పడకొడతారా?.. రసకందాయంలో మూడవ టెస్టు

By Prasad Jan. 14, 2022, 06:26 am IST
పడకొడతారా?.. రసకందాయంలో మూడవ టెస్టు

సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత్‌ బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యంతో సందిగ్ధంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ విఫలమైనా బౌలర్లు రాణించడంతో స్వల్ప ఆధిక్యత సాధించిన భారత్‌ జట్టు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యం వల్ల గెలవాల్సిన టెస్ట్‌ను కాస్తా గాలిలో ఉంచారు. న్యూలాండ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టు ఫలితం రసకందాయంలో పడింది. ఇంకా రెండు రోజులు సమయం ఉండడం, లక్ష్యం తక్కువగానే ఉండడంతో ఈ టెస్టు ఫలితం శుక్రవారం తేలిపోనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే చెరో ఒకటి గెలవడంతో మూడవ టెస్టు ఫలితం ఆసక్తికరంగా మారింది. ఈ టెస్టు గెలిచిన జట్టు సిరీస్‌ను కూడా గెలుచుకుంటుంది. భారత్‌ గెలిస్తే దశాబ్ధాల కల నెరవేరినట్టే. అదే ఓడితే సఫారీ గడ్డమీద సిరీస్‌ గెలుపు కోసం మరో కొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంటుంది.

భారత్‌ ఇన్నింగ్స్‌లో పంత్‌ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచినా అతనికి సరైన భాగస్వామ్యం లేక భారత్‌ మరోసారి 198 పరుగుల స్వల్ప స్కోరుకే ఆల్‌ఔట్‌ అయింది. దక్షిణాఫ్రికా ముందు కేవలం 212 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 101 పరుగులకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. 23 పరుగులకే తొలి వికెట్‌ పడడంతో భారత్‌ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాయి. అయితే రెండవ టెస్టును గెలిపించిన కెప్టెన్‌ ఎల్గర్‌, పీటర్‌సన్‌లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఎల్గర్‌ 30 పరుగులు చేసి ఔట్‌కాగా, పీటర్‌సన్‌ 48 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ రెండవ వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మూడవ రోజు ఆటముగుస్తున్న సమయంలో ఎల్గర్‌ వికెట్‌ను బూమ్రా తీయడంతో భారత్‌ జట్టుకు మూడవ టెస్టుపై ఆశలు రేకెత్తించాయి. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలినట్టుగా రెండవ ఇన్నింగ్స్‌లో కూడా జరిగితే భారత్‌ చరిత్ర సృష్టించినట్టవుతుంది. దీనితో భారమంతా బౌలర్లపైనే ఉంది. 

అంతకుముందు రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ జట్టు మరోసారి పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. జట్టు కేవలం 198 పరుగులు చేస్తే దానిలో పంత్‌ 100 పరుగులు చేయడం విశేషం. మిగిలిన 9 మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. పంత్‌ ఒకవైపు వికెట్ ను కాపాడుకుంటూనే స్కోర్‌ను పరుగులెత్తించాడు. అయితే అతనికి ఒక్క బ్యాట్స్‌మెన్‌ నుంచి కూడా సహకారం లభించలేదు. పంత్‌ తరువాత కెప్టెన్‌ కోహ్లీ ఒక్కడే కేవలం 29 పరుగులు చేశాడు. క్రీజ్‌లో కోహ్లీ ఉన్నంత సేపు భారత్‌ మంచి స్కోర్‌ సాధిస్తుందని, దక్షిణాఫ్రికా ముందు సాధ్యం కాని లక్ష్యం ఉంచుతుందని భావించారు. పంత్‌, కోహ్లీ లు కలిసి ఐదవ వికెట్‌కు 94 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ అవుట్‌ కావడంతో భారత్‌ వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు కె.ఎల్‌.రాహూల్‌ 10, అగర్వాల్‌లు 7 పరుగులకే నిష్క్రమించారు. 24 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. వీరితోపాటు పుజారా 9, రహానే 1, అశ్విన్‌ 7, ఠాకూర్‌ 5, బుమ్రా 2 పరుగులకు ఔట్‌కాగా, యాదవ్‌, షమీలు సున్నా పరుగులకే వెనుతిరగడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో జాన్సన్‌ 4, నగిడి, రబ్బాడాలు చెరో మూడు వికెట్లు సాధించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp