అరణ్య రివ్యూ

By Ravindra Siraj Mar. 26, 2021, 10:05 pm IST
అరణ్య రివ్యూ

బాహుబలి తర్వాత వ్యక్తిగత కారణాలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయిన దగ్గుబాటి రానా నేనే రాజు నేనే మంత్రితో మెప్పించి ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడులో మాత్రమే దర్శనమిచ్చాడు. కథ నచ్చితే పాజిటివా నెగటివా అని ఆలోచించకుండా ఓకే చెప్పే రానా చాలా కష్టపడి చేసిన చిత్రం అరణ్య. మల్టీ లాంగ్వేజ్ గా ఒకేసారి హిందీ తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మీద అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా అక్కడ విడుదల వాయిదా వేసినా సౌత్ లో మాత్రం యథావిధిగా రిలీజ్ చేశారు. రంగ్ దేతో పోటీ పడిన అరణ్య కొత్త కాన్సెప్ట్ తో అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

నరేంద్రభూపతి ఉరఫ్ అరణ్య(రానా)తన తాతలు ప్రభుత్వానికి ఇచ్చేసిన వందల ఎకరాల అటవీ ప్రాంతంలోనే నివాసముంటూ ఏనుగులు, జంతువులకు రక్షకుడిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఫారెస్ట్ మినిస్టర్ రాజగోపాల్(అనంత్ మహదేవన్)కు దాని మీద కన్నుపడి అక్కడి అరవై ఎకరాల్లో స్మార్ట్ సిటీ కట్టేందుకు ప్లాన్ చేస్తాడు. అంతే కాదు ఏనుగులు తిరిగే మార్గాన్ని మూసేసి గోడ కట్టి మరీ పనులు మొదలుపెడతాడు. దీన్ని ఎదిరించినందుకు అరణ్య మీద పిచ్చివాడిగా ముద్రవేసి జైలుకు పంపిస్తాడు. తర్వాత బయటికి వచ్చిన అరణ్య తన ప్రాణాన్ని లెక్కచేయకుండా మరీ ఎలా అడవిని అక్కడి జనాన్ని రక్షించుకున్నాడు అనేదే స్టోరీ

నటీనటులు

రానా అరణ్య పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఇలాంటివి చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించే సగటు హీరోలకు భిన్నంగా ఈ కథను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఒప్పుకోవడంలోనే గొప్ప విజయం సాధించాడు. సినిమా ఫలితం తనకు సంబంధించినది కాదు కాబట్టి రానా సెలక్షన్ ను తప్పు బట్టలేం. మేకప్ విషయంలో తీసుకున్న శ్రద్ధ, మధ్యవయస్కుడిగా అద్భుతంగా పలికించిన హావభావాలు ఎన్నో అవార్డులకు దారి చూపిస్తాయన్న మాట వాస్తవం. బాహుబలి కన్నా బెస్ట్ క్యారెక్టర్ ఇదేనని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు కానీ కమర్షియల్ లెక్కల్లో అరణ్య స్థానం ఎక్కడ ఉన్నా రానాకు మాత్రం ఇది చిరస్మరణీయం.

విష్ణు విశాల్ మంచి నటుడే అయినప్పటికీ ఇందులో తలా తోకా లేకుండా సాగిన పాత్ర అతనికి పైసా ప్రయోజనం కలిగించలేదు. పైగా ఎడిటింగ్ లో కోత వేశారు కాబోలు ఉన్నట్టుండి అంతర్ధానమవుతుంది. దీని వల్ల ఎలాంటి ప్రాధాన్యత లేక ఇతను మొత్తంగా తేలిపోయాడు. జోయా హుసేన్ ఏదో చేయడానికి ప్రయత్నించింది కానీ దర్శకుడు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. శ్రియ పిల్గొంకర్ కూడా అంతే. మెయిన్ విలన్ గా చేసిన అనంత్ మహదేవన్ ఆ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సరిపోయారు. రఘుబాబు, రవి కాలేలు ఓకే. మిగిలిన క్యాస్టింగ్ లో ఎవరూ అంతగా గుర్తుకురాదు. కొన్ని తమిళ ముఖాలు ఉన్నాయి

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ప్రభు సాల్మన్ అడవి నేపథ్యంలో మంచి సినిమాలు తీస్తాడని పేరుంది. ప్రేమఖైదిని తీర్చిద్దిద్దిన తీరు మన ప్రేక్షకులను సైతం మెప్పించింది. గజరాజు ఫ్లాప్ అయినా నచ్చినవాళ్లు లేకపోలేదు. అదీ ఏనుగు బ్యాక్ డ్రాప్ లో సాగే కథనే. అయితే అరణ్యలో ఇదే పాయింట్ ని తీసుకుని సమాజానికి ఓ మంచి మెసేజ్ ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పాలని చేసిన ప్రయత్నం అయోమయం స్క్రీన్ ప్లే వల్ల దెబ్బ తింది. అడవులను నాశనం చేసుకుంటూ వెళ్తే జరిగే నష్టాలను వివరిస్తూనే క్లాస్ మాస్ మెచ్చేలా ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు అవసరమైన చోట జొప్పించి అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నా లాభం లేకపోయింది.

అరణ్య అసలు లోపం స్క్రిప్ట్ దశలోనే జరిగిపోయింది. దట్టమైన అడవులను టార్గెట్ చేసే కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు హీరో క్యారెక్టర్ తో పాటు మిగిలిన పాత్రల ద్వారానూ ఎమోషన్ ని పలికించాలి. అలా కాకుండా కేవలం అరణ్య ద్వారానే భావోద్వేగాలను రప్పించి మిగిలినవి లైట్ తీసుకోవడంతో ఉద్వేగంగా సాగాల్సిన అతని జర్నీ ఎగుడుదిగుడుగా సాగుతుంది. ఎంతసేపు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు చూపించారు తప్పించి దాని బదులు తన ఏనుగు చనిపోయిన సింగడితో అరణ్యను జట్టు కట్టించి ఇద్దరూ కలిసి ఏదైనా పోరాటం చేసినట్టు డిజైన్ చేసుకుని ఉంటే మాస్ కు నచ్చే అవకాశాలు పెరిగేవి.

ఉద్దేశం ఎంత మంచిదైనా ప్రేక్షకులను మెప్పించాలంటే సినిమా ఫార్మాట్ ని ఫాలో కావాల్సిందే. డాక్యూమెంటరీ తరహా ప్రెజెంటేషన్ ని ఇరికిస్తే బోర్ కొట్టే అవకాశం ఉంది. అరణ్యలో జరిగిన పొరపాటు ఇదే. కథలో అసలు పాయింట్ ని మొదటి అరగంటలోనే ఓపెన్ చేశారు కాబట్టి ఆపై జరిగేదంతా థ్రిల్లింగ్ గా ఎంగేజింగ్ గా సాగాలి. ఢిల్లీలో రానా రోడ్డు మీదే ఛేజ్ తప్ప అలాంటి మంచి గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్స్ పెద్దగా లేకపోవడం విసుగు తెప్పిస్తుంది. పిచ్చాసుపత్రి ప్రహసనం కూడా ల్యాగ్ అయ్యింది. అవసరమే లేని సింగడి ట్రాక్ కి పాటలు ఎందుకు పెట్టారో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

శంతను మొయిత్రా పాటల పరంగా మెప్పించలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. సౌండ్ అద్భుతంగా కుదిరింది. రసూల్ పూకుట్టి పనితనాన్ని మెచ్చుకోవాలి. ఏఆర్ అశోక్ కుమార్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టన్నింగ్ విజువల్స్ ని చూపించారు. ప్రశాంత్ రాయ్-శ్రద్ధ రాయ్ ల ఆర్ట్ పనితనం కూడా ప్రశంసలకు అర్హత దక్కించుకుంది. ఇంత రిస్క్ చేసి బడ్జెట్ లెక్కచేయకుండా రియల్ లొకేషన్లలో, ఏనుగులతో షూటింగ్ చేసిన ఎరోస్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంది. రిచ్ నెస్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

రానా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్
ఫారెస్ట్ విజువల్స్
కెమెరా వర్క్
బిజిఎం

మైనస్ గా తోచేవి

అర్థం లేని లవ్ ట్రాక్
సింగడి పాత్ర ముగింపు
పాటలు
ఎడిటింగ్
సాగతీత స్క్రీన్ ప్లే

కంక్లూజన్

కొన్ని సినిమాలకు కమర్షియల్ లెక్కల్లో మంచి చెడు నిర్ణయించడం కష్టం. అరణ్య ఆ కోవలోకే వస్తుంది. అడవులను కాపాడుకోవాలి అనే సందేశాన్ని తీసుకుని ఏనుగుల ప్రాధాన్యత, కార్పొరేట్ సంస్థలు వీటి మీద కన్నేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే థీమ్ ని ప్రభు సాల్మన్ ప్రెజెంట్ చేసిన తీరు అన్ని వర్గాలను మెప్పించేలా లేదు. కేవలం నిజాయితీగా చేసిన ప్రయత్నంగా చూసి మెచ్చుకోవాల్సిందే తప్ప బాగుంది అని చెప్పడానికి మనసు రానంతగా దర్శకుడు మంచి అవకాశాన్ని కోల్పోయాడు. కేవలం రానా అనే ఒకే ఒక్క కారణం చాలనుకుంటే తప్ప అరణ్యను ఛాయస్ గా పెట్టుకోవడం చాలా కష్టం.

ఒక్క మాటలో - వినపడని 'అరణ్య'ఘోష

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp