనిపిస్తుంది. అది మినహాయిస్తే గతంలో వచ్చిన దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ సినిమాలతో పోలిస్తే కంటెంట్ పరంగా క్వాలిటీ పరంగా కనులు కనులను దోచాయంటే మెప్పించే విధంగానే సాగింది

సింపుల్ గా చెప్పాలంటే

కనులు కనులు దోచాయంటే - థ్రిల్స్ తో మెప్పించే లవ్ క్రైమ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates