చేయూతకు రేపు శ్రీకారం.. పథకంపై క్లారిటీ ఇచ్చిన సర్కార్‌..

By Kotireddy Palukuri Aug. 11, 2020, 10:30 pm IST
చేయూతకు రేపు శ్రీకారం.. పథకంపై క్లారిటీ ఇచ్చిన సర్కార్‌..

కరోనా ఆపత్కాలంలోనూ ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ మరో బృహత్తర పథకానికి రేపు బుధవారం శ్రీకారం చుట్టబోతోంది. ఎన్నికల హామీల అమలులో భాగంగా వైఎస్సార్‌ చేయూత పథకాన్ని రేపు సీఎం జగన్‌ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలను అమలు చేసిన వైసీపీ సర్కార్‌.. తాజాగా కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. ముందుగా చెప్పిన మేరకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేయబోతోంది.

ఈ పథకం ద్వారా ఎస్టీ,ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల్లోని 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పన నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. దళిత, బడుగు బలహీన వర్గాల్లో 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఫించన్‌ ఇవ్వాలని ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ ఆలోచించారు. అయితే 45 ఏళ్లకే ఫించన్‌.. అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో.. పేద కుటుంబాల్లోని మహిళలకు ఎలాగైనా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌.. ఈ పథకాన్ని వైఎస్సార్‌ చేయూతగా మార్చారు. నెల వారీ పింఛన్‌ రూపంలో కాకుండా.. ఏడాదికి ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు.

ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్లు సహకారంతో అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 18 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒంటరి మహిళ, వితంతు, వికలాంగ తదితర కోటాల్లో ఇప్పటికే ఫించన్‌ తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ పథకానికి అర్హులుగా జగన్‌ ప్రభుత్వం గుర్తించడంతో అదనంగా మరో ఏడు లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. మొత్తం మీద ఈ పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మందికి మేలు జరగనుంది.

రేపు బుధవారం (ఆగస్టు –12) ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్న ఏపీ ప్రభుత్వం ఈ రోజు మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 45–60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుండడంతో.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన వారు అర్హులవుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నాలుగేళ్ల పాటు ఈ పథకం కొనసాగనుండగా.. మధ్యలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ఈ పథకం వర్తించదు. ఆ తర్వాత వారు నెలవారీ ఫించన్‌ పొందేందుకు అర్హులవుతారు. లబ్ధిదారుల ఖాతాల్లో 18,750 చొప్పన జమ చేయడాన్ని రేపు సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp