యనమల ఈ ప్రశ్నలకు కూడా జవాబు చెబితే బాగుండేది!

By Voleti Divakar Oct. 18, 2020, 07:40 pm IST
యనమల ఈ ప్రశ్నలకు కూడా జవాబు చెబితే బాగుండేది!

తెలుగుదేశం పార్టీ మేధావి, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తనకు తెలియకుండానే పెద్ద చర్చకు తెరతీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళతారని, ఆయన తరువాత సిఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న చర్చ వైఎస్సార్ సిపిలో జోరుగా సాగుతోందని యనమల జోస్యం చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ న్యాయవ్యవస్థపై బెదిరింపులకు దిగారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఓటుకు నోటు కేసు కూడా త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో ఒకవేళ తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళితే పార్టీకి ఎవరు సారధ్యం వహిస్తారన్న చర్చకు కూడా ఆయన పరోక్షంగా తెరతీశారు.

ఆయన ఉద్దేశంలో దేశంలోని న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు రాజకీయ నేతలకు భయపడి తీర్పులు ఇస్తారా అన్న అనుమానం కూడా కలగక మానదు. అయితే యనమల లాంటి నాయకుల ఆరోపణలు, అనుమానాలకు మాజీ ఎంపి, రాజకీయ మేధావి ఉండవల్లి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. న్యాయమూర్తులు ఎవరికో భయపడి పక్షపాత తీర్పులు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. అయితే వాయిదాల పేరుతో కేసులను పొడిగించే ఆస్కారం ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. క్విడ్ ప్రోకో కేసులను నిరూపించడం కష్టసాధ్యమని కూడా స్పష్టం చేశారు.

ఈనేపథ్యంలో యనమల ప్రకటన రాజకీయ కోణంలో చేసిందే తప్ప వాస్తవం లేదన్నది స్పష్టమవుతోంది. ఇక లేవనెత్తిన జగన్ తరువాత ఎవరు అన్న అంశంపై చర్చిస్తే చంద్రబాబు తరువాత ఎవరన్న ప్రశ్న తలెత్తుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు జైలుకు వెళితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై, విఫలనేతగా పార్టీ వర్గాల్లోనే గుర్తింపు పొందిన చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబుకు పార్టీ పట్టం కడుతుందా? లేక చంద్రబాబుకు వీరవిధేయుడు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో సహకరించిన సీనియర్ నేత యనమలకు అవకాశం కల్పిస్తారా..లేక పార్టీకి చరిష్మా కోసం ఎన్టీఆర్ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ జరుగుతోంది. దీని పై కూడా యనమల స్పష్టమైన సమాధానం చెబితే బాగుండేది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp