మొన్న బావకు నేడు బావమరిదికి అవమానం!

By Mavuri S Feb. 23, 2021, 07:30 am IST
మొన్న బావకు నేడు బావమరిదికి అవమానం!

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చల్లబడితే నాలుగు దశాబ్దాల్లో ఆయన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అలాంటి ఘోర పరాభవం ఎదురయింది. హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. ఎక్కడ టిడిపి కనీస ప్రభావం చూపించలేకపోయింది.

30 చోట్ల అధికారపార్టీ హవా!

హిందూపురం నియోజకవర్గంలో నాలుగో దశలో 38 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దీనిలో వైఎస్ఆర్సిపి 30 చోట్ల తన మద్దతుదారులను గెలిపించుకుంది. కేవలం 7 చానల్ లోనే టిడిపి నిలబెట్టిన వారు విజయం సాధించారు. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.కె పార్థసారథి కి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓడిపోయింది. ఏకంగా ఇక్కడ అధికారపార్టీ ఎనిమిది వందల ఓట్ల పైగా మెజారిటీ సాధించింది. అలాగే బి.కె పార్థసారథి సొంత వార్డ్ మరువపల్లి లోను టీడీపీ కీ పరాభవం తప్పలేదు. అలాగే హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప సొంత పంచాయతీ వెంకటరమణ పనిలోను టిడిపి ఓడిపోవడం విశేషం. ఇక్కడ వైస్సార్సీపీ మద్దతు దారులు అన్ని వార్డులోని విజయం సాధించారు.

మసకబారుతున్న బాలయ్య ఇమేజ్!

హిందూపురంలో అధికార పార్టీ నానాటికీ వేగం పుంజుకుంటోంది. సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చి పోయే ఓ అతిథిలా మారారని విమర్శ జనంలో ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం బాలకృష్ణ దగ్గరగా ఉండేవారు, ఆయన అనుచర గణం హవా ఎక్కువగా ఉండటం, అన్నీ విషయాలను వారే డీల్ చేసే విధానంతో ఇప్పటికే హిందూపురం టిడిపి లో రకరకాల వర్గాలు కనిపిస్తున్నాయి. ప్రజలు సైతం పార్టీ కీ దూరం అవుతున్నారు.

ప్రత్యేక వ్యూహం దెబ్బ కొట్టింది

హిందూపురం అసెంబ్లీ పరిధిలోకి హిందూపురం మున్సిపాలిటీ తోపాటు లేపాక్షి, చైలమత్తుర్ మండలాలు వస్తాయి. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఎప్పుడైనా తన నియోజకవర్గం వచ్చిన కేవలం హిందూపురం కు పరిమితం అవుతారు తప్ప, మిగిలిన మండలాలను పట్టించుకున్నది లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇక్కడ ప్రత్యేక వ్యూహం తో ముస్లిం అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందని కోణంలో మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ కు అవకాశం ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో దాదాపు 38 శాతం ముస్లిమ్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక ముస్లిము ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి.

దీంతో ఎక్కడి నుంచి ముస్లిం ప్రాతినిధ్యం ఉంటేనే బాగుంటుంది అనే కోణంలో వైఎస్ఆర్సిపి తరపున ఇక్బాల్ కు అవకాశం ఇవ్వగా, పార్టీ కోసం మొదటినుంచి కష్టపడి న నవీన్ నిశ్చల్ కు టికెట్ కేటాయించకపోవడం వైసీపీ క్యాడర్ లోనూ నిరుత్సాహాన్ని నింపింది. అందరికీ సుపరిచితుడైన నవీన్ నిశ్చల్ అప్పటికే ఎన్నికల తాలూకా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో సమీకరణాలు మారడంతో ఆయనను కాదని టికెట్ వేరొకరికి ఇవ్వడం కూడా సార్ పార్టీ ఓటమికి ఓ కారణం అయింది. నవీన్ కే స్థానం కేటాయించి ఉంటే, ఫలితం మరోలా ఉండేది అన్న వాదన ఉంది. చివరి నిమిషంలో ఇక్బాల్ కు హిందూపురం అసెంబ్లీ టికెట్ రావడంతో ప్రచారం చేసుకోవడానికి సమయం సరిపోక పోయింది. దీంతో బాలకృష్ణ గెలుపు అప్పట్లో సులభం అయ్యింది.

మొత్తం అధికారపార్టీ హవా

ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందరికీ అందడం తోపాటు వైస్సార్సీపీ లోని నాయకులంతా ఉమ్మడిగా పనిచేయడం, ఎవరికీ వారు తమ బాధ్యతలు పంచుకుని ముందుకు సాగడం తో ఇక్కడ అధికార పార్టీ బలం పుంజుకుంది. మహమ్మద్ ఇక్బాల్ కు జగన్ ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడంతో , ప్రస్తుతం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా మళ్లీ నవీన్ నిశ్చల్ అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల్లో విజయం ద్వారా స్పష్టంగా మరోసారి కనిపించింది. రాబోయే హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అప్పుడే అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp