English

జార్జ్ రెడ్డి రివ్యూ

By iDreamPost.com Nov. 23, 2019, 10:50 pm IST
జార్జ్ రెడ్డి రివ్యూ

ఉద్య‌మం + ఉద్వేగం= జార్జిరెడ్డి

శిల్పికి చెక్క‌డం తెలిస్తే చాల‌దు. అనువైన శిల కూడా ఉండాలి. సినిమాకి కూడా అంతే. మంచి క‌థ ఉంటే చాల‌దు. దాన్ని తెరకెక్కించే నేర్పు కూడా ఉండాలి. జార్జిరెడ్డి క‌థ‌లోనే అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉన్నాయి. అన్నింటికి మించి ఫైర్ ఉంది. శిల దొరికిన‌ప్పుడు శిల్పి (ద‌ర్శ‌కుడు) జీవ‌న్‌రెడ్డి ఏం చేశాడంటే ఉలి ప‌ట్టుకోవ‌డంలో అక్క‌డ‌క్క‌డ త‌డ‌బ‌డ్డాడు. చిన్నచిన్న లోపాలున్న‌ప్ప‌టికీ జార్జిరెడ్డి మంచి సినిమా. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసేవాళ్ల‌కి ఇది న‌చ్చుతుందో లేదో తెలియ‌దు గానీ తెలుగు సినిమా రూపు రేఖ‌ల్ని కొత్త ద‌ర్శ‌కులు మారుస్తున్నార‌ని చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ‌...

PDSU (ప్రోగ్రెసివ్ డెమోక్ర‌టిక్ స్టూడెంట్ యూనియ‌న్‌) పేరు మొద‌టిసారిగా 1985లో SK యూనివ‌ర్సిటీలో విన్నాను. జూలూరు గౌరీశంక‌ర్ (ప్ర‌స్తుత బీసీ క‌మిష‌న్ స‌భ్యులు) ఈ యూనియ‌న్ నాయ‌కుడు. జార్జిరెడ్డి పేరు మొద‌టిసారిగా ఆయ‌న ద్వారానే విన్నాను. విద్యార్థి ఉద్య‌మంలో హ‌త్య‌కు గురైన నాయ‌కుడిగా ఆయ‌న పేరు అంద‌రి నోళ్ల‌లో నానేది.
జార్జిరెడ్డి పుట్టేనాటికి ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోలంగా ఉంది. చైనా, ర‌ష్యాల్లో విప్ల‌వం విజ‌య‌వంత‌మైంది. స్పెయిన్ సివిల్ వార్ ముగిసింది. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. బ‌తుకులేం మార‌లేదు. న‌క్స‌లైట్ ఉద్య‌మాలు తీవ్రంగా న‌డుస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది.

పోరాట రాజ‌కీయాలు ఉజ్వ‌లంగా, ఉద్వేగంగా న‌డుస్తున్న కాలంలో ఆయ‌న ఉస్మానియాలో అడుగు పెట్టాడు. ఇన్ని విష‌యాలు తెలుసుకుంటే త‌ప్ప ద‌ర్శ‌కుడు జీవ‌న్‌రెడ్డి ఈ సినిమా తీయ‌లేడు.అయితే బేసిక్‌గా ద‌ర్శ‌కుడు నిజాయితీగా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించాడు. (ఆయ‌న వేసిన త‌ప్ప‌ట‌డుగులు గురించి మ‌ళ్లీ మాట్లాడుకుందాం). జార్జి గురించి చాలా విష‌యాలు తెలుసుకున్నాడు. అప్ప‌టి ఉస్మానియా యూనివ‌ర్సిటీని తెర‌మీదికి తీసుకురావ‌డంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. (ఆర్ట్ డైరెక్ట‌ర్‌ని ప్ర‌త్యేకంగా అభినందించాలి). చిన్న‌షాట్‌లో కూడా ఈ సినిమా క‌థాకాలం ( 1967-72) గురించి ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు.

సినిమాకి మూడ్ క్రియేట్ చేయ‌డంలో ఫొటోగ్ర‌ఫీ , నేప‌థ్య సంగీతం స‌క్సెస్ అయ్యాయి. హీరోగా సందీప్ క‌రెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. జార్జిరెడ్డి ఇలాగే ఉండేవాడేమో అన్నంత బాగా చేశాడు. మిగిలిన అంద‌రూ కూడా అద్భుతంగా న‌టించారు.
బ‌యోపిక్ తీయ‌డ‌మంటే మాట‌లు కాదు. చాలా ప‌రిశోధ‌న‌ జ‌రిగాలి. సినిమాలో క‌నిపించేవాళ్లంతా కూడా , 1967-72 నాటి మ‌నుషుల్లాగానే ఉన్నారు. ముఖ్యంగా హెయిర్ స్ట‌యిల్‌, కాస్ట్యూమ్స్ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ వ‌హించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ సెట్ కూడా సినిమాకి Asset.

డైలాగ్స్ చాలా పొదుపుగా , అర్థ‌వంతంగా ఉన్నాయి. జార్జిరెడ్డి భావ‌జాలంపై ద‌ర్శ‌కుడికి గౌర‌వం, అవ‌గాహ‌న లేక‌పోతే ఇలా రాయ‌డం క‌ష్టం.

"దేశంలోనైనా , క్యాంప‌స్‌లోనైనా ఆధిప‌త్య‌మే రాజ్య‌మేలుతుంది. చావు ఒక్క‌సారే వ‌స్తుంది"- ఇలా చాలా చెప్పుకోవ‌చ్చు.
ఒక Epic లా మిగ‌లాల్సిన సినిమా ఎక్క‌డ త‌డ‌బ‌డిందంటే దీనికి క‌మ‌ర్షియ‌ల్ క‌ల‌ర్ పూయాల‌నే బ‌ల‌హీన‌త ద‌ర్శ‌కుడ్ని అక్క‌డ‌క్క‌డ ఆవ‌రించ‌డం వ‌ల్ల! ఇలాంటి క‌థ‌ల‌న్నీ ప్లాష్ బ్యాక్ నేప‌థ్యంలోనే చెబుతారు. అక్క‌డ‌ వ‌ర‌కు OK. హీరోయిన్‌కి పాట పెట్ట‌డం ప్లోని ఆపింది. నిజానికి ఈ పాట‌ని తీసిన తీరు చాలా బాగుంది. అక్క‌డ‌క్క‌డ డాక్యుమెంట‌రీ త‌ర‌హాలో స్లోగా న‌డిచింది. హీరోయిజం ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం కొంత న‌డిచింది.జార్జిరెడ్డి నేప‌థ్యం ఉస్మానియా ఉద్య‌మ స్వ‌రూపం తెలియ‌ని వాళ్ల‌కి ఏముంది ఈ సినిమాలో , క్యాంప‌స్‌లో రెండు గ్రూపుల కొట్లాట‌ని శివా సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం క‌దా అనిపిస్తుంది.

ఇవి ప‌క్క‌న పెడితే సినిమా అభిమానులంతా త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే పాత త‌రం వాళ్లు త‌మ కాలం ఉద్య‌మాల్ని గుర్తు చేసుకోడానికి.

కొత్త‌త‌రం వాళ్లు ఒక‌ప్ప‌టి ఉద్య‌మ నాయ‌కులు ఎలా ఉన్నారో తెలుసుకోడానికి.
గూండాల చేతిలో జార్జిరెడ్డి చ‌నిపోవ‌చ్చు. కానీ ఆయ‌న ర‌గిలించిన అగ్నిక‌ణం కొన్ని ద‌శాబ్దాలు విద్యార్థుల్ని న‌డిపించింది. వీరులు చ‌నిపోయినా బ‌తికే ఉంటారు.

ఈ సినిమాలో జార్జిరెడ్డిని రెండోసారి హ‌త్య చేశార‌ని పోస్టింగ్ చ‌దివాను. కానీ అది నిజం కాదు. జార్జిని బ‌తికించ‌డానికి ద‌ర్శ‌కుడు ఎంతో కృషి చేశాడు. 100 శాతం విజ‌యం ల‌భించ‌క‌పోవ‌చ్చు. అది వేరే విష‌యం.

-GR Maharshi

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp

Latest Updates