పోల‌వ‌రంపై ఏపీ ఎంపీల ప‌ట్టు

By Kalyan.S Jul. 21, 2021, 09:00 am IST
పోల‌వ‌రంపై ఏపీ ఎంపీల ప‌ట్టు

ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ స‌స్య‌శ్యామ‌లం అవుతుంది. అది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల జీవ‌నాడి. అది పూర్త‌యితే.. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగర తాగు నీటి అవసరాలు, విశాఖ చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీర‌తాయి. ఏపీకి వ‌రంగా భావిస్తున్న ఆ ప్రాజెక్టే పోల‌వ‌రం. ఎంతో ప్రాధాన్య‌త గ‌ల ఈ ప్రాజెక్టుపై కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. చేస్తుందిలే.. నిధులు కేటాయిస్తుందిలే.. అని ఇన్నాళ్లూ వేచి చూసిన ఏపీ ఎంపీలు ఇక స్వ‌రం పెంచారు. వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన అఖిల ప‌క్ష భేటీలోనే కేంద్రం తీరును తూర్పార‌బ‌ట్టారు. ఇప్పుడు పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ త‌మ పోరాటం కొన‌సాగిస్తున్నారు.

ఏపీ లోని చాలా ప్రాంతాల్లో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలు. వాటిపైనే ఆధార‌ప‌డి వ్య‌వ‌సాయం చేసే ప‌రిస్థితులు లేవు. ఆయా ప్రాంతాల్లో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వలన మాత్రమే అనిశ్చిత పరిస్థితులు తొల‌గుతాయి. దీన్ని గుర్తించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మొద‌టి నుంచీ ప్రాజెక్టుపై ప్ర‌ధాన దృష్టి సారించారు. ఓ విధంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాకే ప‌నుల్లో వేగం పుంజుకుంది. కేంద్రం నిర్ణీత స‌మ‌యానికి నిధులు ఇవ్వ‌క‌పోయినా, సొంత నిధులు వెచ్చిస్తూ ప‌నులు ఆగ‌కుండా చూస్తోంది.

జ‌గ‌న్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల‌కే తొలిసారిగా 2019 జూన్‌లో పోలవరం పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకింత ఆల‌స్యంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. కార‌ణాలేంటి అన్న వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకున్నారు. వరదను మళ్లించేలా స్పిల్‌వేను పూర్తి చేయడం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌డం, నిర్వాసితులకు పునరావాసం, కాపర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్ఎఫ్‌ను చేపట్టి.. వరద కాలంలో కూడా పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే, గత ప్రభుత్వం ఎక్కువ ధరలకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనుల్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ చేప‌ట్ట‌డం ద్వారా 838 కోట్లు ప్ర‌భుత్వానికి ఆదా అయ్యాయి. కాగా, ఇటీవ‌ల కూడా ప్రాజెక్టు ను ఏరియ‌ల్ స‌ర్వే చేసిన జ‌గ‌న్ గ‌డువు లోగా పూర్తి చేసేందుకు అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడకుండా గోదావరి నది మళ్లింపు ప్రక్రియ ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు.

విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోల‌వ‌రాన్ని 2015లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించ‌డం సంతోష‌ద‌గ్గ విష‌యం. కానీ, ఆ స్థాయిలో ప్రాజెక్టు వేగ‌వంతంగా క‌దిలేందుకు నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం స‌వ‌రించి 29 నెల‌లు కావ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నిధులు విడుద‌ల కాలేదు. సవరించిన అంచనా మేరకు పునరావాసం, పరిహారం నిమిత్తం రూ.33వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2వేల కోట్లకు పైగా కూడా విడుదల చేయలేదు. దీనిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌లుమార్లు కేంద్రానికి లేఖ‌లు రాశారు. నేరుగా కూడా వెళ్లి విజ్ఞ‌ప్తి చేశారు. ఇత‌ర మంత్రులు, ఎంపీలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ప్ర‌భుత్వం పోరాటానికి సిద్ధ‌మైంది. నిర్ణీత గ‌డువులోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృత నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం అందుకు కేంద్రం నుంచి అందాల్సిన స‌హ‌కారంపై ఆందోళ‌న‌కు సిద్ద‌మైంది. పార్ల‌మెంట్ స‌మావేశంలో ఏపీ ఎంపీలు త‌మ గ‌ళం వినిపిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp