YSR, Rosaiah - రోశయ్య – వైఎస్‌.. తండ్రీ కొడుకుల అనుబంధం

By Karthik P Dec. 04, 2021, 03:40 pm IST
YSR, Rosaiah - రోశయ్య – వైఎస్‌.. తండ్రీ కొడుకుల అనుబంధం

రాజకీయాల్లో అధికారం, పదవులే లక్ష్యంగా నేతలు వ్యవహరించడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా స్నేహం, అనుబంధం.. ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్న ఇద్దరు నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యలు. రాజకీయాల్లో తండ్రీ కుమారుల అనుబంధం ఉన్న నేతలు ఇద్దరూ ఇప్పుడు భౌతికంగా లేరు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్‌ మరణించగా.. ఈ రోజు 88 ఏళ్ల వయస్సులో రోశయ్య చనిపోయారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, అప్యాయత ఎంత గొప్పదో వారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన్ను అసెంబ్లీలో రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు పన్నేది. ఆయా సందర్భాలలో అపార అనుభవం, వాగ్ధాటి, చతరుత, సమయస్ఫూర్తి ఉన్న రోశయ్య టీడీపీ కౌంటర్లను ఎన్‌కౌంటర్‌ చేసేవారు. ఒక సమయంలో అసెంబ్లీలో.. ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వకపోవడం ఇదే మొదటి సారి అంటూ టీడీపీ గోల గోల చేసింది. ఆ సమయంలో కల్పించుకున్న రోశయ్య.. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ ఏం బాబు, ఇదే మొదటి సారినా..? ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి, కనీనం ఆయన మాట్లాడేందుకు చివరి రోజు అసెంబ్లీలో మైక్‌ ఇవ్వని విషయం మరిచిపోయావా..? అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్య విలువలు..?’’ అంటూ బాబు తీరును ఏకిపారేశారు. దీంతో నిశ్ఛేష్టుడైన చంద్రబాబు కూర్చుండిపోయారు.

వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ప్రజల జీవితాలనే మార్చివేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సంక్షేమ పథకాల వల్ల బడ్జెట్‌పై ఎంత ఒత్తిడి ఉన్నా.. ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్య ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఓ సభలో రోశయ్య మాట్లాడుతూ.. రాజా (వైఎస్‌) ప్రజలతో మాట్లాడుతుంటే నాకు భయమేస్తుంది. ఎక్కడ ప్రజలకు ఏ హామీ ఇచ్చి వస్తాడో, దానికి బడ్జెట్‌ను ఎలా సర్దుకోవాలో అనే టెన్షన్‌ ఉండేది. అయితే రాజా చేసే పని ప్రజల కోసమే కావడంతో.. మేము కూడా అదే స్ఫూర్తితో పని చేసేవాళ్లం’’ అని చెప్పారు. ఈ మాటలు.. వైఎస్‌ ఆలోచనలు, ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు రోశయ్య ఏ విధంగా పని చేసేవారో తెలియజేస్తోంది.

Also Read : Ex.CM Rosaiah Died- మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత..

వైఎస్‌కు కుడిభుజంలా ఉంటూ అసెంబ్లీలో తమను ఇరుకునపెడుతున్న రోశయ్యను ఇబ్బంది పెట్టాలని టీడీపీ ఎదురుచూస్తూ ఉండేది. రోశయ్య అల్లుడు ఓ సారి వైజాగ్‌లో ఓ పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో అశ్లీల వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ పార్టీ రోశయ్య అల్లుడే ఏర్పాటు చేశారంటూ.. అసెంబ్లీలో టీడీపీ దాడి చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు రోశయ్య లేస్తుండగా.. ‘‘మీకెందుకు పెద్దాయన, మీరు కూర్చోండి’’ అంటూ వైఎస్‌ లేచి మాట్లాడారు. పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు..? ఎప్పుడు జరిగింది..? అనే విషయాలు విచారణలో తేలుతాయన్నారు. రోశయ్యను ఇబ్బంది పెట్టాలనే టీడీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని వైఎస్‌ ఫైర్‌ అయ్యారు. దీంతో చంద్రబాబు కూడా వెనక్కి తగ్గారు. రోశయ్యను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదంటూ.. ఇక్కడ ఏదో జరిగిందంటూ సర్దిచెప్పుకునే ధోరణిలో ఆ అంశానికి ముగింపు పలికారు.

రోశయ్యను వైఎస్‌ తండ్రిగా భావించారనేందుకు మరో ఉదాహరణ.. ఆయన గుండె ఆపరేషన్‌ సందర్భం. మంత్రిగా ఉన్న రోశయ్యకు గుండె సంబంధిత సమస్య వచ్చింది. ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి. ఆపరేషన్‌కు ఢిల్లీ, చెన్నై.. ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలు జరుగుతున్న సమయంలో... వైఎస్‌ వచ్చారు. ఇతర ప్రాంతాలకు వద్దని, ఇక్కడే మన నిమ్స్‌లో చేయిద్దామని వైఎస్‌ నిర్ణయించారు. ఆపరేషన్‌ చేయించిన రోజు, ఆస్పత్రి నుంచి డిఛ్చార్జి అయ్యేంత వరకూ వైఎస్‌ ఉదయం, సాయంత్రం వెళ్లి రోశయ్య యోగక్షేమాలు తెలుసుకునేవారు. రోశయ్య పూర్తిగా కోలుకున్నారు. ఒక సమయంలో ఈ విషయంపై రోశయ్య మాట్లాడుతూ.. రాజా తనను ఓ తండ్రిలా భావించి తన ఆరోగ్యాన్ని చూసుకున్నారని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు.

ఇంత ఆప్యాయత, అనుబంధం ఉన్న వైఎస్‌ మరణ వార్త కూడా ప్రపంచానికి రోశయ్యే చెప్పాల్సి వచ్చింది. అది చెబుతూ ఎప్పుడూ గంభీరంగా ఉండే రోశయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము గానీ, రాజశేఖరరెడ్డి మరణవార్తను చెప్పాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఇది భరించలేకపోతున్నామని రోశయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రోజు ఆయన కూడా వైఎస్‌ వద్దకు వెళ్లిపోయారు.

Also Read : Konijeti Rosaiah, Political Journey - రోశయ్య రాజకీయ పయనం అనన్యం, ఆదర్శం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp