బాబా రాందేవ్‌ "కరోనిల్" కు మా గుర్తింపు లేదంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ..

By Rishi K Feb. 23, 2021, 09:25 am IST
బాబా రాందేవ్‌ "కరోనిల్" కు మా గుర్తింపు లేదంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ..

యోగా గురు బాబా రాందేవ్‌ కరోనిల్ ఔషధం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారా? తన అసత్య ప్రచారాల కోసం రాజకీయ నాయకుల సహకారాన్ని తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కరోనా ఉపద్రవం అనంతరం పతంజలి సంస్థ రూపొందించిన కరోనిల్ ఔషధం పలు వివాదాలకు కారణం అయింది. తాజాగా తమ కరోనిల్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిందని బాబా రాందేవ్ ప్రకటించడం వివాదాస్పదం అవుతుంది.

పతంజలి సంస్థ కరోనిల్ ఔషధం రూపొందిన అనంతరం బాబా రాందేవ్ పత్రికాముఖంగా కరోనిల్ ఔషధానికి డీసీజీఐ నుండి అనుమతి వచ్చిందని కరోనిల్ కిట్ కరోనా వైరస్ ని సమర్ధవంతంగా అంతం చేస్తుందంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దాంతో ఆశ్చర్యపోవడం ప్రజలందరి వంతయ్యింది. బాబా రాందేవ్ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కరోనిల్ ఔషధానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటూ డీసీజిఐ ప్రకటన ఇచ్చింది. కరోనిల్ కిట్ ను ఇమ్యూనిటీ బూస్టర్ గా పేర్కొంటూ పతంజలి సంస్థ అనుమతి పొందిందంటూ డీసీజిఐ ప్రకటించింది. అనంతరం కొన్ని లక్షల కరోనిల్ కిట్లు అమ్ముడుపోయాయని పతంజలి సంస్థ ప్రకటించి తమ ఔషధాన్ని ప్రజలు విశ్వసించారని పేర్కొంది.

తాజాగా బాబా రాందేవ్ ఈసారి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకే షాక్ ఇచ్చారు.. తమ కరోనిల్‌ను కరోనా చికిత్సకు ఉపయోగపడే ఆయుర్వేద ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిందని ప్రకటించి సంచలనం సృష్టించారు. బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో చేయడం గమనార్హం. అంతేకాకుండా కరోనిల్ ఔషధాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ధృవీకరించిందని ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓ ధృవీకరణ నిబంధనలను అనుసరించి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)లోని ఆయుష్ విభాగం నుంచి కరోనిల్‌కు సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ (సీఓపీపీ) లభించిందని కాబట్టి కరోనిల్‌ను 158 దేశాలకు ఎగుమతి చేయవచ్చని బాబా రాందేవ్ ప్రకటించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనిల్ ఔషధాన్ని ధృవీకరించిందని బాబా రాందేవ్ చేసిన ప్రకటన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ఔషధం సామర్థ్యాన్ని తాము పరిశీలించలేదని, దానికి ఏ రకమైన ధృవీకరణ పత్రాన్నీ జారీ చేయలేదని డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర్లో తెలిపింది. బాబా రాందేవ్ వ్యాఖ్యలకు స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కరోనిల్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిందని వస్తున్న వార్తలు అసత్యాలని స్పష్టం చేసింది.

బాబా రాందేవ్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. పతంజలి సంస్థ చేస్తున్న అసత్య ప్రచారానికి వత్తాసు పలుకుతూ సమావేశానికి హాజరయిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. కరోనిల్ క్లినికల్ ట్రయల్స్ ఎక్కడ చేసారని రుజువులు చూపాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరింది. దేశానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా అసత్య ప్రచారాలు ఎలా చేయగలుగుతారని ఐఎంఏ నిలదీసింది.

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాలను క్యాష్ చేసుకోవడానికి బాబా రాందేవ్ వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుబడుతున్నారు. గతంలో కూడా ఏ విధమైన అనుమతి పొందకుండానే కరోనాకు మందు తయారు చేశామని ప్రకటించి విమర్శలపాలయినా సరే బాబా రాందేవ్ బుద్ధి మారలేదని కొందరు దుయ్యబడుతున్నారు. ఏది ఏమైనా పతంజలి సంస్థ తయారుచేసిన కరోనిల్ కిట్లను ప్రజలపై రుద్దాలని రాజకీయ నాయకుల సహకారంతో బాబా రాందేవ్ అసత్యాలు ప్రచారం చేయడానికి పూనుకున్నారని ఆ మాటలు విశ్వసించవద్దని ఇమ్యూనిటీ బూస్టర్ అని ఒకసారి, కరోనాకి మందని ఒకసారి, దగ్గు జలుబు తగ్గించే ఔషధం అని మరోసారి చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బాబా రాందేవ్ ప్రయత్నం చేస్తున్నారని కాబట్టి అలాంటి అసత్య ప్రచారాలని విశ్వసించవద్దని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp