ఆ తుమ్మ ముల్లు విరిచి చొక్కాకి పెట్టుకొనిరా...!

By Guest Writer Dec. 02, 2019, 07:58 am IST
ఆ తుమ్మ ముల్లు విరిచి చొక్కాకి పెట్టుకొనిరా...!

చొక్కా గుండీ యేదిరా?
తెగిపోయింది సార్!
పిన్నీసు పెట్టుకో!
లేదుసార్!
బయటకెళ్ళి ఆ తుమ్మ ముల్లు విరిచి చొక్కాకి పెట్టుకొనిరా,లేకపోతే ఇంటికెళ్ళిపో!పట్టుకుంటే గుప్పిట్లోకి రాదు ఛాతీ,పెద్ద రౌడీలాగ పోజిస్తన్నావా,ఫో ముందు బైటికి!

స్కూల్లో టీచరుకీ,విద్యార్ధికి మధ్య జరిగిన సంభాషణ ఒకప్పుడు!పైగుండీ ఊడదీసి బోర విరుచుకు తిరగటం ఒకప్పుడు ఫాషన్!అదే రౌడీ లక్షణమని కోప్పడేవారు.ఇప్పుడెవరైనా టీచర్ విద్యార్ధిని గట్టిగా కేకలేస్తే,తల్లీ దండ్రి తగాదాకి వచ్చేస్తారు మా అబ్బాయిని అవమానించాడు టీచరు,క్షమాపణ చెప్పాలని!ఇంక పట్టించుకొనేదెవరు, వదిలిపారేస్తున్నారు.తలిదండ్రుల భయంలేదు,పెద్దల భయంలేదు.ఒకరో ఇద్దరో సంతానం ,అంతులేని గారాబం!అయినవాళ్ళు సరిదిద్దాలనుకొన్నా"నా పిల్లల్ని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకొంటున్నారని"నిష్టూరాలు!

లక్షలాదిమంది అనుచరులున్న నాయకుల భాషే విపరీతంగా వుంటున్నప్పుడు యెవర్నని యేమని నిందిస్తాం.వారిలో వారు ఒకర్ని ఒకరు బహిరంగసభల్లో"గౌరవించుకొనే"పద్ధతి చూస్తే ఏమనిపిస్తుంది?మర్యాదస్తులుకూడా మా నాయకుడిని కాదుగదా తిట్టేది,మా 'ఎగస్పార్టీ నాయకుడి'ని కదా తిట్టేదని మిన్నకుంటున్నారు.మళ్ళీ వాళ్ళే సమాజం బాగోగుల గురించి పెట్టే గంభీరమైన పోస్టులు చదువుతుంటే వారిమీద జాలేస్తుంది.

ఎంత చదువుకొన్న వారైనా మగపిల్లలనేసరికి ఇంటిలోనే వారికో ప్రత్యేకత కలిపిస్తున్నారు.ఆడపిల్ల వేరు,మగపిల్లడు వేరు!తమ పిల్లడు బైక్ నడిపేటప్పుడు చాటుగా గమనించమనండి తండ్రిని,వాడెంత నిర్లక్ష్యంగా నడుపుతాడో!పొద్దున్నించీ సాయంత్రం వరకూ వాడికి తెలియకుండా గమనించమనండి వాడి స్నేహాలేమిటో,ప్రవర్తనేమిటో!బస్ స్టాపుల దగ్గర ఆడపిల్లలని అల్లరిపెట్టే అబ్బాయిలని మందలించి చూడండి,మీకెంత గౌరవం దక్కుతుందో!

కాలేజీ అయిపోయాక ఐస్ పార్లర్లదగ్గరా,టిఫిన్ బండీల దగ్గరా ఎన్ని జంటలు కనబడతయ్యో ఇంటికి వెళ్ళకుండా!ఏ పార్కులో చూసినా ఎన్నిజంటలో!చాలమంది తలిదండ్రులకు తెలియని విషయాలివి.తెలిసి మందలిస్తే మర్నాడే పేపర్లో వార్త"తల్లి మందలించిందని ఉరేసుకొన్న విద్యార్ధి/విద్యార్ధిని!"ఒక సినిమావాడొక'తలకట్టు' 'ప్రారంభిస్తాడు,అది అతనికి నప్పుతుంది.మిగిలిన వారంతా అదే అనుకరణ!మంచి విషయాలు నేర్చుకోవటంలో లేనివి.

చివరగా - ఒంటరిగా దొరికిన ఆడకూతురి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.నూటికి తొంభైమంది చదువు,సంధ్యలు లేని వారే ఇంత దారుణానికి ఒడిగడుతున్నది.చేతలేకాదు,అసహ్యమైన మాటల్నికూడా విమర్శించిననాడు మనుషులమనిపించుకొంటాం! 

Written By--Kopparapu Lakshmi Narasimha Rao

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp