ఈనాడు వాడీవేడి ఏపీలోనే..!

By Voleti Divakar Jul. 14, 2020, 05:00 pm IST
ఈనాడు వాడీవేడి ఏపీలోనే..!

ఈనాడు పత్రికను, తెలంగాణా ప్రజల గళాన్ని తెలంగాణాలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారా?.. కెసిఆర్ అంటే అంత భయభక్తులు ఎందుకు?.. ఎందుకంటే హైదరాబాద్లోని ఆస్తులను కాపాడుకునేందుకు..! ఈనాడు తెలంగాణాలో ఎడిషన్లో ఇటీవల ప్రచురితమవుతున్న వార్తలు, యాజమాన్య వ్యవహారశైలి చూస్తే ఈ అనుమానాలు ప్రజలందరిలో కలగకమానవు. కరోనా కాలంలో కూడా ఈనాడు అధికార టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వ్యతిరేక వార్తను ప్రచురించలేదు. తెలంగాణా ప్రజల వెతలను వెలుగులోకి తీసుకుని రాలేకపోయింది.

ఈనాడుకు కవల పత్రిక లాంటి ఆంధ్రజ్యోతి సైతం కొన్నిసార్లు ప్రజాసమస్యలపై స్పందించింది. తాజాగా గవర్నర్ తమిళ సై కరోనాపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి టిఆర్ఎస్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే వారు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారని మిగిలిన పత్రికలన్నీ రాశాయి. ఈనాడు మాత్రం కరోనాపై గవర్నర్ సమీక్ష అని సరిపెట్టింది. తెలంగాణాలో చిన్నపాటి ప్రజాసమస్యలకు సంబంధించిన వార్తలపై కూడా ఖండనలు, వివరణలు ఇచ్చుకునే దుస్థితిలో ఉండటం ఈనాడు దయనీయ స్థితిని తేటతెల్లం చేస్తోంది.

అదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెచ్చిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది. రాజధాని రైతులను రెచ్చగొట్టడం, వైసిపి ఎంపి రఘురావుకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించడం, ఏపీలో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదంటూ... ఇలా ప్రతీరోజూ వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త లేకుండా ఈనాడు ప్రచురితం కాదంటే నమ్మలేరు. ఏపీలో గవర్నర్ సమావేశానికి అధికారులు గైర్హాజరైతే ఈనాడుకు బ్యానర్ వార్తగా మారేది. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపిని వైసిపి పైకి ఉసిగొల్పేందుకు తంటాలుపడేది.

తెలంగాణా ప్రభుత్వమంటే ఎందుకు భయం...ఎపి ప్రభుత్వమంటే ఎందుకీ విద్వేషం అని విశ్లేషిస్తే... రామోజీరావు మాన సపుత్రిక, వేలకోట్లతో నిర్మించిన రామోజీ ఫిలిమ్ సిటీయే ఈనాడు బలహీనతగా చెబుతారు. తెలంగాణా ఉద్యమ సమయంలో నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమకర్త కె చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన ఈనాడు ఆయన ఆగ్రహానికి గురైంది. దీంతో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణాలోని హైదరాబాద్ లో ఉన్న రామోజీరావు మానసపుత్రిక రామోజీ ఫిలిమ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని ప్రతిన పూనారు.

నాటి నుంచి ఈనాడుకు కెసిఆర్ ప్రభుత్వమంటే భయం పట్టుకుంది. అయితే ఉన్నతస్థాయి లాబీయింగ్ లో కెసిఆర్ కొంత మెత్త బడినట్లు చెబుతారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాడు పత్రిక ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరైన వార్త ఒక్కటి కూడా ప్రచురించలేకపోయింది.

రామోజీ ఫిలిమ్ సిటీ కోసం రామోజీరావు తన పత్రిక విశ్వసనీయతను, ప్రజాసమస్యలను తాకట్టు పెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో ఈనాడు రెచ్చిపోవడం వెనుక సొంత సామాజిక ప్రయోజనాలతో పాటు, ఈనాడు అభిమానించే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp