World cup t20 - క్యాచ్ డ్రాప్ - కప్ డ్రాప్

By Sannapareddy Krishna Reddy Nov. 15, 2021, 03:45 pm IST
World cup t20 - క్యాచ్ డ్రాప్ - కప్ డ్రాప్

క్యాచెస్ విన్ మ్యాచెస్ అని జూనియర్ క్రికెటర్లకు కోచ్ లు చెప్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు క్యాచ్ మిస్సయితే గెలుపు కూడా మిస్సవుతుంది. అది ఏదైనా టోర్నమెంట్ నాకౌట్ దశలో జరిగితే కప్పు కూడా మిస్సయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండవ సెమీ ఫైనల్లో తమ జట్టు అలాగే కప్ పోగొట్టుకొంది అని పాకిస్తాన్ జట్టు అభిమానులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీ ఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన పాకిస్తాన్ జట్టు, లక్ష్యఛేధనలో డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంతసేపు ఆందోళనగా ఉన్నా, అతను అవుటయ్యాక మ్యాచ్ మీద పట్టు బిగించి, విజయం వైపు దూసుకుపోతూ ఉండగా మార్కస్ స్టోయినిస్ తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నిర్మించి ఆస్ట్రేలియా జట్టులో విజయం మీద ఆశలు రేకెత్తించాడు మాథ్యూ వేడ్.

విజయానికి పది బంతుల్లో ఇరవై పరుగులు కావలసిన దశలో ఫాస్ట్ బౌలర్ షహీన్ ఆఫ్రిది బౌలింగులో వేడ్ ఇచ్చిన క్యాచ్ హసన్ ఆలీ జారవిడిచాడు. దాంతో ఆ బంతికి రెండు పరుగులు తీసిన వేడ్, ఆ తరువాత మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. దాంతో పాకిస్తాన్ అభిమానుల దృష్టిలో హసన్ అలీ ఒక్కసారిగా విలన్ అయ్యాడు. "ఆ దశలో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉంది. ఆలీ ఆ క్యాచ్ పట్టి, నేను అవుటయినా మేము గెలిచేవాళ్ళం" అని వేడ్ చెప్పినా అదంత తేలిక కాదని అందరికీ తెలుసు.

హసన్ ఆలీ ఆ క్యాచ్ పట్టి ఉంటే, అప్పుడు ఈక్వేషన్ తొమ్మిది బంతుల్లో ఇరవై పరుగులు అవుతుంది. వేడ్ తర్వాత అందరూ ఆల్ రౌండర్లూ, బౌలర్లు కావడంతో ఆ లక్ష్యం ఛేధించడం అంత తేలిక అయ్యేది కాదు. అయితే ఆ క్యాచ్ వల్ల కప్ చేజారిందా అంటే చెప్పడం కష్టం. ఆల్రెడీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి ఉంటే కప్పు కోసం పోరాడే అవకాశం దక్కి ఉండేది.
అయితే ఒక క్యాచ్ చేజారడం వల్ల ప్రపంచ కప్ చేజారిన సంఘటన 1999 లో జరిగిన యాభై ఓవర్ల ప్రపంచ కప్ లో జరిగింది. అప్పుడు కూడా లాభపడిన మ్యాచుఆస్ట్రేలియా అయితే ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికా.

దురదృష్టం వెంటాడిన దక్షిణాఫ్రికా

వర్ణవిచక్షణ అధికారిక విధానంగా ఉన్నందువలన క్రీడారంగంలో బహిష్కరణకు గురయిన దక్షిణాఫ్రికా, మారిన విధానాలతో ప్రపంచ క్రికెట్ లో పునరాగమనం తర్వాత 1992లో ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి ప్రపంచ కప్ లోనే అభిమానులని ఆకట్టుకొని సెమీ ఫైనల్ చేరుకుని, ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ లో విజయం అంచుల్లో ఉండగా వర్షం కారణంగా అంతరాయం కలగడంతో, తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యాక ఒక అర్థం లేని నిబంధన కారణంగా ఓడిపోయింది.

1996లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ లో, లీగ్ దశలో ఆడిన అయిదు మ్యాచ్లూ గెలిచి హాట్ ఫేవరైట్ గా నిలిచింది. ఆ జట్టు ఆటతీరు చూసి "కప్పు దక్షిణాఫ్రికాదే. ప్యాక్ చేసేయండి" అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటన కూడా ఇచ్చాడు. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు ప్రత్యర్థి వెస్టిండీస్ శ్రీలంకతో ఆడవలసిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా బహిష్కరించి, మిగిలిన నాలుగు మ్యాచుల్లొ రెండు ఓడిపోయి ఆ గ్రూపులో ఆఖరి స్థానంలో నిలిచి, క్వార్టర్ ఫైనల్ చేరింది.

ఆ కప్పులో మొదటిసారి ఆడిన కెన్యాలాంటి పసికూన చేతిలో ఓడిపోయాక, "కెన్యాతో ఓడిపోవడం మాకు బాధ కలిగించలేదు. దక్షిణాఫ్రికాతో ఓడిపోతేనే ఇబ్బంది" అని ఆ దేశం అప్పటివరకూ ఆచరించిన వర్ణవిచక్షణను గుర్తు చేస్తూ ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు వెస్టిండీస్ స్టార్ ఆటగాడు బ్రియాన్ లారా. క్వార్టర్ ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో లారా విజృంభించి ఆడి సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. లీగ్ దశలో తిరుగులేకుండా విజయాలు సాధించి, నాకౌట్ దశలో ఓడిపొతుంది అని దక్షిణాఫ్రికా జట్టు మీద చోకర్స్ అన్న ముద్ర అప్పుడే పడింది.

1999 ప్రపంచ కప్

ఇంగ్లాండు, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ సంయుక్తంగా నిర్వహించిన 1999 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా ఫేవరైట్ గా బరిలోకి దిగింది. లీగ్ దశను దాటి సూపర్ సిక్స్ స్టేజిలో అడుగుపెట్టీన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ సాధించిన సెంచరీతో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో నలభై ఎనిమిది పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఆ దశలో బరిలోకీ దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో ఉండగా పదకొండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దక్షిణాఫ్రికా బౌలర్ లాన్స్ క్లూసెనర్ విసిరిన బంతి స్టీవ్ వా బ్యాటుకు తగిలి, గాలిలోకి ఎగిరి పక్కన ఫీల్డింగ్ చేస్తున్న హెర్షెల్ గిబ్స్ వైపు వెళ్ళింది.

అందరూ మంచి ఫీల్డర్లు ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో అగ్రశ్రేణి ఫీల్డర్ గిబ్స్. క్యాచ్ పట్టినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బంతి గాలిలోకి ఎగరవేయడం గిబ్స్ అలవాటు. అందులోనూ ఇప్పుడు తమకూ, విజయానికి అడ్డుగా నిలిచిన స్టీవ్ వా ఇచ్చిన క్యాచ్ కావడంతో మరింత ఆనందంగా బంతిని సరిగ్గా పట్టుకోకుండానే ఆనందంతో గాలిలోకి ఎగురవేయడంతో అది చేతిలో నుంచి జారి కింద పడింది. క్రికెట్ నిబంధనల ప్రకారం ఫీల్డర్ బంతిని పట్టుకున్న తర్వాత దానిమీద అతనికి నియంత్రణ ఉంటేనే బ్యాటర్ అవుటైనట్టు లెక్క. ఆ విధంగా అది డ్రాప్డ్ క్యాచ్ అయింది.

పుండు మీద కారం చల్లినట్టు స్టీవ్ వా గిబ్స్ దగ్గరకు వెళ్ళి, "నువ్వు జారవిడిచింది క్యాచ్ మాత్రమే కాదు. కప్ కూడా" అన్నాడు. ఆ మ్యాచ్ లో అజేయంగా 120 పరుగులు సాధించి స్టీవ్ వా తన జట్టుని గెలిపించాడు. సూపర్ సిక్స్ స్టేజ్ నుంచి సెమీ ఫైనల్స్ చేరిన ఈ రెండు జట్లు మళ్ళీ తలపడ్డాయి. ఈసారి ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 213 పరుగులకు ఆలౌట్ అయితే, తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కూడా 213 పరుగులకు ఆలౌట్ అయ్యి మ్యాచ్ టై అయింది. దాంతో సూపర్ సిక్స్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజేత అయిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో ప్రవేశించింది. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును 132 పరుగులకే ఆలౌట్ చేసి, తేలిగ్గా కప్ గెలిచింది.

Also Read  : AUS Vs NZ T20 World Cup Final - బిగ్‌ సండే.. రేపు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp