చేజేతులా.... ఓటమి కొనితెచ్చుకున్న భారత్‌ సిరీస్‌ సఫారీల వశం

By Prasad Jan. 14, 2022, 09:15 pm IST
చేజేతులా.... ఓటమి కొనితెచ్చుకున్న భారత్‌  సిరీస్‌ సఫారీల వశం

అనుకున్నట్టే అయ్యింది. సఫారీల గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుపు భారత జట్టుకు అందని ద్రాక్షేనని మరోసారి రుజువైంది. అయితే ఈసారి గడప వరకు వచ్చిన విజయాన్ని భారత జట్టు కాళ్లతో బయటకు తన్నినట్టయ్యింది. తొలి రెండు టెస్టులు 1-1 తేడాతో గెలుపు.. కీలక మూడవ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యతం సాధించడం వంటివి చూసి ఈసారి సఫారీ గెడ్డ మీద చారిత్రక గెలుపు ఖాయమని భారత అభిమానులు భావించారు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే ఆల్‌ఔట్‌ కావడంతోపాటు.. బౌలింగ్‌లో సైతం విఫలం కావడంతో భారత్‌ జట్టు చేజేతులుగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని జారవిడుచుకుంది.

ఫ్రీడమ్‌ కప్‌ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. కీలకమైన మూడవ టెస్టును ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ న్యూలాండ్స్‌లో జరిగిన మూడవ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 210 పరుగులకే ఆల్‌ఔట్‌ అయిన దక్షిణాఫ్రికా జట్టు, రెండవ ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు రాణించడంతో సులువుగా గెలుపు సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కీగన్‌ పీటర్సన్‌ 82 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి వాండర్‌ డసెన్‌ 41 (నాటౌట్‌) తోడు కావడంతో దక్షిణాఫ్రికా అలవోకగా గెలిచింది. మరో బ్యాట్స్‌మెన్‌ బవుమా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. వికెట్లు పడగొట్టేందుకు భారత్‌ బౌలర్లు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. బుమ్రా, షమీ, ఠాకూర్‌లు ఒక్కొక్కొటి చొప్పున వికెట్లు తీశారు. భారత్‌ ఓటమి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. భారత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే ఓటమి సిరీస్‌ను చేజార్చుకోవాల్సి వచ్చిందంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp