30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ

By Ravindra Siraj Jan. 29, 2021, 01:43 pm IST
30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ
Rating : 2/5
Main Cast: : Pradeep Machiraju, Amritha Aiyer,
Director: : Munna,
Music: : Anup Rubens,
Producer: : Babu S.V,

క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు హీరోలు కావడం మాములే కానీ టీవీ యాంకర్ తెరమీద కథానాయకుడిగా కనిపించడం మాత్రం అరుదు. సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేసినా అంతగా ముద్ర వేయలేకపోయారు. కానీ బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రదీప్ మాచికంటి డెబ్యూని ప్రకటించినప్పుడు అంతో ఇంతో కాస్త ఆసక్తి రేగిన మాట వాస్తవం. అందుకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మీద ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ నీలి నీలి ఆకాశం ఊహించని స్థాయిలో వందల మిలియన్ల వ్యూస్ సాధించడం బజ్ పెరగడానికి కారణం అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

ట్రైలర్ లో చూపించి ముందే చెప్పేసినట్టు ఇది పునర్జన్మల స్టోరీ. 1947 అరకు ప్రాంతంలో ప్రేమించుకున్న అటవీ తెగల్లో నివసించే ఓ జంట అనవసరమైన అపార్థాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు. దశాబ్దాల తర్వాత వర్తమానంలో మళ్లీ అర్జున్(ప్రదీప్), అక్షర(అమృత అయ్యర్)లుగా పుట్టి పరస్పరం ఒకళ్ళమీద ఒకళ్ళు కోపంతో కాలేజీ, ఇళ్లలో పక్కపక్కనే ఉంటారు. ఓ సందర్భంలో ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్తారు. అక్కడ దేవత విగ్రహం ముందు ఊహించని ఓ అనూహ్య సంఘటన వీళ్ళ జీవితాలను మార్చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడే చెప్పడం భావ్యం కాదు.

నటీనటులు

టీవీలో రాణించడం వేరు వెండితెరపై మెప్పించడం వేరు. చూసేందుకు రెండింట్లో ఉన్నది యాక్టింగే కదాని అనిపించినా నటీనటుల నుంచి సిల్వర్ స్క్రీన్ కోరుకునే టైమింగ్ వేరుగా ఉంటుంది. ఇదంత సులభం కాదు. ఇది తెలిసే ప్రదీప్ దీని కోసం కష్టపడే ప్రయత్నం గట్టిగా చేశాడు కానీ ఇది తన స్థాయికి మించిన బరువైన సబ్జెక్టు. మరీ తీసిపారేయదగ్గ నటన అయితే కాదు. కానీ చాలా చోట్ల యాంకరింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. టీవీ, వెండితెర మధ్య చాలా వ్యత్యాసం ఉందని గుర్తించాలి. ప్రదీప్ చేయాల్సిన హోం వర్క్ అయితే చాలా ఉంది.

అమృతా అయ్యర్ బాగుంది. కాకపోతే చూసేందుకు ఇబ్బంది పెట్టే ఆ పలువరస ఒక రకంగా ప్లస్ అయితే ఎక్కువ శాతం మైనస్ గానే అనిపిస్తుంది. నటనపరంగా సెకండ్ హాఫ్ లో తనకు ఎక్కువ స్కోప్ దొరికింది. వాడుకుంది కూడా. వైవా హర్ష జోకులు మొదట్లో పేలాయి. పోసాని, భద్రం, శుభలేఖ సుధాకర్, రంగస్థలం మహేష్, హేమ, శరణ్య ప్రదీప్ అందరివీ తక్కువ నిడివి ఉన్న పాత్రలే కావడంతో ఉన్నంతలో చేసుకుంటూ పోయారు. ఎవరినీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మెచ్చుకోవాల్సిన అవసరం కలగలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

మూగమనసులు, జానకిరాముడు, ప్రాణం, మగధీర లాంటి ఎన్నో పునర్జన్మల కథలు చూసేసిన ప్రేక్షకులు తన సినిమాను కొత్తగా ఫీలవ్వాలన్న ఉద్దేశంతో దర్శకుడు మున్నా ధూళిపూడి రాసుకున్న మెయిన్ ట్విస్ట్ నిజంగానే బాగుంది కానీ రెండుంపావు గంటల పాటు దాన్ని ఎంగేజింగ్ గా చెప్పగల మెటీరియల్ తనదగ్గర లేకపోయింది. అందువల్ల సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి తడబాటు బాగా పెరిగి కథనం ఎంతకీ ముందుకు వెళ్లక బోరింగ్ గా సాగుతుంది. కొన్ని కొన్ని ఎమోషన్స్ అక్కడక్కడ పండినప్పటికీ ఓవరాల్ గా ఆ ప్లస్సులన్నీ మైనస్సుల ముందు చిన్న బోయాయి. దానికి తోడు రైటింగ్ వీక్ గా ఉండటం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఓపెనింగ్ సీన్ ని ఏదో బాహుబలి రేంజ్ లో ట్రై చేసిన విధానం కొంత ఆసక్తి రేపింది. నిజమైన ప్రేమంటే ఏమిటో చూపిస్తానని ఓ బాబాతో చెప్పించడం, ఆ తర్వాత కట్ చేస్తే స్వతంత్రం ముందు ఓ అమ్మాయిని అబ్బాయిని చూపించడం బాగానే ఉంది కానీ అక్కడ వాళ్లది ఒక సాధారణ ప్రేమ కథలా కనిపిస్తుందే తప్ప ఎలాంటి ప్రత్యేకత ఉండదు. దానికి తోడు ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ఆ ఎపిసోడ్ నీలి నీలి ఆకాశం పాటతో సహా మొత్తం పావు గంటలోపే అయిపోవడం షోకు లేట్ గా వచ్చినవాళ్ళకు తర్వాత షాక్ ఇస్తుంది. పటాస్ సినిమాలో పేరెంట్స్ పిల్లల్ని కొట్టే ఎపిసోడ్ ని మక్కికి మక్కి కాపీ కొట్టేసి ఇందులో లేడీస్ హాస్టల్ కి మార్చడం మన క్రియేటివిటీ ఎంత కరువులో ఉందో ఎత్తి చూపిస్తుంది.

హీరో హీరోయిన్ల శరీరాలు అలాగే ఉండి వాళ్ళ ఆత్మలు మాత్రమే ఎక్స్ చేంజ్ కావడమనే పాయింట్ వినడానికి వెరైటీగా ఉంది. దాన్నుంచి బోలెడు హాస్యాన్ని బయటికి తీయొచ్చు. కానీ ఈ కామెడీ డ్రామా అంతా సెకండ్ హాఫ్ లో ఓపికకు పరీక్ష పెడుతుందే ఇంటరెస్టింగ్ గా అనిపించదు. ఒకదశలో పిచ్చిపిచ్చి సీన్లు అల్లేశారు. హర్ష అమృతల మధ్య రిసార్ట్ సీన్ దీనికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. దానికన్నా ప్రదీప్ అమృతలు అవతలి వాళ్ళ ఫ్యామిలీ కోసం తాపత్రయపడే సీన్సే అంతో ఇంతో బాగున్నాయి. ఇక మిగిలినదంతా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసే ప్రహసనమే. టేకింగ్ పరంగా మున్నాలో విషయం ఉన్నప్పటికీ అసలైన కథ విషయంలో నేల విడిచి చేసిన సాము ఫైనల్ గా యావరేజ్ ఫలితాన్ని కూడా ఇవ్వలేకపోయింది

సినిమాకు ఇంత బజ్ రావడంలో ప్రధాన కారణమైన నీలి నీలి ఆకాశంతో పాటు మరొక్క పాటతో అనూప్ రూబెన్స్ మెప్పించినప్పటికీ మిగిలినవి సోసోగానే ఉన్నాయి. నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. చక్కని స్కోర్ ఇచ్చారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం బడ్జెట్ పరిమితులను తట్టుకుని మరీ క్వాలిటీ అవుట్ ఫుట్ ని తెరమీద చూపించింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. రెండో సగంలో ల్యాగ్ మరీ ఎక్కువయ్యింది. మున్నా సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి. ఎస్వి బాబు నిర్మాణ విలువలు పర్లేదు. ఖర్చుని డిమాండ్ చేసే ప్రాజెక్ట్ కాదు కాబట్టి దీని గురించి ఇంతకన్నా చెప్పడానికి లేదు.

ప్లస్ గా ఉన్నవి

రెండు పాటలు
ఇంటర్వల్ ట్విస్ట్
కొన్ని ఎమోషన్స్

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
సాగతీత
లాజిక్ లేని ప్రేమ
పండని కామెడీ

కంక్లూజన్

ప్రదీప్ బుల్లితెరపై ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు. అదే అంచనాలకు ప్రామాణికత కావడమే ఓ మాములు సినిమా మీద ఈ మాత్రం అంచనాలు పెరగడానికి కారణమయ్యింది. కాని ప్రేక్షకులు మెచ్చాలంటే ఇదొక్కటే సరిపోదుగా. ఏదో టీం వాళ్ళు చెప్పారని పాటంత బాగుంటుందని సినిమాకు వెళ్తే మాత్రం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నిరాశ పరుస్తుంది. ఓ ట్విస్టు ఉంటే చాలు దాని చుట్టూ కథాకథనాలు ఎలా ఉన్నా నడిచిపోతుందనుకున్న దర్శకుడి ఆలోచన దీన్నో సగటు కంటే తక్కువ స్థాయి చిత్రంగా నిలబెట్టేసింది. దేనికీ ఉపయోగపడని ఖాళీ టైం ఉంటే తప్ప దీన్ని వాచ్ లిస్టు లో పెట్టుకోవడం కష్టం

ఒక్క మాటలో - సాగదీసిన సీరియల్ ప్రేమ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp