బాబు , లోకేష్ ల నాయకత్వానికి జూ ఎన్టీఆర్ రూపంలో ప్రమాదం పొంచి ఉందా ? .

By Sanjeev Reddy Jun. 22, 2021, 09:08 am IST
బాబు , లోకేష్ ల నాయకత్వానికి జూ ఎన్టీఆర్ రూపంలో ప్రమాదం పొంచి ఉందా ? .

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ పార్టీలోని కొన్ని వర్గాలు వినిపించడం , గత మూడు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలోని లోకేష్ అనుకూల శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ పై ఆర్ధిక , రాజకీయ విమర్శలు చేస్తుండటం లాంటి పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పొచ్చు .

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పార్టీ శ్రేణులతో పాటు నాయకుల్లో కూడా ఒక రకమైన నైరాశ్యం , స్తబ్దత నెలకొంది . 175 సీట్లకు గాను 151 స్థానాల్లో ఘోర పరాజయం పొందడంతో పాటు , పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేశాం , పులివెందులకి నీళ్లిచ్చాం అంటూ బాబు గారు చెప్పుకొన్న కబుర్లు మీడియాలో మైలేజ్ తప్ప , క్షేత్ర స్థాయిలో ప్రజలు విశ్వసించకపోబట్టే రాయలసీమలో 52 కు గాను 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని ఆయా ప్రాంత టీడీపీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం .

ఎన్నికల తర్వాత సైతం ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని తప్పులు దిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం , నన్నోడించి ప్రజలే నష్టపోయారు అనే ధోరణిలో బాబు వ్యవహరించడంతో , ఆయన నాయకత్వ పటిమ పై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి మొదలైంది . మరోవైపు తన తర్వాత టీడీపీ నాయకత్వానికి వారసుడిగా లోకేష్ ని ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా లోకేష్ ప్రవర్తన , మాటతీరుతో అతని పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్ల గా మారుతుంది .

ఆది నుండీ తన బాడీ లాంగ్వేజ్ , మాటతీరుతో పలు విమర్శలు , హేళనలు అందుకొన్న లోకేష్ 2017 లో ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రిగా చేసినా తన పరిస్థితి మెరుగు పడకపోవడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి భారీ ఎత్తున ప్రచారం చేసి , పెద్ద మొత్తంలో వ్యయం చేసినా ఓటమి పాలవ్వడంతో లోకేష్ రాజకీయ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకున్నాయి . ఈ తరుణంలోనే టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలని జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పచెబితే బాగుంటుంది అన్న డిమాండ్స్ పార్టీ శ్రేణుల నుండి రావడం మొదలైంది .

ఈ పరిస్థితులు గమనించి కంగారు పడ్డ బాబు జూనియర్ రావాలన్న డిమాండ్స్ చేసేవారి నోరు మూపించడమే కాక 2019 డిసెంబర్ లో జరిగిన టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి జూనియర్ నే కాక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని కూడా ఆహ్వానించకుండా దూరం పెట్టారు . అలాగే లోకేష్ ని ప్రమోట్ చేసే ప్రయత్నాలు తీవ్రం చేయడంలో భాగంగా అతని బాడీ లాంగ్వేజ్ మార్చడం , మాటల్లో దూకుడు , పదునైన వ్యాఖ్యలు చేయించడంతో పాటు పలు ప్రాంతాల్లో బాబు పర్యటించవలసిన పరిస్థితి వచ్చినప్పుడల్లా లోకేష్ ని పంపించి అతన్ని నాయకులు ఆమోదించే విధంగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు .

ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకేష్ పలుమార్లు తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకొని నవ్వులపాలు కావడంతో పాటు , ఆగ్రహ ప్రదర్శనలో భాగంగా అభ్యంతరకర భాష వాడడం లాంటి చర్యలతో టీడీపీ వర్గాల్లో నమ్మకం కోల్పోవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరగసాగింది . ఇటీవల చంద్రబాబు చిత్తూరు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తేవాలని నేరుగా బాబునే డిమాండ్ చేయటం విశేషం .

ఈ సంఘటనలతో కంగారుపడ్డ లోకేష్ పార్టీలో తన పట్టు కాపాడుకోవడం కోసం టీడీపీ సోషల్ మీడియా విభాగం చేత జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేయించసాగినట్టు తెలుస్తోంది . అందులో భాగమే 2009 ఎన్నికల ప్రచారానికి పార్టీ నుండి ఇరవై కోట్లు తీసుకొని యాక్సిడెంట్ నాటకంతో ప్రచారం చేయకుండా హాస్పిటల్ లో పడుకొన్నాడని , నందమూరి హరికృష్ణ దుర్మరణం తర్వాత భౌతిక కాయాన్ని పార్టీ ఆఫీసులో ప్రజల సందర్శనకు పెట్టకుండా అడ్డుకొన్నాడని , పార్టీ కష్టకాలంలో ప్రచారానికి రాలేదని తన పై విమర్శలు ఎక్కుపెట్టారని అవగతం అవుతుంది .

అయితే ఈ పరిణామాల పై జూనియర్ ఏ విధంగానూ స్పందించకుండా మౌనం వహించారు . అంతిమంగా చూస్తే లోకేష్ టీడీపీ శ్రేణుల ఆమోదం సంపాదించలేకపోయిన సందర్భంలో , జూనియర్ పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ క్షేత్ర స్థాయిలో రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా సమీప భవిష్యత్తులో టీడీపీ అంతర్గత రాజకీయాలు ఏ మలుపు తీసుకొంటాయనేది ఆసక్తికరం .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp