బుచ్చయ్యకు ఉన్న ధైర్యం బాబుకు లేకపాయనే..!

By Kotireddy Palukuri Aug. 01, 2020, 11:06 am IST
బుచ్చయ్యకు ఉన్న ధైర్యం బాబుకు లేకపాయనే..!

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయగానే గవర్నర్, బీజేపీ లక్ష్యంగా పలువరు విమర్శలు సందించారు. సీపీఐ నారాయణ, అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులు, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తదితరులు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఎవరికి వారు తమకు తోచినట్లుగా బీజేపీని తిట్టిపోశారు. అయితే అమరావతిని అలా నిర్మిస్తా.. ఇలా నిర్మాస్తా.. అమరావతి నా కల, బంగారు బాతు.. భవిష్యత్‌ కోసం అమరావతి నగరం.. అంటూ నిత్యం మాట్లాడే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు.

టీడీపీలో చంద్రబాబు కన్నా సీనియర్, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని ఆక్రోశం వెల్లగక్కారు. తిరుపతిలో మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంతేకాదు అమరావతి విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు కూడా బుచ్చయ్య చౌదరి కౌంటర్‌ ఇస్తున్నారు. అమరావతితో ఏ అనుబంధం లేని బుచ్చయ్య చౌదరే తనలోని ఆవేదనను వెల్లగక్కుతుంటే.. బాబు మాత్రం బీజేపీపై నోరు మెదపడం లేదు. గతంలో మాట్లాడినట్లుగా.. మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చాడని కానీ, ఢిల్లీని మించిన నగరాన్ని నిర్మిస్తాడన్నాడని కానీ ఇప్పుడు బాబు కనీసం మాట మాత్రమైన ఎందుకు ప్రస్తావించడంలేదో తమ్ముళ్లకే అర్థం కాలేదు.


నిన్న జూమ్‌ ప్రెస్‌మీట్‌లోనూ విలేకర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు తనకు నచ్చిన సమాధానాలు, ప్రశ్నతో సంబంధం లేని అంశాలు మాట్లాడిన చంద్రబాబు.. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత బీజేపీ, వైసీపీ స్నేహంగా ఉంటాయనుకుంటున్నారా..? అనే ప్రశ్నకు మాత్రం చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కనీసం స్పందించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లబోవడంలేదంటూ తప్పించుకున్నారు. అయితే ప్రెస్‌ మీట్‌ మొత్తం రాజకీయాల గురించే మాట్లాడిన బాబు.. బీజేపీ విషయం వచ్చే వరకూ నోరు మెదపలేదు. గడచిన ఎన్నికలకు ముందు ఏపీలోకి సీబీఐకి నో ఎంట్రీ బోర్టు పెట్టడం, నన్ను అరెస్ట్‌ చేస్తారంటూ భయపడడం, వలయంగా ఉండి తనను కాపాడాలని ప్రజలను వేడుకోవడం చంద్రబాబు చేశారు. ఓటుకు నోటు కేసు, అవినీతి వ్యవహారాల్లో తాను అరెస్ట్‌ అవుతాననే భయంతోనే చంద్రబాబు ఆ రోజు అలా మాట్లాడారనే వ్యాఖ్యలు వినిపించాయి.

రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు పెద్ద స్కాం అని నాడు మాట్లాడిన చంద్రబాబు.. ఇటీవల ఆ విమానాలు దేశానికి వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. బాబు మాత్రం మౌనం వహించారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో అవసరం కాబట్టి పొత్తుపెట్టుకుని, అవసరం తీరాక బీజేపీ, మోడీపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నేపథ్యంలో.. తనకు చిక్కులు తప్పవనే భావనలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp