యనమల చెబుతున్నారు.. నమ్మండి.. 17 లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయి..!!

By Karthik P Jun. 09, 2021, 04:45 pm IST
యనమల చెబుతున్నారు.. నమ్మండి.. 17 లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయి..!!

రొడ్డకొట్టుడు రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయం టీడీపీ సీనియర్‌ నేతలు ఇంకా అవగతం అవలేదు. 90వ దశకం రాజకీయాలనే ఇంకా చేస్తున్నారు. మీడియాలో మార్పులు, కొత్తగా సోషల్‌ మీడియా వచ్చిందనే విషయం టీడీపీ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గుర్తించడం లేదు. అందుకే ఎప్పటిలాగే తమకు నచ్చిన అంశాలను, విమర్శలను పేర్కొంటూ పత్రికా ప్రకటనలను ఇంట్లో కూర్చుని విడుదల చేస్తున్నారు.

మీడియా అంతా ఒక వైపు ఉన్నప్పుడు తాము చెప్పిందే నిజం అనేలా టీడీపీ ఆటలు సాగాయి. నాటి పరిస్థితులు ఇంకా ఉన్నాయనుకుంటున్నారు యనమల రామకృష్ణుడు. రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడుల అంశంపై యనమల రామకృష్ణుడు తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన చూస్తే.. హవ్వా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది. గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సమాచారాన్ని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి వివరించారు.

అయితే మంత్రి గౌతమ్‌ రెడ్డి చెప్పినన్నీ అబద్ధాలేనంటూ యనమల విమర్శించారు. యనమల విమర్శ చేయడం వరకూ బాగనే ఉంది. నిజానిజాలు ఏమిటన్నది ప్రజలు తెలుసుకుంటారు. కానీ యనమల రామకృష్ణుడు విమర్శతో ఆగలేదు. తమ ప్రభుత్వ సాధించిన ఘనతను ఏకరువుపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో మూడు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి.. 15.45 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. గత రెండేళ్లలో 17 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని చెప్పారు యనమల రామకృష్ణుడు.

చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లలో వచ్చిన 15.45 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల తాలూకూ పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటయ్యాయో ఎవరికీ తెలియదు. కనీసం ఈ వివరాలు చెబుతున్న యనమలకైనా తెలిస్తే.. వాటిని ప్రజల ముందు పెడితే టీడీపీకి అంతకు మించిన మైలేజీ లేదు. వైసీపీ రెండేళ్ల హాయంలో 17 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రం విడిచి పోయాయంటూ ఆరోపిస్తున్నారు. అంటే తమ హాయంలో వచ్చాయని చెబుతున్న 15.45 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితోపాటు మరో 1.55 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పోయాయనేది యనమల వాదన కాబోలు. ఈ 1.55 లక్షల కోట్ల పెట్టుబడులు వైసీపీ రెండేళ్ల హాయంలో వచ్చాయా..? లేక అంతకు ముందు ఉన్న పరిశ్రమలు తరలిపోయాయా..? అనేది యనమల క్లారిటీ ఇవ్వాలి.

టీడీపీ హాయంలో వచ్చిన పెట్టుబడులు గత రెండేళ్లలో పోయాయి కాబట్టి.. వాటిని యనమల చూపించలేరు. అయితే వాటితోపాటు పోయిన 1.55 లక్షల కోట్ల విలువైన పరిశ్రమల్లో కనీసం ఒకట్రెండు పరిశ్రమల పేర్లు అయినా యనమల రామకృష్ణుడు చెప్పగలరా..? ప్రభుత్వం వచ్చిన కొత్తలో.. తమ కేసుల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు కియా మోటార్స్‌ తరలిపోతోందని టీడీపీ అనుకూల మీడియా హంగామా చేసింది. అలాంటిది 17 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రం విడిచిపోతే.. ఊరుకుంటుందా..? కానీ టీడీపీ అనుకూల ఛానెళ్లు, పత్రికల్లో పెట్టుబడులు పోయాయనే వార్తలు రాలేదు. ఇలాంటి హాస్యాస్పదమైన విమర్శలు, సొంత డబ్బాలు కొట్టుకోవడం వల్ల నవ్వులపాలవడం తప్పా.. టీడీపీకి వచ్చే మేలు శూన్యమనే విషయం యనమల వంటి సీనియర్‌ నేత ఎప్పటికి గుర్తిస్తారో..?

Also Read : ఆచితూచి అడుగులు వేస్తున్న జూపూడి ప్రభాకర్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp