పవన్ కళ్యాణ్ కి ఏమయ్యింది..

By Raju VS Jun. 10, 2021, 12:30 pm IST
పవన్ కళ్యాణ్ కి ఏమయ్యింది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. గడిచిన రెండు నెలలుగా ఓ ట్వీట్ గానీ, ప్రజల సమస్యలపై స్పందించే ప్రయత్నం గానీ చేయడం లేదు. ఇంతకీ ఆయనకు ఏమయ్యిందోననే చర్చ మొదలయ్యింది. రాజకీయంగా కీలక సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీస స్పందన లేకుండా ఆయన ప్రజా నేతగా ఎలా ఎదుగుతారనే ప్రశ్న అభిమానుల్లోనే ఉత్పన్నమవుతోంది. ఓవైపు అన్నయ్య చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా అందరి మన్ననలు పొందారు. కానీ తమ్ముడు మాత్రం మౌనం వీడకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

వాస్తవానికి ఏప్రిల్ మధ్యలో పవన్ కి కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆతర్వాత ఆయన కోలుకున్నట్టు జనసేన అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆయన ప్రజలకు సంబంధించిన అంశాల్లో స్పందించడం లేదు. ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదు. పోస్ట్ కోవిడ్ సమస్యలేమయినా ఎదుర్కొంటున్నారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల తనయుడు అకీరాతో కలిసి సంగీతం పాఠాలు నేర్చుకుంటున్నట్టు కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

ప్రజలు గతంలో ఎన్నడూ ఎరుగనంత అవస్థల్లో ఉన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్నారు. చిరంజీవి వంటి వారు ఇటు సామాన్యులకు, అటు సినీరంగంలో ఉన్న వారికి చేదోడుగా నిలుస్తున్నారు. కానీ పవన్ మాత్రం అటూఇటూ కాకుండా పోతున్నారా అనే అపోహ తలెత్తుతోంది. ఏప్రిల్ ప్రారంభంలో తిరుపతి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థికి మద్ధతు కేవలం ఒకే ఒక్క రోజు పర్యటనకు వెళ్లారు. పవన్ తీరు మీద ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పవన్ మద్ధతు ఇచ్చినా తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్నారా, ఆపార్టీతో దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా అనే వాదన కూడా మొదలవుతోంది. ఏమయినా రాజకీయంగా ఎదగాలని ఆశించిన పవన్ కళ్యాణ్ మూడు నెలలుగా వాటి జోలికి రాకుండా అందరికీ దూరంగా ఉండడం ఆశ్చర్యమే. జనసేన కార్యకర్తలు,ఆయన్ని నమ్ముకున్న ఇతరులకు ఇది మింగుడుపడని అంశమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp