కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ పై బీజేపీలో టెన్ష‌న్

By Kalyan.S Sep. 03, 2021, 09:45 am IST
కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ పై బీజేపీలో టెన్ష‌న్

మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా, లేదా అనే టెన్ష‌న్ కేసీఆర్ కు ఉండాలి కానీ, బీజేపీకి ఎందుకు అనుకుంటున్నారా? తెలంగాణ‌లో ప్ర‌స్తుతం న‌డుస్తున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బీజేపీకి ఆ మాత్రం టెన్ష‌న్ ఉంటుంది మ‌రి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్నారు. టీఆర్ఎస్ కార్యాల‌య శంకుస్థాప‌న నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అయితే, ఇప్పుడు తాజాగా కేసీఆర్ ప్ర‌ధాని మోదీ స‌హా అమిత్ షా, ప‌లువురు బీజేపీ ప్ర‌ముఖులతో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం టార్గెట్ గానే బండి పాద‌యాత్ర న‌డుస్తోంది. ఫొటోలు కేసీఆర్ వి, ప‌థ‌కాలు బీజేపీవి అంటూ ఎక్క‌డ మాట్లాడినా ఆయ‌న కేసీఆర్ ను విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న మాట‌లు, పాద‌యాత్ర‌పై ప్ర‌స్తుతానికి గులాబీ శ్రేణులు ఏమాత్ర‌మూ స్పందించ‌డం లేదు. వేచిచూసే ధోర‌ణి అవ‌లంబిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోదీని క‌లిసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వార్త‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ వైపు బండి సంజ‌య్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తూ పాద‌యాత్ర చేస్తుంటే, మోదీని క‌లిసి కేసీఆర్ రాష్ట్రంలో చేప‌డుతున్న ద‌ళిత బంధు స‌హా ప‌లు ప్రాజెక్టుల‌ను వివ‌రించాల‌ని భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందుకోసం ప్రధాని మోదీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ టైం కోసం వారి కార్యాలయాల్లో గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వారు టైమిస్తే.. వెళ్లి వారిని కలవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారట‌. గత ఏడాది డిసెంబరు రెండో వారంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మళ్లీ దేశ రాజధానికి వెళ్లటం ఇదే తొలిసారి.ఆ సందర్భంలోనే ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షాలతో ఆయన భేటీ అయ్యారు. గులాబీ బాస్ కోరినంతనే మోడీషాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఒక పక్క తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న వేళ.. ఢిల్లీలో తెలంగాణ సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇస్తే ఏం బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

ప్రధాని మోదీ కానీ తనకు టైమిస్తే.. ఆయనతో మాట్లాడేందుకు పలు అంశాలపై చర్చ జరిపేందుకు కేసీఆర్ ఎజెండా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో తాను షురూ చేసిన దళిత బంధు.. దాని అమలు చేస్తున్న తీరు.. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న పురస్కారం.. పార్లమెంటులో ఆయన చిత్రపటం.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాల్ని ప్రస్తావిస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. ఔషధనగరి శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp