ఎన్ని రక్షణ సమితులకు అధ్యక్షుడో ఈ కొలికపూడి

By Rishi K Jul. 01, 2021, 11:00 am IST
ఎన్ని రక్షణ సమితులకు అధ్యక్షుడో ఈ కొలికపూడి

రాయలసీమ ప్రాజెక్టులకు మద్దతుగా ధర్నా అంటూ హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల ఇంటి ముందు గొడవ చేసి వార్తల్లోకెక్కిన కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఆది నుండీ వివాదాస్పదం , అనుమానస్పదమే కాదు టీడీపీకి , చంద్రబాబుకి అనుకూల ధోరణి అని చెప్పొచ్చు కూడా .

ఎవరీ కొలికపూడి శ్రీనివాసరావు .....
తాడికొండ ప్రాంతవాసి , ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటూ కోచింగ్ సెంటర్ నడపుతున్నానని చెబుతుంటాడు . ఐఏఎస్ ఐపీఎస్ లను తయారు చేస్తుంటానని అతను చెప్పుకొంటాడు . 2019 కి ముందు వైసీపీ పార్టీ నామం జపిస్తూ తిరిగిన ఇతను అడపాదడపా పార్టీ సానుభూతిపరుణ్ణి , పార్టీ దళిత నాయకుణ్ణి అని చెప్పుకొంటూ కొన్ని ఛానెల్స్ డిబేట్లలో పాల్గొన్నా పార్టీ పరంగా ఏ ప్రాతినిధ్యం లభించలేదు .

2019 ఎన్నికల తర్వాత టీడీపీతో సాన్నిహిత్యం పెంచుకున్న కొలికపూడి తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విధానానికి వ్యతిరేకంగా కోర్టు వివాదాల్లో చంద్రబాబు దృష్టిలో పడ్డాడని చెప్పొచ్చు . తరువాతి రోజుల్లో రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా అంటూ టీడీపీ సానుభూతిపరులతో ఆ ప్రాంతంలో పర్యటనలు చేస్తూ అమరావతి జేఏసీ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ప్రకటించుకొని ఉద్యమ శిబిరాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా ,ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా రూపాంతరం చెందాడు .దీనితో పాటు దుందుడుకు ప్రవర్తనతో పలు వివాదాలకు మూలంగా నిలిచాడు .

తీవ్ర పదజాలంతో వైసీపీని దూషించటానికి మాత్రమే కాక , టీడీపీకి , అమరావతి రాజధానికి సానుకూలం కాని వ్యక్తుల పై మాటల దాడితో పాటు భౌతిక దాడులు చేయటానికి , గలాటాలు సృష్టించటానికి సైతం వెనకాడకుండా వ్యవహరించడంతో ఇతను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయం మరింత బలపడింది ..
ఓ టీవీ చానెల్ డిబేట్లో బిజెపి నేత పై చెప్పుతో దాడి చేయటం , రఘురామరాజు అరెస్ట్ రోజు అతని ఇంటివద్ద గలాభా సృష్టించే యత్నం చేయడం , పలు ఇంటర్వ్యూల్లో టీడీపీకి వ్యతిరేకంగా అభిప్రాయాలు వెలిబుచ్చిన వారి పై అభ్యంతరకర భాషతో దాడి చేయడం చూసిన ప్రజలకు ఈ రోజు జరిగిన పరిణామాలు పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు కానీ

రాయలసీమ ప్రాజెక్టులకు మద్దతుగా వైఎస్ షర్మిల ఇంటి ముందు ధర్నా ఎందుకు చేసాడో మాత్రం చాలా మందికి అర్ధం కాకపోవచ్చు .

నిజానికి వైఎస్ షర్మిల తెలంగాణా నీటి హక్కుల కోసం అవసరమైతే పోరాడతాం అన్నారు కానీ సీమ , కోస్తా ప్రాంతాలలోని ఏ ప్రాజెక్టులకు కానీ , ఏపీ రాష్ట్రానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదు . ఈ అంశంలో ఏదైనా మాట్లాడినా , క్రియాశీలకంగా వ్యవహరించినా అది అధికార టీఆర్ఎస్ , కొందరు బీజేపీ నేతలు మాత్రమే . అలాంటప్పుడు వారి ఆఫీసుల ముందు ధర్నా చేయకుండా ఏ విధమైన వ్యతిరేక వ్యాఖ్య చేయని వైఎస్ షర్మిల ఇంటి వద్ద గలాభా సృష్టించటంలోని ఆంతర్యం వైసీపీని ఇరుకున పెట్టటం లేదా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పెంచే ప్రయత్నమే అని చెప్పొచ్చు .

రాజధాని నిర్మాణం మాత్రమే కాక రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వచ్చినా , ఏ కంపెనీ స్థాపించినా , ఏ కేంద్ర సంస్థ కేటాయించినా అవన్నీ అమరావతిలోనే ఉండాలనే స్వార్ధ చిత్తంతో వ్యవహరించే బాబు ప్రేరేపిత అమరావతి ఉద్యమకారులు రాయలసీమ నీటి హక్కుల పేరిట ధర్నా చేయటమే విచిత్రం అయితే , అందులో సీమ రైతులు పాల్గొన్నారని ఒక వర్గ మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదం .

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణా బిజెపి నేత బండి సంజయ్ కేంద్ర జలశక్తి సంఘ్ కి పిర్యాదు చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా వైసీపీతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు ఆందోళన చేశారు కానీ ఇది వైసీపీ , టిఆర్ఎస్ నాటకం అంటూ దాటవేత ధోరణి అవలంబించారు టీడీపీ అధినేత చంద్రబాబు . ఈ రోజు సీమ పట్ల సవతి ప్రేమ చూపిస్తున్న అమరావతి జేఏసీ స్వయం ప్రకటిత అధ్యక్షుడు కొలికపూడి ఆ రోజు ఎందుకు స్పందించలేదు అనే సీమ వాసుల ప్రశ్నకి ఏమి సమాధానం చెబుతాడో వేచి చూడాలి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp