కన్నడ సర్కారు కంట్లో యడ్డీ నలుసు

By Ramana.Damara Singh Jul. 31, 2021, 07:00 pm IST
కన్నడ సర్కారు కంట్లో యడ్డీ నలుసు

కర్ణాటక బీజేపీలో అధికార మార్పిడి సజావుగా జరిగినట్లు కనిపిస్తున్నా.. కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ మనుగడ దినదిన గండం నూరేళ్ల ఆయుష్హు అన్నట్లు మారడం తధ్యమని అనిపిస్తోంది. సాక్షాత్తు పార్టీ అగ్రనేతలే ఈ అనుమానం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి అనేకంటే ఒత్తిడికి తలొగ్గి వయసు నిబంధన పేరుతో యడ్యూరప్ప సీఎం పదవి నుంచి దిగిపోయారు. కొత్త సీఎంగా యడ్డీ సూచించిన.. లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మైకి అవకాశం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రి పదవుల విషయంలో ఇప్పటికే పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో అలకలు అసంతృప్తులు మెల్లగా బయట పడుతున్నాయి. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా యడ్యూరప్ప రూపంలో పార్టీకి, ప్రభుత్వానికి ముందు ముందు సమస్యలు తప్పకపోవచ్చని అంటున్నారు. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని ఆయన భావిస్తుండటమే దీనికి కారణం.

సీనియర్ల అసంతృప్తి, అలకలు

యడ్యూరప్ప దిగిపోతే ఆయన స్థానంలో సీఎం పీఠం అధిష్టించాలని ఆయన మంత్రివర్గ సీనియర్ సహచరులు, పార్టీ ప్రముఖులు ఆశ పడ్డారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. కానీ చివరికి బొమ్మైకి అవకాశం దక్కింది. దాంతో సీఎం పదవి మిస్సైన నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దాంతో మంత్రివర్గ కూర్పు ఆలస్యం అవుతోంది. సీఎం బొమ్మై రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలతో కలిసి ఆశావహుల జాబితాతో కుస్తీ పడుతున్నారు. మంత్రుల జాబితా ఖరారుకు ఇంకా ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని బొమ్మై స్వయంగా ప్రకటించారు. అయితే బొమ్మైతో పాటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని ఉవ్విళ్లూరిన మంత్రి శ్రీరాములు అది నెరవేరకపోవడంతో ఎవరికీ చెప్పాపెట్టకుండా తన నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇక సీఎం పదవి రేసులో విఫలమైన మంత్రి జగదీష్ షెట్టర్ బొమ్మై మంత్రివర్గంలో తనకు చోటు అవసరం లేదని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ఆయన యడ్యూరప్ప కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. యడ్డీ సీనియర్ నేత అయినందున ఆయన కేబినెట్లో చేశానని.. ఇప్పుడు తన కంటే జూనియర్ అయిన బొమ్మై దగ్గర ఎలా పనిచేస్తానని ఆయన అంటున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించనుండటంతో వాటి కోసం వివిధ వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. పదవులు లభించని వారు అసమ్మతికి తెర తీసే ప్రమాదం కనిపిస్తోంది.

గవర్నర్ గిరీ వద్దంటున్న యడ్డీ

వయసు కారణంతో సీఎం పదవి నుంచి తప్పించిన యడ్యూరప్పకు ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపిస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ చేశారు. అయితే దాన్ని యడ్డీ సున్నితంగా తిరస్కరించారు. గవర్నరుగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని.. ఈ విషయంలో తనను ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేశారు. గతంలో వాజపేయి కేంద్రమంత్రిగా రమ్మని ఆహ్వానించినా రాష్ట్రం వదిలి రాలేనని నాడు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఉంటానని.. మరికొన్నాళ్లు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే యడ్డీపై పార్టీ నాయకత్వం అనుమాన పడుతోంది. గవర్నరుగా వెళ్తే రాష్ట్రానికి దూరమై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే ఇక్కడే ఉంటే తన అనుయాయులతో కలిసి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యడ్డీ విషయంలో గత అనుభవం కూడా ఈ ఆందోళనకు కారణం అవుతోంది. 2008లో బీజేపీని అధికారంలోకి తెచ్చి సీఎం అయిన యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు రాగా లోకాయుక్త కోర్టు దోషిగా నిర్ధారించింది. దాంతో 2011లో పార్టీ ఆదేశాల మేరకు యడ్డీ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ తనను చిన్న చూపు చూసిందని ఆరోపిస్తూ తన మద్దతుదారులతో కలిసి బీజేపీని వీడి.. కర్ణాటక ప్రజాపక్ష పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ అనుభవం బీజేపీ నాయకత్వంలో ఆయనపై అనుమానాలు పెంచుతోంది. కుమారుడు విజయేంద్ర భవిష్యత్తు కోసమే యడ్డీ కర్ణాటక వదిలి గవర్నరుగా వెళ్లేందుకు నిరకరిస్తున్నారన్న వాదన కూడా ఉంది.

Also Read : ఆ పని యడ్యూరప్పే చేయించారా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp