హిట్ మూవీ రివ్యూ

By G.R Maharshi Feb. 28, 2020, 01:17 pm IST
హిట్ మూవీ రివ్యూ

ఇన్వెస్టిగేష‌న్ ఎక్కువైన ‘‘హిట్‌’’

మాకో లెక్క‌ల లెక్చ‌ర‌ర్ ఉండేవాడు. పీహెచ్‌డీ చేశాడు. అపార‌మైన జ్ఞానం. కానీ ఒక్క లెక్క కూడా అర్థ‌మ‌య్యేలా చెప్పేవాడు కాదు. నాలెడ్జి వేరు, అర్థ‌మ‌య్యేలా ఆస‌క్తిగా చెప్ప‌డం వేరు. ‘హిట్’ సినిమా డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శైలేష్ కొల‌నుది కూడా ఇదే ప‌రిస్థితి. ఆయ‌న‌కి ఆధునిక నేర పరిశోధ‌న‌లో మంచి నాలెడ్జి ఉంది. కానీ ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌డంలో త‌త్త‌ర‌ప‌డ్డాడు. పైగా ప‌రిశోధ‌న‌లో కొత్త‌ద‌నం ఉందేమో కానీ, క‌థ మాత్రం చాలా సార్లు చూసిన‌దే.

నేర ప‌రిశోధ‌న‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల‌కి చాలా గొప్ప పేరు. ఎంత‌టి నేరాన్ని అయినా స‌రే ప‌రిష్క‌రిస్తార‌ని ఖ్యాతి. వాళ్ల మీద ఎన్నో పుస్త‌కాలు, సినిమాలు వ‌చ్చాయి. ఈ ప్రేర‌ణ‌తో ఆర్థ‌ర్ కాన‌న్ డ‌య‌ల్ త‌న ర‌చ‌న‌ల్లో షెర్లాక్ హోమ్స్‌కి ప్రాణం పోశాడు. స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన కాన‌న్ డ‌య‌ల్ త‌న ప‌రిజ్ఞానాన్ని అంతా హోమ్స్ కోసం వాడ‌డంతో ఆ పాత్ర ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందింది. షెర్లాక్ మీద ఎన్నో సినిమాలు , టీవీ సీరియ‌ల్స్ వ‌చ్చాయి. ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల్లో వ‌చ్చిన నేర ప‌రిశోధ‌న క‌థ‌ల‌కి షెర్లాక్ హోమ్స్ ప్రేర‌ణ అంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ మ‌ధ్య తెలుగులో క్రైమ్ థ్రిల్ల‌ర్స్ జోరు పెరిగింది. రాక్ష‌సుడు , అశ్వ‌థ్థామ , త‌ర్వాత హిట్‌. నాని నిర్మాత‌గా తీసిన ఈ సినిమాలో విష్వ‌క్‌సేన్ హీరో. నాని గ‌తంలో తీసిన ఆ , ఇపుడు తీసిన హిట్ ఈ రెండు కూడా కొత్త త‌ర‌హా క‌థ‌లే. ఫ‌స్ట్ నాని అభిరుచికి మెచ్చుకోవాలి.

సినిమా ఎట్లా ఉందంటే కొండంత రాగం తీసి , చివ‌రికి కూని రాగంతో ముగించిన‌ట్టుంది. ఎత్తుగ‌డ చూస్తే సైకో థ్రిల్ల‌ర్ అనుకుంటాం. హీరోకి ఏవో జ్ఞాప‌కాలు వెంటాడుతూ ఉంటాయి. దాని చుట్టూ క‌థ తిరుగుతుందేమో అనుకుంటాం. మ‌నం ఊహించింది జ‌ర‌గ‌క‌పోవ‌డం మంచి క‌థ ల‌క్ష‌ణ‌మే కానీ, ఊహించ‌నిది జ‌ర‌గ‌డ‌మే కాదు, ఒక ద‌శ‌లో క‌థ ఎటు పోతూ ఉందో కూడా అర్థం కాదు. స్క్రీన్ ప్లేని టైట్‌గానే రాసుకున్న ద‌ర్శ‌కుడు , అది ఆస‌క్తి క‌లిగేలా చెబుతున్నానా లేదా అనేది మ‌రిచిపోయాడు.

క‌థ ఏంటంటే హీరో సీఐడీ అధికారి. అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ పోరెన్సిక్‌లో ప‌నిచేస్తూ ఉంటుంది. ఒక రోజు ప్రీతి అనే అమ్మాయి మిస్ అవుతుంది. ఆమె కోసం వెతుకుతూ ఉండ‌గా హీరో గ‌ర్ల్ ఫ్రెండ్ కూడా మిస్ అవుతుంది. రెండింటికి ఏమైనా లింక్ ఉందా లేదా ? అస‌లు వాళ్లు ఏమైనారు? ఈ ప‌రిశోధ‌నే సినిమా.

ఔట‌ర్ రింగ్‌రోడ్డులో అమ్మాయి త‌ప్పి పోవ‌డం చూసి , ఈ మ‌ధ్య జ‌రిగిన దిశ సంఘ‌ట‌న‌ని సినిమా తీశారేమో అనిపిస్తుంది. కానీ క‌థ ర‌క‌ర‌కాలుగా మ‌లుపులు తిరిగి , అనేక మందిపై అనుమానం క‌లిగి , హీరో వాళ్ల‌ని ర‌క‌ర‌కాలుగా విచారిస్తూ ఉంటాడు. చివ‌రికి మ‌న ఊహ‌కి అంద‌ని విల‌న్ బ‌య‌టికి వ‌స్తాడు.

ప్ర‌పంచంలో ఎవ‌రు తీసినా థ్రిల్ల‌ర్ క‌థ‌లు రెండే ర‌కాలు. విల‌న్ ఎవ‌రో ఆఖ‌రులో చెప్ప‌డం, లేదా విల‌న్‌ని రివీల్ చేసి , హీరో, విల‌న్ మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ షో న‌డ‌ప‌డం. విల‌న్‌ని రివీల్ చేయ‌క‌పోతే ప్రేక్ష‌కులు ర‌క‌ర‌కాలుగా ఊహించుకుంటారు. తానే ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేసి విల‌న్‌ని ఊహిస్తూ ఉంటాడు. తెలివైన డైరెక్ట‌ర్ అయితే విల‌న్‌ని గెస్ చేసే క్లూస్ ఇస్తూ ఉంటాడు. అందుకే హిచ్‌కాక్ సినిమాలు రెండుసార్లు చూసేది. కానీ హిట్ సినిమా డైరెక్ట‌ర్ శైలేష్‌కి త‌న నాలెడ్జి మీదే త‌ప్ప , ప్రేక్ష‌కుల తెలివితేట‌ల మీద న‌మ్మ‌కం లేదు. అందుకే కొత్త‌కొత్త అనుమానితుల‌ను తెర‌మీద‌కి తెచ్చి క‌న్ఫ్యూజ్ చేస్తుంటాడు.

అలాగ‌ని అర‌టి పండు ఒలిచి నోట్లో పెట్ట‌మ‌ని ఎవ‌రూ చెప్ప‌రు. ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ జారిపోకుండా క‌థ చెప్పాలి. కానీ ఫింగ‌ర్ ప్రింట్స్ , డీఎన్ఏ, నార్కోస్‌, లై డిటెక్ష‌న్‌, సీసీ పుటేజ్‌....ఇలా ప‌రిశోధ‌న‌లో వ‌చ్చిన టెక్నాల‌జీని మ‌న‌కు ప‌రిచ‌యం చేశాడే త‌ప్ప‌, ఎమోష‌న్స్ క‌నెక్ట్ అవుతున్నాయో లేదో చూసుకోలేదు. సినిమాలో ఫొటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం బ‌లంగా ఉండ‌డంతో ఎలాగో ఓపిక ప‌డుతాం త‌ప్ప‌, లేదంటే టీవీలో వ‌చ్చే సీఐడీ సీరియ‌ల్‌కి దీనికి పెద్ద‌గా తేడా లేదు. మ‌న‌కి థియేట‌ర్‌లో కూర్చున్న‌ట్టు ఉండాలి త‌ప్ప , పోలీస్‌స్టేష‌న్‌లోనో, ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనో కూచున్న‌ట్టు ఉండ‌కూడ‌దు.

చివ‌ర్లో నేరం జ‌ర‌గ‌డానికి కార‌ణం కూడా పెద్ద క‌న్విన్సింగ్‌గా లేదు. ఇంతేనా అనిపిస్తుంది. అయితే రొటీన్ స‌న్నివేశాలు లేకుండా తీయాల‌నుకున్నారు కాబ‌ట్టి అలాగే తీశారు. ఆ మేర‌కు స‌క్సెస్ అయ్యారు. కానీ రెండు గంట‌ల సేపు ప‌రిశోధ‌న‌ని కంటిన్యూగా చూడ‌డం క‌ష్ట‌మే. విష్వ‌క్‌సేన్ అద్భుతంగా న‌టించాడు. మంచి క‌థ ప‌డితే సినిమాని మొత్తం భుజాల మీద మోయ‌గ‌ల‌డు.

దీనికి పార్ట్ 2 కూడా ఉంద‌న్నారు. అది కూడా ఇలాగే ఉంటే ప్రేక్ష‌కులు ఫ‌ట్‌.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates