అదే జగన్‌ మ్యాజిక్‌

By Jaswanth.T Sep. 16, 2020, 02:30 pm IST
అదే జగన్‌ మ్యాజిక్‌

కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడు కావాలనుకుని ఏపీ ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి పగ్గాలు అప్పగించారు. ఆ తరువాత అధికారానికి ఆమడ దూరంలో కూర్చోబెట్టి కుర్రాడైన జగన్‌ను పీఠమెక్కించారు. అధికార మార్పిడి జరిగి దాదాపు 15 నెలలు కావస్తోంది. ప్రజల నుంచి వస్తున్న కంప్లైట్లు పెద్దగా లేవనే చెప్పాలి. ప్రజలు ముఖ్యం కాబట్టి వారివైపు నుంచి పరిశీలిస్తే జగన్‌ ప్రభుత్వంపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఫిర్యాదులు అయితే లేవనే మీడియా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

సాధారణంగా భారీ అంచనాలతో పదవిలోకొచ్చిన వారిపై సంబంధిత అంచనాలను అందుకున్నప్పటికీ కొంత స్థాయిలో అసంతృప్తి రావడం సహజం. కానీ ఏపీలో అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఇందుకు నిదర్శనంగా ప్రతిపక్ష పార్టీల పరిస్థితినే ఉదహరిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బద్నాం చేద్దామనుకుని మొదలు పెడుతున్న ప్రతి ఆందోళనా చివరకు జగన్‌కు అనుకూలంగా మారిపోతుండడాన్ని గురించే గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇచ్చే పిలుపులకు జనం నుంచి కూడా పెద్దగా మద్దతు లభించకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

జగన్‌ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే అతి పెద్ద సమస్య ఇసుక సమస్యే. దీన్ని పరిష్కరించేందుకు కొంచెం ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సులభంగానే ఇసుక లభిస్తోంది. దీని ద్వారా పొందుదామనుకున్న ప్రతిపక్షాలకు అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. అలాగే ఇంగ్లీషు మీడియం, కులం, మతం.. తదితర అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ జగన్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కదిలించలేకపోవడం ఇప్పుడు ఆయా పార్టీలను పునరాలోచనలో పడేస్తున్నట్లు చెబుతున్నారు.

జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆ పార్టీకి శ్రీరామరక్షగా ఉన్నాయంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వమైన పథకం అమలుకు అర్హత ప్రకటించి, ఆ తరువాత నిర్ణీత సమయం ఇచ్చి దరకాస్తు చేసుకోమనేవారు. ఆ సమయం లోపు దరకాస్తు చేసుకుంటే పథకం వచ్చినట్లు లేకపోతే లేనట్లే. అయితే అందుకు భిన్నంగా జగన్‌ ప్రభుత్వంలో అర్హత ఉన్నవాళ్ళకు పదేపదే దరకాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా అర్హులైన చిట్టచివరి లబ్దిదారుడికి కూడా సంక్షేమ పథకం అందాలన్న లక్ష్యం ఇక్కడ కన్పిస్తోంది.

పథకం పొందిన వాళ్ళు ఒక గ్రామంలో 99మంది ఉన్నప్పటికీ, ఒక్కరికి రాకపోతే సదరు లబ్దిదారుడి ద్వారా జరిగే వ్యతిరేక ప్రచారం అంతా ఇంతా కాదు. దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇటువంటి సంఘటలను చూస్తుంటాం. అయితే వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఆ ఒక్కరికి కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తద్వారా ప్రతిపక్షాలకు కూడా అవకాశం దక్కనీయడం లేదు. ఇప్పటి వరకు అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాల్లోనూ ఇదే విధమైన విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తుండడంతో పథకాలపై అద్భుతమైన రెస్పాన్స్‌ ప్రజల నుంచి వస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా జగన్‌కు కలిసివస్తోందని చెబుతున్నారు. పథకాల అమలులో జగన్‌ చేస్తున్న ఈ మ్యాజిక్కే ప్రజల్లో పాజిటివ్‌ టాక్‌కు కారణమవుతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp