ఢిల్లీలో యోగి.. యూపీలో ఏం జ‌ర‌గ‌బోతోంది?

By Kalyan.S Jun. 11, 2021, 07:35 am IST
ఢిల్లీలో యోగి.. యూపీలో ఏం జ‌ర‌గ‌బోతోంది?

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డం, అది బీజేపీకి కీల‌క రాష్ట్రం కావ‌డంతో రాజకీయంగా ఇప్పుడు అంద‌రి చూపూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పైనే ఉంది. ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పైనే దృష్టి సారిస్తున్నారు. రాహుల్ గాంధీ సన్నిహితుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేర‌డంతో రాజ‌కీయ వేడి మ‌రింత రాజుకుంది.

దీనికితోడు ఆ మ‌ర్నాడే ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి చేరుకోవ‌డంతో ప‌లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పైగా రెండు రోజుల పాటు ఆయ‌న ఢిల్లీలోనే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నాయ‌క‌త్వ మార్పుపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర పెద్ద‌లు క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ అక‌స్మాత్తుగా యోగి ఢిల్లీలో ప్ర‌త్య‌క్షం కావ‌డం, నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని సైతం క‌లుస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

వ‌రుస స‌మావేశాల‌తో బిజీబిజీగా
బుధవారం అర్థరాత్రి లక్నోలో రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌తో యోగి సమావేశం నిర్వహించారు. ఇది ప్రతి నెలా జరిగే సాధారణ సమావేశం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఈ మీటింగ్‌కి హాజరు కావడానికి సునీల్ బన్సాల్ హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన లక్నోకు చేరుకున్నారని రాజకీయ వర్గాలు పేర్కొన‌డంతో ఉత్కంఠ ఏర్ప‌డింది.

దీనికి తోడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసానికి చేరుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డాను కూడా యోగి క‌లిసిన‌ట్లు తెలిసింది. శుక్ర‌వారం న‌డ్డాతో పాటు యోగి కూడా ప్ర‌ధాన‌మంత్రిని కలుస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేబినెట్ విస్తరణ, వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి యోగి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షాతో ఆ పార్టీ ఎంపీ కూడా...
మరోవైపు అప్నా దళ్ (ఎస్) అధ్యక్షుడు, ఎంపి అనుప్రియా పటేల్ అమిత్ షాతో కేబినెట్ విస్తరణపై సమావేశం అయ్యారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి మీర్జాపూర్ ఎంపి అనుప్రియ తన అభిప్రాయాలను షా ముందు ఉంచవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా రాబోయే జిల్లా పంచాయతీ అధ్యక్ష ఎన్నికలు కూడా వారి ఎజెండా కావచ్చని తెలుస్తోంది. అలాగే, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో అభ్యర్థుల గురించి కూడా అనుప్రియా పటేల్, అమిత్ షా ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

యోగి యూపీకి తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ప్రకటించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అనేక కొత్త ముఖాలు ప్రభుత్వంలో స్థానం పొందే చాన్స్ ఉందని అంటున్నారు. ఇది కాకుండా, కొంతమందికి పార్టీలో కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని కార్పొరేషన్లు, కమీషన్లు, బోర్డుల పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp