వివాదాస్పదంగా మారిన భారత స్పోర్ట్స్‌ అథారిటీ ఎస్‌ఓపీ మార్గదర్శకాలు

By Srinivas Racharla May. 22, 2020, 01:46 pm IST
వివాదాస్పదంగా మారిన భారత స్పోర్ట్స్‌ అథారిటీ ఎస్‌ఓపీ మార్గదర్శకాలు

భారత్‌లో కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన క్రీడా కార్యాకలాపాలు లాక్ డౌన్ 4.0 నిబంధనలు సడలించడంతో తిరిగి ప్రారంభమయ్యేందుకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) చర్యలు ప్రారంభించింది.తాజాగా అన్ని విభాగాల ముఖ్యులతో సాయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు పున:ప్రారంభించడానికి మార్గదర్శకాలను సాయ్ జారీ చేసింది. సాయ్ సెక్రటరీ రోహిత్ భరద్వాజ్ నేతృత్వంలోని ఆరుగురు క‌మిటీ స‌భ్యులు రూపొందించిన స్టాండ‌ర్ ఆపరేటింగ్ ప్రొసీజ‌ర్ (ఎస్ఓపీ)ని ప్రకటించింది. అయితే ఎస్ఓపీ నిబంధనల ప్రకారం ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను క్రీడాకారులు సమర్పించాలని సాయ్‌ కోరడం వివాదాస్పదమైంది.

దేశంలో కరోనా వైరస్ రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడే క్రమంలో, శిక్షణ తీసుకునే విషయంలో "మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు"అనే డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరింది. ఆటగాళ్లకు మద్దతిచ్చి ప్రోత్సహించాల్సిన సాయ్‌ తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ వారి నుంచి డిక్లరేషన్‌ అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా సాయ్ రూపొందించిన ఎస్ఓపీలో దాదాపుగా కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలే ఉన్నాయి. క్రీడా కార్య‌క‌లాపాలు ప్రారంభించబోయే క్రీడాకారులందరూ త‌ప్ప‌నిస‌రిగా ఎస్ఓపీ నిబంధనలను పాటించాలంటూ సాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఫేస్ మాస్కు ధ‌రించడం,భౌతిక దూరం పాటించ‌డం, చేతుల‌ను శుభ్ర‌ప‌ర్చుకోవ‌డం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌డం లాంటి నిబంధనలను పొందుపరిచారు.ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అన్ని సాయ్ శిక్షణ కేంద్రాలలో అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ మార్గదర్శకాల ముఖ్యోద్దేశం ఖేలో ఇండియాను పున:ప్రారంభించడమేనని ప్రకటించింది.

ఇక క్రీడల విషయానికొస్తే

అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ సహా 11 రకాల క్రీడల ఔట్ డోర్ ట్రైనింగ్‌కు సాయ్ అనుమతించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లిఫ్టర్లు, ఆర్చర్లు,రెజ్లర్లు, ప్యాడర్లు,సైక్లిస్ట్‌లు కూడా శిక్షణ తీసుకోవచ్చు.కానీ ఒకరిని ఒకరు తాకే అవకాశమున్న బాక్సింగ్ రింగ్స్, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ వంటి క్రీడలపై మాత్రము నిషేధం కొనసాగుతోంది. దీనితోపాటు రిలే ట్రైనింగ్‌లో బ్యాటన్ ఎక్స్ చేంజ్‌కు అనుమతి ఇవ్వలేదు. బాక్సర్లు రింగ్స్‌లోకి రాకూడదు. అలాగే ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్‌లో సింగిల్స్ ప్లేయర్లు మాత్రమే ప్రాక్టీ చేయాలని రెండు నెలల విరామం తర్వాత ప్రాక్టీస్‌కు సిద్దమవుతున్న అథ్లెట్లకు సాయ్ ఆంక్షలు విధించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp