ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ జాతీయ పార్టీలో చేరబోతున్నారా..?

By Ritwika Ram Jul. 27, 2021, 04:00 pm IST
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ జాతీయ పార్టీలో చేరబోతున్నారా..?

తెలంగాణలో మరో సంచలనం జరగబోతోందా? మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రవీణ్ కుమార్ త్వరలోనే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఎస్పీ చీఫ్ మాయావతితో ఆయన గతంలోనే చర్చలు జరిపారని, తాజాగా మాయావతి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, తెలంగాణలో బీఎస్పీ బాధ్యతలను ప్రవీణ్ కుమార్ తీసుకోబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

సొంత పార్టీ ఆలోచన నుంచి వెనక్కి..

తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాతి నుంచి రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తాను స్థాపించిన స్వేరో ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహుజనుల కోసం ప్రత్యేక పార్టీ రావాల్సి ఉందని పలు ఇంటర్వ్యూల్లో, పలు సందర్భాల్లో ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ సిద్ధాంతంతో ముందుకు సాగుతానని చెప్పిన ఆయన.. సొంతంగా కొత్త పార్టీ పెట్టాలని భావించారు. కానీ సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న తర్వాత కొత్త పార్టీ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ వైఫు ఆయన మొగ్గు చూపినట్లు సమాచారం.

Also Read : మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఏ దారిలో నడవబోతున్నారు..?

బీఎస్పీ బలోపేతం..

బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి దేశంలోని చాలా ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో కూడా ఈ పార్టీకి మద్దతుదారులు ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూరు నియోజకవర్గం నుంచి కోనేరు కోనప్ప.. బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. వాళ్లకు స్థానికంగా పట్టు ఉన్నా.. బీఎస్పీ మద్దతుదారుల సాయంతో గెలిచారు. తర్వాత ఇద్దరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరడంతో.. తెలంగాణలో పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. దళితుల్లో ప్రవీణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండటం, అదనంగా స్వేరో సంస్థ కూడా సాయం చేయనుండటంతో ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్ లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఎస్పీ నుంచి పోటీ చేస్తారా?

హుజూరాబాద్ లో 20 వేలకు పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి. త్వరలో జరగనున్న బైపోల్ లో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా దళితుల ఓట్లు చాలా కీలకం. వాళ్ల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమం ప్రారంభించారనే విమర్శలు ఉన్నాయి. పథకాన్ని ప్రారంభించేందుకు హుజూరాబాద్ నే ఎన్నుకోవడం ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీనిపై విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్.. 10 లక్షలు ఇస్తే దళితులు బాగుపడుతారా? అని ప్రశ్నించారు. ఆ డబ్బులతో దళిత స్టూడెంట్లను చదివించాలని కోరారు. హుజూరాబాద్ ఎన్నికల టైంలోనే ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకోవడం, ఇప్పుడు బీఎస్పీలో చేరుతున్నారని వార్తలు రావడంతో.. హుజూరాబాద్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఏంజరుగుతుందో వేచి చూడాలి.

Also Read : రాజకీయాలు వేరు - బ్యూరోక్రాట్ల రాజకీయాలు వేరు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp