రఘురామరాజు పై వేటుకు సమయం ఆసన్నమైందా..?

By Ritwika Ram Jul. 09, 2021, 04:28 pm IST
రఘురామరాజు పై వేటుకు సమయం ఆసన్నమైందా..?

తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో వైఎస్సార్ సీపీ స్పీడ్ పెంచింది. ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. త్వరగా నిర్ణయం తీసుకోకుంటే పార్లమెంటునే స్తంభింపజేస్తామని హెచ్చరిస్తోంది. రఘురామపై అనర్హత పిటిషన్‌ వేసి ఏడాది గడిచినా.. చర్యలు తీసుకోకపోవడంతో స్పీకర్ పై సీరియస్ గా స్పందిస్తోంది. గత స్పీకర్లకు భిన్నంగా ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాను గురువారం కలిసి ఫిర్యాదు చేసింది.

ఏడాది నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు..

స్పీకర్ తీరు విషయంలో విజయసాయి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత స్పీకర్ల తీరుకు భిన్నంగా ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని, ఆయనలో పక్షపాత ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు అంశంపై 15 రోజులు నోటీసు ఇచ్చి ప్రివిలేజ్‌కు పంపిస్తామని స్పీకర్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీకి పంపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

గతంలో జేడీయూ ఎంపీ శరద్‌ యాదవ్‌ విషయంలో రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. శరద్ యాదవ్ పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్నారని, ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ వెంటనే అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు. మరి రఘురామ విషయంలో ఆలస్యం చేయడమేంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదని.. కానీ రఘురామకృష్ణరాజు విషయంలో ఏడాది నుంచి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రఘురామ విషయంలో చర్యలు తీసుకోపోతే త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని స్పష్టం చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగింది..

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలను ఉద్దేశించి రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు, దుర్భాషలను స్పీకర్ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు వైఖరితో తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిందని చెప్పారు. ఈ విషయంలో రఘురామకృష్ణరాజు ప్రివిలేజ్ ఎక్కడ దెబ్బతిన్నదని ఆయన ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయొద్దన్నారు. అవసరం లేకపోయినా సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతామని స్పీకర్ చెబుతున్నారని, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని స్పస్టం చేశారు.

Also Read : కారు ఎక్కేందుకు సైకిల్‌ దిగిన రమణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp