కరోనా సంక్షోభంలో ఆర్ధిక ఆరోపణలలో చిక్కుకున్న యడ్యూరప్ప ప్రభుత్వం

By Jagadish J Rao Jun. 22, 2020, 09:04 am IST
కరోనా సంక్షోభంలో ఆర్ధిక ఆరోపణలలో చిక్కుకున్న యడ్యూరప్ప ప్రభుత్వం

కరోనా సంక్షోభం నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం వెలగబెట్టిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వలస కార్మికులకు సహాయం పేరుతో బిజెపి సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ప్రజా పద్దుల సంఘం(పిఎసి) విచారణలో వెల్లడైంది.
ఎటువంటి వివరాలు లేకుండా 1.25 లక్షల మందికి రూ. 5 వేలు చొప్పున ఎలా పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని పిఎసి నిలదీసింది. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది. '‘లబ్దిదారుల  జిల్లాల పేర్లు కూడా తెలియకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్మికుల పేర్లు, చిరునామాలు లేకుండా ప్రభుత్వ సాయాన్ని ఎలా అందించారు? మొత్తానికి ఏదో అవకతవకలు జరిగినట్టు కమిటీ అనుమానిస్తోంద'’ని పిఎసి చైర్మన్‌ హెచ్‌కే పాటిల్‌ అన్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లకుండా ఆపేందుకు మే నెలలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప రూ.1600 కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. గుర్తింపు పొందిన కార్మికులకు అంతకుముందు ఇచ్చిన 2 వేల రూపాయలకు అదనంగా మరో 3 వేల రూపాయలు ఇస్తామని హామీయిచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కర్ణాటకలో 15.8 లక్షల మంది గుర్తింపు పొందిన కార్మికులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో 43 వేల మంది కార్మికులు నమోదు చేసుకుంటే, బీదర్‌ జిల్లాలో 66 వేల మంది కార్మికులు రిజిస్టర్‌ చేసుకోవడం గమనార్హం.

''నిర్మాణ రంగానికి  కేంద్ర బిందువైన బెంగళూరులో..  బీదర్, ఇతర ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో కార్మికులు ఎలా ఉన్నార’'ని పిఎసి చైర్మన్‌ హెచ్‌కే పాటిల్‌ ప్రశ్నించారు. 

పిఎసి విచారణ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి సాధ్యమైనంత ఉత్తమమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేశామని ఆయన అన్నారు. ఇప్పటికీ అనుమానాలు ఉంటే, తాము ఎల్లప్పుడు దర్యాప్తుకు సిద్ధమని  ప్రకటించారు.

కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇప్పటివరకు 8,281 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 5,210 మంది కోలుకుకున్నారు. ప్రస్తుతం 2,947 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్‌ బారిన పడి ఇప్పటివరకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఈనెల 30తో ముగుస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp