TDP Undemocratic Behavior - ముఖ్యమంత్రి మీద టీడీపీ కుటిల రాజకీయం ఎందుకు..?

By Karthik P Oct. 19, 2021, 08:01 pm IST
TDP Undemocratic Behavior - ముఖ్యమంత్రి మీద టీడీపీ కుటిల రాజకీయం ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వరకు వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేతను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దూషిస్తుండడంపై విమర్శలు వస్తున్నా టీడీపీ నేతలు మాత్రం తమ తీరును మార్పుకోకపోగా ఇంకా రెచ్చిపోతున్నారు.

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం. పరిపాలన అంశాలపై, రాజకీయపరమైన విషయాలపై విమర్శలు, ప్రతివిమర్శలు నిత్యం జరిగేవే. కానీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దూషించడం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలైంది. సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసే సంస్కృతి చంద్రబాబు మొదలు పెట్టారు. ఆ తీరును టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. దమ్ముంటే.. రా..రా.. సీబీఐ ఎక్వైయిరీ వేయరా.. అంటూ నారా లోకేష్‌ మాట్లాడారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. రాయలేని భాషలో దూషించారు. కొమ్మారెట్టి పట్టాభిరామ్‌.. కూడా అదే బాటలో పయనించారు.

నాలుగు పదుల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను దేశంలోనే సీనియర్‌నని చెప్పుకుంటుంటారు. అలాంటి వ్యక్తి ఈ తరహాలో రాజకీయం ఎందుకు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు, దూషణలు చేయడం వెనుక చంద్రబాబు టీం లక్ష్యం ఏమిటి..? అధికారం పోయిందనే ఆక్రోశమా..? మళ్లీ అధికారంలోకి రాలేమనే ఫ్రస్ట్రేషనా..?. మేము బండలు వేస్తాం.. మీరు వేయించుకోండి.. మేము బూతులు మాట్లాడతాం.. మీరు సహించండి.. అనేలా టీడీపీ నేతలు తీరు ఉంది.

గౌరవ ప్రతిష్టలు, మనోభావాలు, హక్కులు.. కేవలం నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలకే ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. విజయవాడలో వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ దందాలో.. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. అసెంబ్లీలో సీఎంను ఉద్దేశించి.. కా.మ(కాల్‌మనీ) సీఎం అన్నారు. గౌరవ ప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. కామ సీఎం అంటారా..? అంటూ రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్‌ విధించారు. ఎమ్మెల్యే రోజా.. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లే వరకూ సభా కార్యక్రమాలు నిర్వహించలేదు.

జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ.. ఆర్‌కే రోజా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును విమర్శిస్తే.. ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం.. అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు..? ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ తిరుపతికి వచ్చిన నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత హోం మంత్రి అమిత్‌షా కాన్వాయ్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వాయి.


బీజేపీతో పొత్తు తెంచుకుని బయటకు వచ్చిన తర్వాత 2018 ఏప్రిల్‌లో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ముందు మీ పార్టీలోని పెద్ద అద్వానినీ, సతీమణిని గౌరవించడం నేర్చుకోవాలంటూ మోదీకి సూచించారు. గుజరాత్‌ రాజకీయాలు ఏపీలో చెల్లవని, తాను ఒక్క పిలుపునిస్తే ప్రజలు మోదీని తరిమి తరిమి కొడతారన్నారు. ఈ తరహాలో ఇతర పార్టీ నేతల పట్ల ప్రవర్తిస్తూ.. మేము చేస్తే సంసారం.. మీరే చేస్తే కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అరచి గోలపెట్టినంత మాత్రాన గతం మరుగునపడిపోదు కదా..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎంను చెంపదెబ్బ కొట్టాలని కేంద్ర మంత్రి నారాయణ రాణే అంటే.. ఆయనపై పోలీసులు కేసు నమోదైంది. కేసు నమోదు చేయడమే కాదు కేంద్ర మంత్రిని అరెస్ట్‌ కూడా చేశారు. చెంపదెబ్బ కొట్టాలని అన్నందుకే ఏకంగా కేంద్రమంత్రిపైనే కేసు పెట్టి, అరెస్ట్‌ చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ నేతలు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, దూషణలపై ఎన్ని సార్లు కేసులు పెట్టాలి..? ఎంత మందిని అరెస్ట్‌ చేయాలి..?

మహారాష్ట్రలోనూ, ఏపీలోనే ఒకటే రాజ్యాంగం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) ఒకటే. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం సహనంతో వ్యవహరిస్తోంది. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా.. దాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. ప్రతిష్టను దిగజార్చే పనిని టీడీపీ నేతలు పెట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి వ్యవహారంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ పోలీసులు నోటీసులు ఇస్తే.. తమ హక్కులకు భంగం కలిగాయంటూ, మాజీ మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇంటికి అర్థరాత్రి వస్తారా..? అంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలు.. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి తాము చేస్తున్న వ్యాఖ్యలు, దూషణలను ఏ విధంగా సమర్థించుకుంటారు..? అనుభవజ్ఞుడును అని చెప్పుకుంటున్న చంద్రబాబు అనుభవం ఇదేనా..?

Also Read : అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!

Also Read : గోదాట్లో కలిసిన బుచ్చయ్య పెద్దరికం..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp