అలా అయితే.. వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు..?

By Voleti Divakar Aug. 14, 2020, 07:19 pm IST
అలా అయితే.. వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు..?

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఎపి ప్రజలంతా కోరుకుంటున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆపార్టీ నాయకులు పదేపదే చెబుతున్నారు. విశాఖపట్నంను రాజధాని కావాలని అక్కడి ప్రజలు కోరుకోవడం లేదని కూడా టిడిపి నాయకులు చెప్పుకొస్తున్నారు. అలాగైతే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరగడం లేదనే ప్రశ్న వినిపిస్తోంది.

చంద్రబాబు చెప్పిన దానికి అనుగుణంగా విశాఖపట్నంను రాజధానిగా చేయవద్దని కనీసం విశాఖపట్నం ప్రజలు కూడా ఉద్యమించడం లేదు. అలాగే రాయల సీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించవద్దని అక్కడి ప్రజలు కూడా కోరుకోవడం లేదు. అలాగని ఆయా ప్రాంతాల్లో రాజధాని అమరావతీకి మద్దతుగా ఉద్యమాలు చేయడం లేదు. రాజధాని ఉద్యమం కేవలం అమరావతికే పరిమితమైంది.

రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్ జారీ చేసిన తరువాత రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తుందని టిడిపి నాయకులు ఆశ పడ్డారు. వారికి ఈ విషయంలో నిరాశే ఎదురయ్యింది. ఉద్యమాన్ని ఎగదోసేందుకు టిడిపి నాయకులు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో స్పందన కనిపించడం లేదు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 48 గంటల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని, ఎన్నికల ద్వారా ప్రజల రెఫరెండంను కోరదామని చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. చంద్రబాబు సవాల్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి స్పందన కరవైంది.

ఈ పరిణామాలను బట్టి రాజధాని అమరావతి ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త మద్దతు లేదన్నది స్పష్టమవుతోంది. అమరావతిలో రియల్ వ్యాపారం సాగించిన టిడిపి, ఈ మధ్య కాలంలో టిడిపికి బాకాగా మారిన కాంగ్రెస్, సిపిఐ పార్టీలు మాత్రమే రాజధాని ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాయి. తాజాగా బిజెపి, జన సేన పార్టీలు కూడా రాజధాని ఉద్యమానికి దూరం జరిగాయి. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలపకపోతే ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారంటే ఆ పార్టీలు ఉద్యమానికి ఎందుకు దూరమవుతాయన్నది ఆలోచించాల్సిన విషయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp