ఫలించిన జగన్ మంత్రాంగం, చేతులు కలిపిన ఎంపీ బోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి

వైఎస్సార్సీపీ నేతలు హద్దులు మీరితే సహించేది లేదని సీఎం చేసిన హెచ్చరికలు ఫలించాయి. పార్టీలోని నేతలంతా సమైక్యంగా సాగాలని చేసిన సూచనలు ఆచరణలోకి వచ్చాయి. కాకినాడలో నాలుగు రోజుల క్రితం జరిగిన డీఆర్సీ సమావేశంలో వాగ్వాదానికి దిగిన నేతలు చేతులు కలిపారు. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నేరుగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు బీసీ సంఘాల నేతలు కూడా ఉన్నారు. అక్కడే కాకినాడ ఎంపీ వంగా గీతతో సహా నేతలంతా చర్చలు జరిపారు.
కాకినాడ నగరంలో మేడలైన్ ప్రాంతంలో వంతెన నిర్మాణం కారణంగా ముంపు సమస్య వస్తోందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. దానికి అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి సమాధానమివ్వడంతో డీఆర్సీ సమావేశం రసాభసాగా మారింది. ఆ ఘటనను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరు కీలక నేతల మధ్య వివాదం దుమారం దిశగా సాగిన ఘటనపై వారిని తాడేపల్లి పిలిచి హితబోధ చేశారు. సంయమనంతో సాగాలని సూచించారు. అదే సమయంలో పిల్లి బోస్ అభ్యంతరాలపై సాంకేతిక సలహాతో ముందుకెళదామని స్పష్టం చేశారు.
తాడేపల్లి లో జరిగిన భేటీ తర్వాత శాంతించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తన అభ్యంతరాలను సీఎం సానుకూలంగా తీసుకున్నారని మీడియాకి తెలిపారు. తమ వివాదం టీ కప్పులో తుఫాన్ వంటిదని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే తాజాగా ద్వారంపూడి ఇంటికి వెళ్లి టీ తాగి వచ్చారు. తన అనుచరుల ఆందోళనను ద్వారంపూడి దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో స్థానిక ఎంపీ వంగా గీత అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
అయితే బోస్, ద్వారంపూడి మధ్య మాటల యుద్ధాన్ని భూతద్దంలో చూపించి ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన టీడీపీ, జనసేన శ్రేణులకు ఈ వ్యవహారం మింగుడపడే అవకాశం లేదు. శెట్టిబలిజ సమాజవర్గీయుల్లో అనుమానాలు పెంచేందుకు చేసిన వారి ప్రయత్నాలు బెడిసికొట్టినట్టయ్యింది. సీనియర్ నేతల మధ్య సామరస్య పూర్వకంగా సమావేశం సాగడంతో సమస్య సమసిపోయిందని వైఎస్సార్సీపీ శ్రేణలంతా భావిస్తున్నారు. ఆపార్టీ నేతలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల సత్ఫలితం వచ్చిందని వారంతా అభిప్రాయపడుతున్నారు.


Click Here and join us to get our latest updates through WhatsApp