Chandrababu - పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

By Aditya Oct. 23, 2021, 01:50 pm IST
Chandrababu -  పోలీసులను ఎందుకు  టార్గెట్ చేస్తున్నారు?

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇటీవల తరచుగా పోలీసులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న తన 36 గంటల దీక్ష ముగింపు సందర్బంగా చేసిన ప్రసంగంలో కూడా పోలీసులనే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి తాము చేసిన ఆరోపణలపై ఆధారాలు అందజేస్తే పోలీసులు యూనిఫారం వదిలేస్తారా? అని చాలెంజ్ చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చాక ఒక కమిషన్ వేసి, విచారణ చేసి అందరి సంగతి చూస్తామని అన్నారు. ఎవ్వరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఒకవేళ అధికారులు బదిలీ అయినా తమ నుంచి తప్పించుకోలేరని, ఎక్కడ ఉన్నా బదులు తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చేతకాక పోతే తప్పుకోండి.. పోలీసు డిపార్టుమెంటునే మూసేసుకోండి అని దీక్ష ప్రారంభం రోజున డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కుమారుడు లోకేశ్ కూడా తరచు పోలీసులపై విరుచుకు పడుతుండడం చూస్తూనే ఉన్నాం.

అధికారంలో లేకపోయినా తన మాటే వినాలా?

అధికారులు ప్రభుత్వంలో ఒక భాగం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తారు. అంతేగాని వారే స్వతంత్రంగా విధాన నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేయరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు ఈ విషయం తెలియనిది కాదు. అయినా వారిని నిందిస్తున్నారంటే బెదిరించి దారికి తెచ్చుకుందామనా? తాము అధికారంలోకి వచ్చాక ఎలాగూ తమ మాట వినాలి కనుక అదేదో ఇప్పటి నుంచే వినండి అని వారి మీద ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు అంటే చంద్రబాబు దృష్టిలో అధికార పార్టీకి బానిసలు. చెప్పినట్టుగా వింటూ రాజకీయ అవసరాలకు ఉపయోగ పడే ఒక అధికారుల కూటమిగానే చూస్తారు.

అందుకే ఓటుకి నోటు కేసులో ఆడియో సాక్ష్యంతో సహా దొరికిపోయినప్పుడు తెలంగాణ కేసీఆర్ ను ఉద్దేశించి అలా వ్యాఖ్యానించారు. నాకు సీఐడీ ఉంది.. నీకు సీఐడీ ఉంది. నాకూ పోలీసులు ఉన్నారు.. నీకూ పోలీసులు ఉన్నారు. అంటూ బెదిరించారు. అంటే ఓ రాజు గారికి ఉండే భటుల్లా పోలీసులు సీఎం చెప్పినట్టు వినాలని ఆయన ఉద్దేశం. బాబు ఆదేశిస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకొచ్చి ఆయన కాళ్ల మీద పాడేయాలన్న మాట. తన రాజకీయ అవసరం కోసం పోలీసులను ఆ విధంగా వాడేస్తానని ఆనాడే బహిరంగంగా చంద్రబాబు చెప్పారు. పోలీసులపై ఆయనకు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి గనుకే వారిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు.

Also Read : Vamsi Challenge - వంశీ సవాల్‌ను పరిటాల సునీత స్వీకరిస్తారా..?

పోలీసులను స్వతంత్రంగా పనిచేయనిచ్చారా?

పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించాలి అంటున్న చంద్రబాబు తన హయాంలో వారిని అలా పని చేయనిచ్చారా? తన పబ్లిసిటీ కోసం గోదావరి పుష్కరాల్లో రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోతే పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయనిచ్చారా? పైగా వారి దర్యాప్తునకు ఆధారాలు దొరకకుండా సీసీ ఫుటెజీలనే మాయం చేశారు కదా? ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకొని ఈడ్చిన కేసులోనూ పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనిచ్చారా? కాల్ మనీ సెక్సె రాకెట్ ఉదంతంలో గాని, తమ పార్టీ ప్రజా ప్రతినిధులు విజయవాడలో బహిరంగంగా రవాణా శాఖ ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడినప్పుడు గాని పోలీసులను రూల్ ప్రకారం పని చేయనిచ్చారా? ఇప్పుడేమో తలా తోకా లేకుండా నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని హూంకరిస్తే పోలీసులు జీ హుజూర్ అనాలా?

మళ్లీమళ్లీ అవే ఆరోపణలు..

డ్రగ్స్ కు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇటు రాష్ట్ర డీజీపీ పదే పదే చెబుతున్నా అవే ఆరోపణలు వల్లించటం ఏ తరహా రాజకీయం. పైగా రూ. లక్ష కోట్ల డ్రగ్స్ రాష్ట్రంలో ఉన్నాయని సరికొత్తగా ఆరోపించడం, ఆధారాలు అడిగితే పోలీసుల పై విరుచుకు పడడం సబబేనా? చంద్రబాబు హయాంలో కన్నా పోలీసులు ఇప్పుడే స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పోలీసులు ప్రశాంత వాతావరణంలో పనిచేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉంటాయని నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వారి సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. పని పరిస్థితులను మెరుగు పరిచారు. సిబ్బందిని పెంచారు. జీతాలు పెంచారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఇంకా సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. హోం గార్డుల జీతాలు గణనీయంగా పెంచారు. వారి చిరకాల కోరిక అయిన వీక్లీ ఆఫ్ ను అమలులోకి తీసుకొచ్చారు. దీంతో వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారు.

పోలీసులను దూషిస్తే హీరో అయిపోతారా?

ఖైదీ సినిమాలో పోలీస్ స్టేషన్ లో చేసిన ఫైటింగ్ చిరంజీవికి హీరోగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. స్టేషన్లోనే పోలీసులను తనదైన స్టయిల్ లో కొట్టడం అభిమానులకు నచ్చింది. హీరోగా ఆయన ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగించింది. అదేవిధంగా పోలీసులను తాను కించ పరిస్తే రాజకీయాల్లో హీరోగా ఎదిగిపోతానని, మైలేజీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారేమో! ఎందుకంటే ఆయన పోలీసులను దూషిస్తూ మాట్లాడిన ప్రతిసారి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో ప్రొత్సహిస్తున్నారు. అదే నిజమనుకొని పోలీసులపై తన మాటల దాడిని కొనసాగిస్తే చంద్రబాబు అటు పోలీసుల్లొనే కాదు ఇటు జనంలోనూ పలచన అవుతారు. ఎందుకంటే అది సినిమా.. ఇది ప్రజా జీవితం.

Also Read : President Rule - పరిస్థితులతో పనిలేదు.. డిమాండ్ చేస్తాం అంతే..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp