పేటపై పట్టు చిక్కని అనిత

By Ramana.Damara Singh Aug. 03, 2021, 07:45 pm IST
పేటపై పట్టు చిక్కని అనిత

ఇంట గెలిచి.. రచ్చ గెలవాలన్నారు పెద్దలు. ఇంట్లోనే నెగ్గలేని వారు బయట ఎలా నెగ్గుకురాగలరన్నది దీని వెనుక ఉన్న పరమార్థం. తెలుగుదేశం పార్టీలో ఆ మహిళా నేత పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. సొంత నియోజకవర్గంలో ఏమాత్రం పరపతి లేదు. కార్యకర్తలే ఆమెను తిరస్కరిస్తున్నారు. దాంతో అధిష్టానం గత ఎన్నికల్లో ఆమెను వేరే జిల్లాకు షిఫ్ట్ చేసింది. అయినా ఆమె ఓటమిని తప్పించుకోలేకపోయారు. మరి వేరే గత్యంతరం లేకో.. పరాజిత అన్న సానుభూతితోనో అధినేత ఆమెను తీసుకువెళ్లి పార్టీ అనుబంధ విభాగం అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారు. తనకు సహజమైన మాట తీరుతో కొన్నాళ్లు దూకుడు చూపించిన ఆ మహిళా నేత ఈమధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. అటు సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటపై పట్టు సాధించడంలో విఫలం అవుతున్నారు. ఆ మహిళా నేత మరెవరో కాదు.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత.

తారాజువ్వలా ఎగిసి..

విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనిత టీచరుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె దూకుడు రాజకీయాలకు చిరునామాగా మారారు. అసెంబ్లీలోనూ, నియోజకవర్గంలోనూ అదే తీరు కనబరిచేవారు. అసెంబ్లీలో ప్రతిపక్షంపై ఆమె చేసిన మాటల దాడులు.. సదరు పార్టీ అధినేతకు బాగానే నచ్చాయి. దాంతో మంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది. మంత్రి కాలేదు గాని..టీటీడీ సభ్యురాలిగా నియమితులయ్యారు. అయితే ఆమె హిందువు కాదన్న వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఆ నియామకాన్ని రద్దు చేసింది. కాగా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆమె తీరును ఏమాత్రం హర్షించలేకపోయారు. కొద్దికాలానికే ఆమెపై వ్యతిరేకత పెరిగింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు, ఉద్యోగ నియామకాలు, పథకాల వర్తింపు పేరుతో సాగించిన వసూళ్లు అనిత పరపతిని దిగజార్చాయి. చివరికి పార్టీ కార్యకర్తలు సైతం ఆమెకు టికెట్ ఇవ్వరాదని పార్టీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆమెకు టికెట్ ఇస్తే తాము పార్టీ వీడతామని హెచ్చరించారు. దాంతో చంద్రబాబు ఆమెను తీసుకెళ్లి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించారు. అక్కడ ఓటమి పాలైన ఆమె.. అక్కడి నుంచి విశాఖ నగరానికి మకాం మార్చేశారు.

ఇప్పటికీ అదే వ్యతిరేకత.. 

గత ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న టీడీపీ వలసలతో మరింత కుంగిపోతోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అనితను తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించారు. పదవి చేపట్టిన తర్వాత కొన్నాళ్లు చురుగ్గానే పనిచేసిన ఆమె.. తన సహజశైలిలో నోటికి బాగానే పనిచెప్పేవారు. అదే సమయంలో ఆమెను తిరిగినా పాయకరావుపేట ఇంఛార్జిగా పార్టీ నియమించింది. ఆమె తిరిగి రావడం ఏమాత్రం ఇష్టం లేని టీడీపీ దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలు సహాయ నిరాకరణ ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొనడం మానేశారు. దాంతో అనిత నియోజకవర్గానికి రావడమే మానేశారు. అలాగే తెలుగు మహిళగాను మునుపటంత దూకుడు చూపించడం లేదు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పూర్తిగా పట్టు బిగించింది. మూడోసారి ఎమ్మెల్యే అయిన గొల్ల బాబూరావు నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనితకు పాయకరావుపేట చిక్కడం కష్టమేనని అంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp