రాజీనామాలపై బాబు ఎందుకు వెనక్కి తగ్గినట్టో..

By Raju VS Aug. 01, 2020, 09:46 am IST
రాజీనామాలపై బాబు ఎందుకు వెనక్కి తగ్గినట్టో..

ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు విషయంలో గవర్నర్ ఆమోదం లభించగానే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఏపీకి మూడు రాజధానులు అమలులోకి వచ్చాయి. అంతేగాకుండా అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా మనుగడలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం అంతా సన్నద్ధమవుతున్న వేళ చంద్రబాబు షాక్ కి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ అనేక కసరత్తుల తర్వాత గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు ప్రకటించారు. దానికి తోడుగా రాజీనామా అస్త్రాలు సంధించాలని కూడా ఆశించారు. ఎమ్మెల్సీలను తొలుత రాజీనామాలు సమర్పించాలని పార్టీ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ బీటెక్ రవి మినహా ఎవరూ స్పందించలేదు.

దాంతో చివరకు నేరుగా చంద్రబాబు రంగంలో దిగాలని భావించారు. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో లీకులు కూడా ఇచ్చారు. శనివారం ఉదయాన్నే గవర్నర్ ని కలిసి 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సమర్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పోస్టింగ్స్ కూడా చేశారు. కానీ దానిని ధృవీకరించేందుకు టీడీపీ నేతలు సిద్ధం కాలేదు. అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్సీలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే ఆలోచనకు సిద్ధంగా లేకపోవడమేనని చెబుతున్నారు. చంద్రబాబు దూకుడు ప్రదర్శించాలని చూస్తే ఎవరి దారి వారు చూసుకోక తప్పదనే సంకేతాలు ఇవ్వడంతో బాబు బ్యాక్ స్టెప్ వేసినట్టు కనిపిస్తోంది.

వాస్తవానికి రాజధాని కోసం రాజీనామా చేయాలంటే తొలుత అక్కడ పార్టీ బాధ్యతల్లో ఉన్న నారా లోకేశ్ తన రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించారు. కానీ నారా లోకేశ్ కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పట్లో రాజీనామా చేసి అసెంబ్లీ బరిలో దిగిన మాజీ మంత్రి నారాయణ వంటి వారు నష్టపోగా, చినబాబు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదా అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారమే పునరావృతం అవుతుందన్నది పలువురి అభిప్రాయం. రాజీనామాలు ఎమ్మెల్యేగా చంద్రబాబు, ఎమ్మెల్సీగా నారా లోకేశ్ తో ప్రారంభిస్తే అందరూ హర్షిస్తారు గానీ, బీటెక్ రవితో ప్రారంభించడం మాత్రం అనుమానంగా ఉందని అంతా భావిస్తున్నారు.
బీటెక్ రవి రాజీనామా కూడా కేవలం పార్టీ అధ్యక్షుడికి సమర్పించిన నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామా పేరుతో సాగించే పొలిటికల్ గేమ్ లో తాము కూడా గవర్నర్ కి సమర్పించాలనే ఆలోచన టీడీపీ నేతలకు వచ్చింది. అయితే వాటిని గవర్నర్ నేరుగా స్పీకర్ కి పంపిస్తే ఏమవుతుందోననే సందేహం కూడా రావడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు అమరావతి అంశంలో చంద్రబాబు కూడా హైదరాబాద్ కి పరిమితం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులు టీడీపీ తీరుని కూడా సందేహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చంద్రబాబు నిర్ణయం నష్టం చేకూర్చగా, ఇప్పుడు అమరావతి రైతుల్లో కూడా అపోహలు మొదలయిన తరుణంలో వాటిని అధిగమించేందుకు బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజీనామాల విషయంలో పునరాలోచనలో ఉన్న తరుణంలో అది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. తదుపరి చర్య ఏమిటన్నదే చర్చనీయాంశం. బాబుని డిఫెన్స్ లో పడేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp