కృష్ణ జలాల వివాదంలో గేర్ మార్చిన వైసీపీ

By Ritwika Ram Jul. 09, 2021, 05:45 pm IST
కృష్ణ జలాల వివాదంలో గేర్ మార్చిన వైసీపీ

కృష్ణా జలాల విషయంలో ఏపీ గేర్ మార్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి నిన్నటిదాకా లేఖలు రాస్తూ వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలను కలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల శక్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ప్రధానంగా మూడు అంశాలను ఆయన ముందుంచారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మాణానికి ఏపీ స‌ర్కారుకి పూర్తిస్థాయి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మ ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని చెప్పిన ఆయన.. వెంట‌నే వాటిని నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని నోటిఫై చేయాలని కోరారు.

లేఖలతో స్పందన లేకపోవడంతో..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైనప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర జలశక్తి మంత్రికి, కేఆర్ఎంబీకి లెటర్లు రాశారు. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కేంద్రం నుంచి అడుగు ముందుకు పడలేదు. ఆలస్యమయ్యే కొద్దీ.. రోజుకో టీఎంసీ చెప్పున కృష్ణా నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ఆపడం లేదు. మరోవైపు కృష్ణా జలాలపై చర్చించడానికి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది. దీంతో ఏపీ సర్కారు నేరుగా రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆలస్యమయ్యే కొద్దీ రైతులకు నష్టమని భావించిన వైసీపీ.. శుక్రవారం జల శక్తి మంత్రిని కలిసింది. షెకావత్ కు వాస్తవ పరిస్థితిని విజయసాయిరెడ్డి వివరించారు.

కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయండి

కేఆర్‌ఎంబీ పరిధిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ చాలా రోజులుగా కోరుతోంది. తాజాగా కేంద్ర మంత్రి షెకావత్ తో మీటింగ్ సందర్భంగా ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని, ఆ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలన్నారు. విశాఖకు తాగునీటి స‌ర‌ఫ‌రా కోసం చేబట్టిన ఏలేశ్వరం ప్రాజెక్టులో సగం ఖర్చు జల్ జీవన్ మిషన్ నుంచి కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ తెలిపారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు.

Also Read : వివాదాలొద్దు.. రైతే ముద్దు.. జల వివాదంపై కుండబద్ధలు కొట్టిన జగన్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp