దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.. బాబు తీరు మారుతుందా..?

By Karthik P Jan. 21, 2021, 06:28 pm IST
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.. బాబు తీరు మారుతుందా..?

బట్ట కాల్చి మొహం మీద పడేయడమనే నానుడి మాదిరిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే దాని పూర్వా పరాలు తెలుసుకోకుండా.. వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోంది. సదరు ఘటనలు జరిగిన సమయంలో ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ.. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మాత్రం మౌనం పాటిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎలాంటిదో తెలిసిపోతుంది.

వైవీ సుబ్బా రెడ్డి లక్ష్యంగా..

వైసీపీ పాలనపై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం లేకపోవడంతో.. కుల, మత రాజకీయాలపై టీడీపీ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా సీఎం వైఎస్‌ జగన్, వైసీపీ ముఖ్య నాయకులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మతపరమైన విమర్శలు చేస్తున్నారు. ఈ రాజకీయంలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా లాగుతున్నారు. బైబిల్‌ చేతితో పట్టుకుని తిరిగే మహిళ భర్తకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చారంటూ వైవీ సుబ్బారెడ్డి మతం గురించి ప్రస్తావిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఏ మతస్తుడో అందరికీ తెలిసినా.. చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయడమే కాదు జాతీయ మీడియాను కూడా తప్పుదోవ పట్టించారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి మతాన్ని ప్రస్తావించిన ఓ ప్రముఖ జాతీయ మీడియా.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వివరణ ఇచ్చింది. టీడీపీ నేతలు తమను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ.. వైవీ సుబ్బారెడ్డికి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఇది జరిగిన తర్వాత కూడా చంద్రబాబు.. వైవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

పూరంశెట్టి అంకులయ్య హత్యలో...

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పూరంశెట్టి అంకులయ్య హత్యను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు.. అధికారపార్టీపై నెట్టే ప్రయత్నాలు చేశారు. వైసీపీ నేతలే అంకులయ్యను హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ హత్యా రాజకీయాలు చేస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. సీఎం వైఎస్‌ జగన్‌ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అసలు నిందితులను పట్టుకుని, హత్య పూర్వాపరాలు వెల్లడించారు. భూ వివాదాలే కారణమని, అంకులయ్యకు ఒకప్పటి ముఖ్య అనుచరుడే అతనిని హత్య చేయించాడని తేల్చారు. ఈ విషయం వెల్లడైన తర్వాత చంద్రబాబు, లోకేష్‌లు మౌనం పాటిస్తున్నారు.

గుడివాడ ఎస్‌ఐ ఆత్మహత్యపైనా రాజకీయాలు..

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ ఎస్‌ఐ పిల్లి విజయ్‌ కుమార్‌ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణానికి స్థానికంగా ఉంటే బ్యూటీషియన్‌ సురేఖ కారణమని ఎస్‌ఐ సోదరుడు విక్రమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో సురేఖ కూడా ఉంది. విచారించిన పోలీసులు సురేఖను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఎస్‌ఐ ఆత్మహత్యను కూడా తన రాజకీయానికి వాడుకోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనను మంత్రి కొడాలి నానిపై తోసేసేందుకు చంద్రబాబు యత్నించారు. మంత్రి పేకాట దందాను పట్టుకున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటూ నిరాధార ఆరోపణలు చేశారు. పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఘటనల తాలుకూ వాస్తవాలు వెల్లడైన తర్వాత వాటిపై పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడనని చెప్పుకునే చంద్రబాబు.. మేము బురద జల్లుతాం.. మీరు కడుక్కోండి.. అనే తీరుతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయినా బాబు తీరు మారుతుందా..? అంటే ఆయన వ్యవహాశైలిని ఎరిగిన వారి నుంచి కాదనే సమాధానం వస్తోంది.

Read Also : ఆక్రమించాలని బీజేపీ.. నిలువరించాలని టీడీపీ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp