రఘురామరాజు నిజంగా రాజీనామా చేస్తారా. ? జనసేన నుండి పోటీ చేస్తారా .?

By Sanjeev Reddy Jan. 13, 2022, 07:01 pm IST
రఘురామరాజు నిజంగా రాజీనామా చేస్తారా. ? జనసేన నుండి పోటీ చేస్తారా .?

వైసీపీ అసంతృప్త నాయకుడు,నరసాపురం ఎంపీ రఘురామరాజు రాజీనామా వ్యవహారం ఈటీవీ సీరియల్‌ని మించి జీళ్ళపాకంలా కొనసాగుతూ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే అసంతృప్తి గళం విప్పిన రఘురామరాజు వైసీపీ పై కుల,మత, ప్రాంత ప్రాతిపదికన పలు విమర్శలు చేసారు.ఈ విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చిన వైసీపీ నేతలు పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలని సూచించారు. దీనికి ప్రతిగా మరిన్ని విమర్శలు చేయడంతో పాటు పార్టీకి వ్యతిరేకంగా పలు స్టేట్మెంట్స్ ఇస్తుండటంతో అతనిపై అనర్హత వేటు వేయమని వైసీపీ పార్లమెంటరీ విభాగం స్పీకర్‌ని కోరడం జరిగింది.

అనర్హత వేటుపై నేటి వరకూ స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ వివాదం రాను రాను ముదిరి ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, కొన్ని మీడియా సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశాడన్న అభియోగంపై కొన్ని ప్రాథమిక సాక్ష్యల ఆధారంగా సీఐడీ పోలీసులు రఘురామని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కోర్టు నుండి బెయిల్ తెచ్చుకొని తనని పోలీసులు భౌతికంగా హింసించారని సంచలన ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో టీడీపీ, జనసేనలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన రఘురాం టీడీపీ తరపున అమరావతి వాదం భుజానికెత్తుకొని పలు ఛానెళ్లలో డిబేట్ల పేరిట అమరావతి అంశంలో ప్రభుత్వం పై విమర్శలు,సీఎం పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రతి సందర్భంలోనూ రాజీనామా అంశం తెరపైకి వచ్చినా త్వరలో చేస్తానని, సందర్భాన్ని బట్టి చేస్తానని చెప్పుకొంటూ దాటవేశారు కానీ స్పష్టత ఇవ్వలేదు.అయితే ఇటీవల ఓ చర్చ సందర్భంగా తనపై అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తానని ఈ నెల తొమ్మిదో తారీఖు రాజీనామాపై ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. తొమ్మిదో తారీఖు మీడియా సమావేశం నిర్వహించి సంక్రాంతికి తన నియోజకవర్గం వెళ్తానని త్వరలో రాజీనామా చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని వ్యాఖ్యానించారు కానీ మళ్లీ స్పష్టత లేకుండానే సింగడు అద్దంకి సామెతగా ముగించారు.

ఈ నేపధ్యంలో అసలు రాజీనామా చేస్తాడా, చేయడా నరసాపురం వచ్చిన తర్వాత ప్రకటిస్తాడా,ప్రకటించడా అని రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు,మీడియా సంస్థలు ఊహాగానాలు చేస్తుండగా అధికార వైసీపీ పార్టీ మాత్రం పరిణామాలు గమనిస్తూ గడిచిన స్థానిక ఎన్నికల విజయాలతో ధీమాగా ఉంది.ఈలోపు హఠాత్తుగా నరసాపురంలో జనసేనాని పీకే ,రఘురామా ఫోటోలతో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.అంతటితో ఆగకుండా సదరు ఫ్లెక్సీల్లో మదర్ థెరిస్సా,చేగువేరా,అల్లూరి చిత్రాలతో పాటు చిరంజీవి, దివంగత కాంగ్రెస్ నేత వంగవీటి రంగాల చిత్రాలు ఉండటంతో రఘురామ రాజీనామా చేసి జనసేన నుండి పోటీ చేయనున్నాడని అందుకే జనసేన తరుచూ వాడే మదర్ తెరిస్సా,చేగువేరా ఫొటోలతో పాటు కాపు ఓట్ల కోసమే చిరంజీవి, వంగవీటి రంగా ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : రఘురామకృష్ణంరాజు ఇంటికి మరోసారి ఏపీ సీఐడీ అధికారులు, అసలేం జరుగుతోంది..

కమ్యూనిస్టులతో పొత్తు సమయంలో చేగువేరా ఫోటోలు విరివిగా వాడిన పవన్ కళ్యాణ్, జన సైనికులు బీజేపీతో జతకట్టినాక చే చిత్రాలు పక్కన పెట్టేయటంతో పాటు, గత ఎన్నికల ప్రచారంలో భీమవరంలో కోటి రూపాయలతో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న పవన్ తర్వాత ఆ ఊసు ఎత్తకపోవడంతో పాటు అల్లూరి సీతారామరాజు చిత్రాల్ని తమ ప్రచారంలో వాడటం కూడా దాదాపు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం గతించిన నాయకుల,సంఘ సేవకుల వాడుకోవడం అనైతికం అనే అభిప్రాయం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది.

రఘురామ నిజంగా రాజీనామా చేసి పోటీ చేస్తాడా ?

జరుగుతున్న పరిణామాలు చూసి రఘురామ త్వరలో నిజంగా రాజీనామా చేసి మరలా పోటీ చేస్తాడని కొందరు ఊహిస్తుండగా, క్షేత్ర స్థాయి వాస్తవాలు చూస్తే అది జరగదు అనిపించక మానదు. వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచిన రఘురామ నాటి నుండీ కేంద్రంలో బీజేపీ ప్రాపకం కోసం పాటుపడుతున్న విషయం తెలిసిందే. కానీ బిజెపి అభ్యర్థిగా రాష్ట్రం నుండి పోటీ చేస్తే రాష్ట్రంలో బీజేపీ బలం రీత్యా ప్రయోజనం ఉండదన్న విషయం రఘురామకి తెలియనిది కాదు. పైగా ఏ సహకారం కోసం అయితే బీజేపీతో అంటకాగాడో ఆ సహకారం లభించక తన కంపెనీ ఇండ్ భారత్ బ్యాంక్స్ ని 1387 కోట్ల మేర మోసం చేసిన కేసులో వ్యతిరేక తీర్పులతో ఎన్పీఏ గా ప్రకటించబడి దివాళా ప్రక్రియ ముందుకు రావడంతో వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా ఉపయోగపడని బీజేపీ తరుపున నిలబడే విషయం అనుమానాస్పదమే.

వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన నాటి నుండి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైనం బహిరంగ రహస్యమే. అయినా ప్రత్యక్షంగా టీడీపీలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పొచ్చు. సామాజిక వర్గ లెక్కల ప్రకారం నరసాపురంలో జనసేనతో కలిస్తే ఉన్న ఓటు బ్యాంకు ప్రయోజనం టీడీపీతో ఉండకపోవచ్చు. ఆర్ధికంగా దివాళా పరిస్థితుల్లో ఉన్న రఘురామ టీడీపీ తరపున పోటీ చేస్తే ఆ ఖర్చు మొత్తం అధిష్టానం భరాయించాల్సి ఉంటుంది . తాము అధికారంలో ఉన్నప్పుడు తప్ప విపక్షంలో ఉండగా ఏ ఉప, స్థానిక ఎన్నికలకూ ఖర్చు పెట్టటానికి కానీ, బలమైన పోటీ ఇవ్వడానికి కానీ ముందుకు రాని టీడీపీ రాజు పోటీ తాలుకూ ఆర్ధిక భారాన్ని తలకెత్తుకోకపోవచ్చు. అదీకాక గడిచిన స్థానిక ఎన్నికల ప్రచారంలో పలు చోట్ల ప్రసంగించిన బాబు ఈ ఎన్నికలు అమరావతికి రెఫరెండం అని ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు వైసీపీకి పట్టం గట్టటం, ప్రత్యేకించి అమరావతి పరిసర ప్రాంతాలైన గుంటూరు,విజయవాడల్లో కూడా ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో అమరావతి రెఫరెండంగా టీడీపీ నుండి పోటీ చేస్తానన్న రఘురామ ప్రతిపాదనను బాబు తిరస్కరించాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read : టీడీపీ - జ‌న‌సేన పొత్తు పై సోము హాట్ కామెంట్స్

ఇహ మిగిలింది జనసేన,ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం తనకు తెలుసని ఇటీవల రఘురామ చేసిన వ్యాఖ్యలను దీన్ని దృష్టిలో పెట్టుకునే చేశాడనుకోవచ్చు. కానీ జనసేనతో పొత్తు విషయంలో వన్ సైడ్ లవ్ కష్టమంటూనే బాబు సానుకూలత చూపిన నేపథ్యంలో ప్రస్తుతం తాము బిజెపితో పొత్తులో ఉన్నామని ఇతర విషయాలు ఇప్పుడు అప్రస్తుతం అంటూ జనసేన ఖండించిన నేపథ్యంలో జనసేన తరుపున పోటీ చేస్తే టీడీపీ శ్రేణులు రఘురామ గెలుపు కోసం పని చేయకపోయే అవకాశం ఎక్కువ. కమ్యూనిస్టులతో పొత్తు కాడిని అకారణంగా కింద పడేసి బీజేపీతో కలిసి వెళ్లిన నేపథ్యంలో వారు తమ స్థాయి మేరకు దెబ్బ తీసే ప్రయత్నం చేయకమానరు. ఇప్పటివరకూ జనసేన అధికారికంగా ఏ అభిప్రాయమూ వ్యక్తం చేయకున్నా జనసేనని ఉద్దేశించి తాను తగ్గుతాను అని రఘురాం చేసిన వ్యాఖ్యలలో జనసేన పార్టీ కన్నా తాను అధికుడనైనా ప్రస్తుత పరిస్థితుల్లో తగ్గి జనసేన నుండి అయినా పోటీ చేస్తానంటూ ధ్వనించిన భావం పవన్ కళ్యాణ్ ఏ రకంగా తీసుకొంటాడో వేచిచూడాలి.

ఇన్ని వ్యతిరేకతల మధ్య తను గెలవడం పక్కనుంచి కనీసం గట్టి పోటీ ఇవ్వడం కూడా కష్టమని రఘురామకి తెలియనిది కాదు. పైగా ఎన్నికైన నాటి నుండి పార్లమెంట్ స్థానంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్, ఢిల్లీకి పరిమితమైన నాయకుడి పట్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటి వరకూ తన ఆర్ధిక, వ్యక్తిగత కార్యకలాపాల కోసం రాజ్యాంగ బద్ధ పదవిని అడ్డం పెట్టుకొని అధికారిక హోదాలో ఢిల్లీలో కార్యకలాపాలు నడిపిన రఘురామకి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోతే తనకు జరిగే నష్టం ఏమిటో, ఏమి కోల్పోతానో తెలియనిది కాదు .

ఈ పరిణామాలు అన్నీ నిశితంగా గమనించి చూస్తే కేవలం ప్రచారం కోసం, వైసీపీ పై విమర్శలు చేయడం కోసం ప్రెస్ మీట్లు, డిబేట్లు నిర్వహించి రాజీనామా చేస్తాను, నాకు పలు పార్టీల మద్దతు ఉంది, భారీ మెజారిటీతో గెలుస్తాను అని ఊదరగొట్టటమే తప్ప రాజీనామా చేసే పరిస్థితి లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

Also Read : రఘురామకృష్ణం రాజు ఏదో ఆశిస్తే, ఎదురుదెబ్బ తగిలిందా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp